మొత్తానికి తెలుగు పత్రికా రంగంలో ఆంధ్రజ్యోతి అధినేత వేమూరి రాధాకృష్ణ క్రెడిట్ కొట్టేశారు. జర్నలిజంలో ముందు ఎవరు ‘స్కూప్’ అందిస్తే వాళ్లే ఆ వార్తా కథనానికి హీరోలు. ఇందులో ఎటువంటి సందేహాలు లేవు. సరే మధ్యలో ముచ్చట్లు చెప్పేవారు కొందరు మొత్తం తమ ఘనతగానే చెప్పుకోవచ్చు… రాసుకోవచ్చు. ‘క్రెడిట్’ కొట్టేసిస జర్నలిస్టును మెచ్చుకోవడం కూడా జర్నలిజంలో అత్యంత అరుదు. ఇక్కడ అంతటి విశాల హృదయాలకన్నా, ఈర్ష్యాద్వేషాలే ఎక్కువనేది అందరికీ తెలిసిందే. విషయమేమిటంటే… ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాసినట్లుగానే ఫిబ్రవరి 9న వైఎస్ షర్మిల తన రాజకీయ కదలికలను ప్రారంభించారు. లోటస్ పాండ్ లో నల్లగొండ జిల్లా నేతలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. తెలంగాణాలో రాజన్న రాజ్యం తేవాలని ఉందని, ఇందుకు సంబంధించి వివిధ జిల్లా నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నట్లు కూడా చెప్పారు. తన తోడబుట్టిన అన్న ఆశీస్సులు తనకు ఉన్నట్లు కూడా ఆమె వ్యాఖ్యానించారు. కానీ తెలంగాణాలో పార్టీ వద్దనేది తమ నిర్ణయమని, ఇదే విషయం షర్మిలకు చెప్పామని, పార్టీ ఏర్పాటు ఆమె వ్యక్తిగతమని వైఎస్ఆర్ సీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే షర్మిల పార్టీపై రాష్ట్ర వ్యాప్తంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వివిధ రాజకీయ పక్షాలకు చెందిన నేతలు ఎవరి వాదన వారు వినిపిస్తున్నారు.
కానీ షర్మిల పార్టీ వెనుక అసలు ఎవరున్నారనే అంశంపైనా భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. బీజేపీ జాతీయ నాయకత్వం ఆడిస్తున్న నాటకమని, టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ వేసిన పథకమని బీజేపీ నేతలు అంటున్నారు. ఇందుకు రకరకాల విశ్లేషణలు చేస్తున్నారు. కానీ సమైక్యవాదాన్ని వినిపించిన వైఎస్ కుటుంబానికి చెందిన షర్మిల తెలంగాణాలో పార్టీ ఏర్పాటుకు సాహసించడం, కసరత్తు ప్రారంభించడమే అసలు విశేషం. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డికి తెలంగాణాలో ఇప్పటికీ అభిమానులు ఉన్నారనేది వేరే విషయం. కానీ ఆయన అభిమానులను వైఎస్ జగన్మోహన్ రెడ్డి దూరం చేసుకున్నారనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. మంత్రి పదవులను త్యాగం చేసిన నాయకులతోపాటు వైఎస్ రాజశేఖర్ రెడ్డికి సన్నిహితంగా మెలిగిన పలువురు కాలానుగుణంగా జగన్ కు దూరం జరగక తప్పలేదని చెప్పేందుకు అనేక ఉదాహరణలు ఉన్నాయి. వైఎస్ మరణించిన సందర్భంగా వెక్కి వెక్కి ఏడ్చి ‘గుండె’ పగలి మరణించినవారి సంఖ్య ఆంధ్రాలోకన్నా తెలంగాణాలోనే ఎక్కువగా ఉంది కూడా. రాష్ట్ర విభజన అనంతరం 2014లో జరిగిన ఎన్నికల్లో ఓ ఎంపీని, ముగ్గురు ఎమ్మెల్యేలను తెలంగాణా ప్రజలు గెలిపించారంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై ఉన్న అభిమానంతో మాత్రమే అనే విషయం సుస్పష్టం. కానీ ఆ తర్వాత పరిణామాల్లో అటు వైఎస్ కుటుంబంగాని, ఇటు జగన్ సర్కార్ గాని తెలంగాణాలోని వైఎస్ అభిమానులను అస్సలు పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో వైఎస్ షర్మిల తన రాజకీయ పార్టీకి తెలంగాణానే ఎందుకు వేదికగా ఎంచుకున్నారనేది అసలు ప్రశ్న. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తన తొలి కథనంలో రాసిన ప్రకారం… తన సోదరునితో విభేదాలు ఉన్నట్లు షర్మిల మంగళవారంనాటి లోటస్ పాండ్ పరిణామాల అనంతరం ఎక్కడా ప్రకటించలేదు. పైగా తనకు జగన్ ఆశీస్సులు ఉన్నట్లు భావిస్తున్నానని కూడా వెల్లడించారు. ఏ పత్రికగాని, ఛానల్ గాని ఓ కుటుంబానికి సంబంధించిన విషయాలను రాయడమే తప్పని పేర్కొంటూ, నీతిమాలిన చర్యగా షర్మిల ఆంధ్రజ్యోతి కథనం రాసిన సందర్భంగా అభివర్ణించారు. ఇటువంటి తప్పుడు రాతలు రాసిన పత్రికపై న్యాయపరమైన చర్యలకు వెనుకాడేది లేదని కూడా ఆంధ్రజ్యోతి రాసిన కథనంపై ఓ ప్రకటన విడుదల చేశారు. కానీ తన పార్టీ ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియను షర్మిల ప్రారంభించినట్లు మంగళవారంనాటి ఆత్మీయ సమావేశం స్పష్టం చేస్తున్నది.
ఈ పరిస్థితుల్లో అసలు షర్మిల పార్టీ వెనుక ఎవరున్నారనేది అసలు ప్రశ్న. ఎందుకంటే తన పార్టీకి తెలంగాణా గడ్డను షర్మిల వేదికగా ఎంచుకోవడంపై భిన్నప్రచారం సాగుతోంది. తెలంగాణాలో ఆర్థికంగా ‘బడా రెడ్లు’గా ప్రాచుర్యం పొందిన ఇద్దరు మాజీ ఎంపీలు షర్మిల పార్టీకి అంతర్గతంగా వెన్నుదన్నుగా ఉన్నారనేది ఈ ప్రచారపు సారాంశం. ప్రస్తుతం ఆ ఇద్దరు మాజీ ఎంపీలు వేర్వేరు పార్టీల్లోనే ఉన్నప్పటికీ, గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డితో ఆయా నాయకులకు గల సాన్నిహిత్యం తదితర అంశాలు ఇందుకు దోహదపడినట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. రాజకీయంగా పూర్వవైభవం కోసం శతవిధాలుగా ప్రయత్నిస్తున్న ఆ ఇద్దరు మాజీ ఎంపీలు చేసిన, చేస్తన్న ప్రయత్నాలన్నీ బెడిసికొడుతూనే ఉణ్నాయి. ఈ పరిణామాల్లో షర్మిల పార్టీ వెనుక అసలు ‘స్కెచ్’దారులుగా ఆ ఇద్దరు మాజీ ఎంపీలే ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ఇద్దరు నాయకులు ఇప్పుడే తెరపైకి రాకపోవచ్చని, సరైన సమయంలో, సరైన పద్ధతుల్లో వీరు షర్మిల పార్టీలో సాక్షాత్కరించే అవకాశమున్నట్లు సమాచారం. బహుషా షర్మిల పార్టీకి ఓ రూపం వచ్చి, ఆమె జనంలోకి వెళ్లినపుడు లభించే ఆదరణ ప్రామాణికంగా ఈ ఇద్దరు మాజీ ఎంపీలు రంగప్రవేశం చేయవచ్చనేది అసలు సారాంశం.