ఏదేని సంచలన వార్తా కథనం ప్రచురించినపుడు దాన్ని సమర్థించుకోవడానికి కొన్ని మీడియా సంస్థలు నానా పాట్లు పడుతుంటాయి. తాము రాసిన వార్తా కథనం సరైనదేనని మరింత బలంగా వాదిస్తూ మరో కథనాన్ని తమ పాఠకుల ముందుంచుతాయి. రూపురేఖలు మార్చుకుంటున్న జర్నలిజంలో ఇదీ ఓ శైలే కాబోలు. పోటీదారులవల్ల సాధ్యంకాని అంశాన్నితాము మాత్రమే ఛేదించామని భావించినపుడు ఈ తరహా విన్యాసాలు చేస్తుంటాయి. కానీ గతంలో ఈ తరహా పద్ధతులు వేరు. ఉదాహరణకు ఏదైనా శాఖలో అవినీతి, కుంభకోణం వంటి ఘటనలు చోటు చేసుకుంటే, దాని మూలాలను తవ్వి ఆధారాలతో సహా బహిర్గతం చేయడం పరిశోధనాత్మక జర్నలిజపు శైలి. కానీ ‘ప్లాంటెడ్’గా భావించే స్టోరీలను ప్రజల్లోకి వదిలినపుడు మాత్రం తమ వాదనను సమర్థించుకోవడానికి మరింత శ్రమించాల్సి ఉంటుంది. తెలుగు మీడియాలో ఈ తరహా పోకడలు అనేకం. ఇప్పుడీ సంచలన ‘కత’ల ప్రస్తావన దేనికంటే…?
దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు వైఎస్ షర్మిల ‘తెలంగాణా వైఎస్ఆర్ కాంగ్రెస్’ పేరుతో ఓ పార్టీని ఏర్పాటు చేయనున్నారని, ఫిబ్రవరి 9వ తేదీన మీడియా సమావేశంలో ఈ విషయాన్ని ప్రకటించనున్నారని ఆంధ్రజ్యోతి గ్రూప్ సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ నిన్న ‘పొలిటికల్ బ్రేకింగ్’ స్టోరీని పబ్లిష్ చేశారు. వార్తా కథనాల కేటగిరీలో ఇది ఓ వార్త మాత్రమే, కానీ ప్రతి ఆదివారం ‘కొత్తపలుకు’ కాలమ్ ద్వారా ఎడిటోరియల్ పేజీలో తాను రాసే విశ్లేషణాత్మక వ్యాసం తరహాలో ఈ వార్తను ఫస్ట్ ప్రచురించడమే ఓ విశేషం. సరే, తాను స్వయంగా రాసుకున్న విషయాలను తన పత్రికలో ఏ పేజీలోనైనా ప్రచురించుకునే హక్కు ఆయనకు ఉంది. ఆ పత్రిక మేనేజింగ్ డైరెక్టర్ గా ఆయన సర్వకోణాల్లో విశేషాధికారాలను కలిగి ఉంటారు. అయితే నిన్నటి ఈ ‘పొలిటికల్ బ్రేకింగ్’ స్టోరీని సమర్థించుకోవడానికి తాజాగా చిత్ర, విచిత్ర విన్యాసాలను ప్రదర్శిస్తూ మరో వార్తా కథనాన్ని ప్రచురించడమే నయా జర్నలిజపు పోకడల్లో ఆసక్తికర అంశం.
ఇంతకీ తాజా కథనంలో రాధాకృష్ణ ఉరఫ్ ఆర్కే ఏమంటారంటే… ‘కొత్తపలుకు’ కాలమ్ ద్వారా బయటకు వచ్చిన ఈ విషయంపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోందట. ఇటువంటి పొలిటికల్ బ్రేకింగ్ అంశాలను ఆర్కే కాలమ్ నుంచేకాదు, ఎవరి కలం నుంచి వచ్చినా కాస్త చర్చ జరుగుతుందనేది కాదనలేని వాస్తవం. తన సోదరుడు వైఎస్ జగన్ పై కోపంతో రాజకీయ పార్టీని స్థాపించాలని షర్మిల నిర్ణయించుకున్నట్లు పేర్కొన్న ఆర్కే, ఆ పార్టీని ఏపీలో కాకుండా తెలంగాణాలో ఎందుకు స్థాపిస్తున్నారు? అందుకు గల బలమైన కారణామేంటి? అనే అంశాలను మాత్రం తన పాఠకులకు స్పష్టంగా చెప్పలేకపోవడం గమనార్హం. తాజా కథనంలోనూ ఆర్కే మరిన్ని అంశాలను ప్రస్తావించారు. వాటిలో కొన్నింటిని పరిశీలిస్తే…
‘వివిధ పార్టీలకు చెందిన కొందరు నాయకులు బాహాటంగా, అంతర్గతంగా షర్మిల కొత్త పార్టీని స్వాగతిస్తున్నారు’ అని పేర్కొన్నారు. కానీ బాహాటంగా స్వాగతించే నాయకులెవరనేది, వారి పేర్లేమిటనేది మాత్రం ఉటంకించలేదు.
అదేవిధంగా షర్మిలకు తెలంగాణాతో గల అనుబంధాన్ని మరోసారి ప్రస్తావిస్తూ, జగన్ జైల్లో ఉన్నపుడు సాగించిన పాదయాత్రను ఉటంకించారు. కానీ షర్మిల పాదయాత్ర సాగింది ఉమ్మడి రాష్ట్రంలో అనే విషయాన్ని విస్మరించడం విశేషం.
అదేవిధంగా వ్యూహాత్మకంగా షర్మిల పార్టీకి బీజేపీ మద్ధతిస్తే? అనే ప్రశ్నార్థకపు సింగిల్ కాలమ్ వార్తను కూడా అసలు వార్తకు అనుబంధంగా ప్రచురించారు. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల జోష్ తో వచ్చే సాధారణ ఎన్నికలనాటికి అధికారమే లక్ష్యంగా పోరాడుతున్న బీజేపీ ఆర్కే ‘కొత్తపలుకు’ కాలమ్ ద్వారా బయటకుతీసిన షర్మిల పార్టీకి మద్థతిస్తుందా? అనేది అసలు సందేహం.
బీజేపీకి కులాల వారీ ఓట్లు లేవని, హిందూత్వాన్ని రాజేసి రాజకీయ ప్రయోజనం పొందుతున్నారని కూడా తాజా కథనంలోని మరో ముఖ్య వాక్యం. అందువల్ల షర్మిల పెట్టబోయే పార్టీని ప్రోత్సహిస్తే తమకు రాజకీయంగా కొంత సానుకూలమవుతుందని, కొత్త ఓటు బ్యాంకును సుస్థిరం చేసుకోవచ్చని బీజేపీ నేతలు అభిప్రాయపడుతున్నారట. నలుగురు ఎంపీలు, ఇద్దరు ఎమ్మెల్యేలు, జీహెచ్ఎంసీలో 48 మంది కార్పొరేటర్ల స్థాయికి బలం పెంచుకున్న బీజేపీ ఇంకా ‘పురుడు’కూడా పోసుకోని కొత్త పార్టీకి మద్ధతు ఎలా ఇస్తుందనేది మరో ప్రశ్న.
ఇక షర్మిల పార్టీ పెడితే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడినవారు మళ్లీ తిరిగి వస్తారా? అని కూడా ఆశాజనక ప్రశ్నను రేకెత్తించారు. అప్పుడే ఓట్ల చీలిక వరకు కూడా తాజా కథనం సాగింది. ఆకుకు అందని, పోకకు పొసగని అంశాలతో సాగిన ఆయా వార్తా కథనాన్ని సమర్థించుకునేందుకు అపసోపాలు పడిన అర్కే పత్రిక ‘ప్రొఫెషనల్ స్కిల్’ను విస్మరించినట్లు కనిపిస్తోంది. అదేమిటంటే…? నిన్నటి ‘కొత్తపలుకు’ కాలమ్ ద్వారా ఆర్కే పేల్చిన పొలిటికల్ బ్రేకింగ్ స్టోరీకి మరింత బలం చేకూర్చేందుకు అవసరమైన నెట్ వర్క్ ను ఆంధ్రజ్యోతి పత్రిక కలిగి ఉంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఆ సంస్థకు గల నెట్ వర్క్ శక్తివంతమైంది కూడా. అందువల్ల చేయాల్సిందేమిటి? షర్మిల పార్టీ పెడితే ఎలా ఉంటుందని తెలంగాణాలోని కొందరు రాజకీయ నేతలను కలిసి కదలించాల్సింది. మీ అభిప్రాయమేమిటని ప్రశ్నించాల్సింది.
ముఖ్యంగా ఒకప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలంగాణా అధ్యక్షునిగా వ్యవహరించిన పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఆ పత్రిక ప్రతినిధులు కలిసి అతని అభిప్రాయాన్ని తీసుకోవలసింది. కనీసం గట్టు శ్రీకాంత్ రెడ్డినో, శివకుమార్ నో, మరే ఇతర నాయకుల నోటి నుంచి కామెంట్లు తీసుకోవలసింది. ఇంకా వీలయితే జిల్లాల వారీగా సామాన్య ప్రజానీకం నుంచి అభిప్రాయాలు సేకరిస్తే బాగుండేది. షర్మిల పార్టీని రిజిస్ట్రేషన్ చేశారా? చేస్తే అందుకు సంబంధించిన కాగితాలను వెతికి పట్టుకుని బహిర్గతం చేయాల్సింది. అప్పుడు ఆర్కే కొత్తపలుకు ద్వారా తన పాఠకుల ముందుంచిన షర్మిల పార్టీ వార్తా కథనానికి మరింత బలం చేకూరేది. ఇటువంటి కసరత్తు ఏదీ చేయకుండా తన ‘కొత్తపలుకు’ కథనంపై తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోందని, బీజేపీ అండగా నిలిచే ఛాన్స్ ఉందని, తన కథనంలోని అంశాలపై వైసీపీ కీలక నేతలు బహిరంగంగా వ్యాఖ్యలు చేయడంలేదని, వ్యూహత్మక మౌనం పాటిస్తున్నారని బేసిక్ గా జర్నలిస్టు అయిన ఆర్కే పత్రిక రాసుకుంటే…. ‘ప్రొఫెషనల్ జర్నలిజం’ వీడి సాము చేస్తున్నట్లు కనిపించడం లేదూ!
కాగా ఈ మొత్తం ఎపిసోడ్ లో ఆంధ్రజ్యోతి తాజాగాప్రచురించిన వార్తా కథనం ఏపీ ఎడిషన్ లో ఓ రకంగా, తెలంగాణా ఎడిషన్ లో మరో రకంగా ఉండడం గమనార్హం. ఒకే సారాంశపు కథనాన్ని ఉభయ తెలుగు రాష్ట్రాల్లో భిన్న రీతుల్లో ప్రచురించడంపైనా సందేహాలు వ్యక్తమవుతున్నాయి.