‘పార్టీ పెట్టబోతున్నానని మీరే డిసైడ్ అయిపోయారా?’ ఈనెల 9వ తేదీన తనను ప్రశ్నించిన విలేకరులకు వైఎస్ షర్మిల ఇచ్చిన సమాధానమిది. పార్టీ ఎప్పుడు పెట్టబోతున్నారు? అనే ప్రశ్నకు సమాధానంగా ఆమె స్పందించిన తీరిది. అంతేకాదు తెలంగాణాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొనసాగుతుందా? లేక కొత్త పార్టీ ఏర్పాటు చేస్తారా? అనే ప్రశ్నలకు షర్మిల సమాధానమిస్తూ, ‘ తెలియదు… చూద్దాం’ అని వ్యాఖ్యానించినట్లు వార్తలు వచ్చాయి. సరిగ్గా అయిదు రోజుల క్రితం వైఎస్ షర్మిల చేసిన ఈ వ్యాఖ్యల ప్రస్తావన ఇప్పుడెందుకంటే…? ఖమ్మం జిల్లాలో పెద్ద ఎత్తున కార్ల ర్యాలీతో ప్రవేశించాలనే షర్మిల టూర్ వాయిదా పడింది. ఈనెల 21వ తేదీన దాదాపు 250 కార్ల ర్యాలీతో షర్మిల ఖమ్మం జిల్లాలో పర్యటించాలని నిర్ణయించారు. రెండు వందల కిలోమీటర్ల హైదరాబాద్-ఖమ్మం మార్గంలోని చౌటుప్పల్, నార్కట్ పల్లి, నకిరేకల్, సూర్యాపేట వంటి ప్రధాన పట్టణాల్లోని వైఎస్ అభిమానులు వెంటరాగా ఖమ్మంలో అట్టహాసంగా షర్మిల పర్యటనను నిర్వహించాలని భావించారు.
అయితే ఇప్పుడీ పర్యటన అకస్మాత్తుగా వాయిదా పడింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా షర్మిల పర్యటన వాయిదా పడినట్లు వార్తలు వస్తున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత అంటే వచ్చె నెల మూడో వారంలో షర్మిల ఖమ్మం జిల్లాలో పర్యటించే అవకాశాలున్నట్లు భావిస్తున్నారు. వాస్తవానికి షర్మిల పర్యటన వాయిదాకు, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కు సంబంధమేంటో తెలియడం లేదనే వ్యాఖ్యలు ఈ సందర్భంగా వినిపిస్తున్నాయి. వైఎస్ షర్మిలకు ప్రస్తుతం రాజకీయంగాగాని, ప్రజాప్రతినిధి హోదా వంటి ఎటువంటి పదవి కూడా లేదని పరిశీలక వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ షర్మిల తన పర్యటనను కొనసాగించాలంటే అధికారికంగా అనుమతి తీసుకునే వెసులుబాటు సైతం ఉందని పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. షర్మిల పర్యటనకు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణం కాకపోవచ్చనే వాదన కూడా వినిపిస్తోంది. ఇంతకీ ఏం జరిగి ఉంటుంది? షర్మిల పర్యటనకు ఖమ్మం జిల్లాలోని వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులు, ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గల పలువురు నేతలు సన్నాహక సమావేశాలు నిర్వహిస్తూ, ఏర్పాట్లు కూడా చేసుకుంటున్న నేపథ్యంలోనే వాయిదా పడడం వెనుక గల కారణమేంటి? అసలేం జరిగి ఉంటుంది? ఇదీ తాజాగా జరుగుతున్న చర్చ.
రాజకీయ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం ప్రకారం… ప్రస్తుతం బెంగళూరులో గల షర్మిల సోమవారం హైదరాబాద్ కు తిరిగి రానున్నారు. ఈ నేపథ్యంలోనే దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి వైఎస్ విజయమ్మ బెంగళూరుకు వెళ్లారా? పార్టీ ఏర్పాటు విషయంలో షర్మిలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారా? అందువల్లే షర్మిల తన ఖమ్మం జిల్లా పర్యటనను వాయిదా వేసుకున్నారా? ఇదీ తాజాగా జరుగుతున్న ప్రచారపు సారాంశం. తెలంగాణాలో షర్మిల పార్టీ ఏర్పాటుపై ప్రభుత్వ సలహాదారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన ప్రకటన తెలిసిందే. పార్టీ ఏర్పాటు షర్మిల వ్యక్తిగతమని, ఏపీ సీఎం జగన్ ఆమెకు నచ్చజెప్పారని, కష్ట, నష్టాల గురించి కూడా జగన్ చెప్పారని సజ్జల వెల్లడించారు. ఈ నేపథ్యంలో పార్టీ ఏర్పాటు అంశంలో వైఎస్ విజయమ్మ షర్మిలకు నచ్చజెప్పారా? అనే ప్రచారంపైనా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుండడం గమనార్హం.