ఒక్కోసారి ఎంతటి వీరుడైనా బొక్కబోర్లా పడొచ్చు. ‘సప్త సముద్రాలు ఈదిన గజ ఈతగాడు పిల్లకాల్వలో పడిపోయాడు’ అనే సామెత చందమన్నమాట. ఇంతకీ విషయమేమిటంటే తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ పత్రికగా వెలుగొందుతున్న ఆంధ్రజ్యోతి పత్రిక ఆదివారం వేళ ఓ బాంబు లాంటి వార్తను పేల్చింది. ‘కొత్త పలుకు’ పేరుతో ఆ పత్రిక అధినేత కమ్ జర్నలిస్ట్ వేమూరి రాధాకృష్ణ ప్రతి ఆదివారం తన వ్యాస పరంపరను కొనసాగిస్తుంటారు తెలిసిందే కదా? అందులో భాగంగానే ఎప్పుడూ ఎడిటోరియల్ పేజీలో దర్శనమిచ్చే ఈ కొత్తపలుకు కాలమ్ ఈ ఆదివారం ఫస్ట్ పేజీలోకి ఎగబాకింది. దాదాపు ఆర పేజీ ఇంట్రో… అంటే ఉపోద్ఘాతంతో మిక్సయిన ముఖ్యాంశాలతో నింపేశారన్నమాట.
ఆర్కే కొత్త పలుకు ద్వారా తన పాఠకులకు అందించిన ‘స్కూప్’ ఏమిటంటే ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల ఉన్నారు కదా? జగన్ కు, ఆమెకు పొసగక రాజకీయ పార్టీని స్థాపిస్తున్నారట. తనకు ఇచ్చిన హామీలను జగనన్న నెరవేర్చడంలేదని, అధికారంలోకి వచ్చాక ఎంపీని చేస్తానని, లేదంటే తెలంగాణాలో పార్టీ పెట్టించి సీఎంగా చేస్తానని జగన్ హామీ ఇచ్చారా? అనే సందేహాలను వ్యక్తం చేస్తూ ఆర్కే తన కొత్త పలుకును కొనసాగించారు. తన కూతురుకు జరిగిన అన్యాయంపై వైఎస్ విజయలక్ష్మి కూడా జీర్ణించుకోలేకపోతున్నారా? అనే సందేహాన్ని కూడా ఆర్కే వ్యక్తం చేశారు. ఇటు రాజకీయ రంగంలో, అటు తండ్రి ప్రారంభించిన వ్యాపారాల్లోనూ షర్మిలను ఎదగనీయకుండా, తన పాత్ర లేకుండా చేసిన జగనన్నపై షర్మిల మండిపడుతున్నారా? అంటూ ఆర్కే ఉపోద్ఘాతంలో రాశారు. ప్రశ్నలను సందేహిస్తూనే సమాధానం ఔననిపిస్తోందని ముక్తాయించారు.
మొత్తంగా ఆర్కే రాసిన కొత్త పలుకులోని సుదీర్ఘ వ్యాసపు సారాంశం ఏమిటంటే వైఎస్ షర్మిల ఓ కొత్త రాజకీయ పార్టీని స్థాపించబోతున్నారని, ఆ పార్టీ పేరు ‘తెలంగాణా వైఎస్ఆర్ కాంగ్రెస్’ అని కూడా నామకరణం చేసుకున్నారని. ఇందుకు సంబంధించి వచ్చే నెల 9న ప్రెస్ మీట్ పెట్టి మరీ షర్మిల ఈ విషయాన్ని ప్రకటించబోతున్నారని ఆర్కే తన వ్యాసంలో స్పష్టం చేశారు. షర్మిల ప్రారంభించే పార్టీ పట్ల జగన్ కలత చెందుతున్నారని, తెలంగాణాలో ప్రారంభించే పార్టీ ఆ రాష్ట్రానికే పరిమితమవుతందనే గ్యారంటీ లేదని, ఆంధ్రప్రదేశ్ కు కూడా పాకవచ్చనేది కూడా జగన్ కలతకు కారణమట. అంతిమంగా ఆర్కే రాసిన ఈ వ్యాసపు సారాంశం ఏమిటంటే జగన్ పై కోపంతో షర్మిల పార్టీని స్థాపిస్తున్నారని. తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అది పెద్ద కుదుపే అవుతుందని ముక్తాయించారు. ఆర్కే తన వ్యాసంలో ఇంకా అనేక అంశాలను సృశించారు. అవన్నీ పాయింట్ల వారీగా ప్రస్తావించాలంటే చాంతాడంత అవుతుందిగానీ, అసలు విషయాన్ని మాత్రం ఆర్కే తన వ్యాసంలో విస్మరించడమే విశేషం.
ఓకే, జగన్ పై షర్మిలకు కోపమే వచ్చిందనుకుందాం. ఇచ్చారో లేదో తెలియదుగాని, ఇచ్చినట్లు పేర్కొన్న హామీలను జగన్ నెరవేర్చలేదనే భావిద్దాం. అన్నపై అలిగిన చెల్లెలిగా పార్టీ పెట్టాలని షర్మిల తలంపుగానే కాసేపు విశ్వసిద్దాం. అప్పుడు షర్మిల ఏం చేయాలి? తను ప్రారంభించబోయే రాజకీయ పార్టీకి వేదికగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఎంచుకోవాలి? తెలంగాణాను కేంద్రంగా ఎంచుకోవడమేంటి? ఇదీ అసలు సందేహం. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి చరిష్మా వేరు, ఆయనకు గల అభిమానులు వేరు. ఆయన చనిపోయిన సందర్భంగా గుండెలాగి మరణించిన కుటుంబాల వేదన వేరు. కానీ ఆ తర్వాత అనేక రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. తెలంగాణా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక, ఏడేళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో జగన్ సైతం తన రాజకీయ పయనాన్ని ఆంధ్రప్రదేశ్ కే పరిమితం చేసుకున్నారు. దాదాపు రెండేళ్ల క్రితం ఏపీలో అధికారం కూడా చేపట్టారు. తెలంగాణాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉనికి కూడా ప్రశ్నార్థకంగానే మారింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎంపీ హోదాలో, మరో ముగ్గురు నాయకులు ఎమ్మెల్యేల హోదాల్లో గులాబీ పార్టీలో చేరిపోయారు. ఆ తర్వాత అనేక ఎన్నికల్లో ఆ పార్టీ పోటీ చేసిన దాఖలాలు కూడా నామమాత్రమే.
జగన్ అన్యాయం చేశారని షర్మిల నిజంగానే భావిస్తే, తాను సొంతంగా రాజకీయ పార్టీని స్థాపిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్నే తన రాజకీయ భవితకు మార్గదర్శిగా ఎంచుకోవాలి. అంతే తప్ప తెలంగాణాలో పార్టీని ఏర్పాటు చేసి పోరాటం చేయనున్నారనే ఆర్కే వ్యాసంలో ఎక్కడో, ఏదో లోపించినట్లు కనిపించడం లేదూ? ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో వైఎస్ జగన్ అయినా, షర్మిల అయినా తెలంగాణావాసులకు రాయలసీమ రెడ్లుగానే గోచరిస్తారనేది నిర్వివాదాంశం. షర్మిల సీఎం కావాలని కాంక్షిస్తే అది ఏపీలో తప్ప తెలంగాణాలో సాధ్యం ఎలా అవుతుందనే వాదనా ఈ సందర్భంగా వినిపిస్తోంది. షర్మిల పార్టీని స్థాపిస్తే ఆమె వెంట నడిచే తెలంగాణా రెడ్లు ఎవరు? ఇది మరో సందేహం. అన్నపై ఆగ్రహంతో షర్మిల తెలంగాణాలో పార్టీని స్థాపించి సీఎం అవుతారనే వాదనే సహేతుకంగా లేదని చెప్పవచ్చు. ఆంధ్రప్రదేశ్ ను వదలి తెలంగాణాను ఆమె ఎందుకు ఎంచుకుంటారన్నది మరో ప్రశ్న. ఈ చిన్న లాజిక్ కు మిస్సయిన ఆర్కే కొత్తపలుకు ఈసారి బహువిధ విన్యాసాన్ని చేయడమే ప్రత్యేకత. అందువల్ల ఆంధ్రజ్యోతి ఆర్కే కొత్తపలుకు వ్యాసం ఈసారి ఆసాంతం ‘కిచిడీ’. ఒకదానికి మరొకటి లింక్ లేని కొనసాగింపు. కాస్త మసాలా ఎక్కువైనట్లుంది. అందుకే రుచి కుదరక వెగటు వాసన వస్తున్నట్లుంది. ఇంకా నయం మంత్రి కేటీఆర్ ను సీఎంగా పట్టాభిషేక్తున్ని చేస్తే కల్వకుంట్ల కవిత అలిగి కొత్త రాజకీయ పార్టీని స్థాపిస్తారని ఆర్కే రాయలేదు. అలా రాస్తే ఆర్కే ‘పలుకు’ సరికొత్తగా పేలి ఆంధ్రజ్యోతి పాఠకులకు ఈవారం ఆసక్తికరంగా ఉండేదేమో కదా!