వైఎస్ షర్మిల… దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు… ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సోదరి. ఇంతకన్నా పెద్దగా పరిచయం అక్కరలేని వైఎస్ఆర్ సీపీ నాయకురాలు. ‘తెలంగాణా అభివృద్ధి కోసం, తెలంగాణా ప్రజల సంక్షేమం కోసం, తెలంగాణాలో రాజన్న రాజ్యం కోసం’ రాజకీయ పార్టీని స్థాపించాలని పరితపిస్తున్న నాయకురాలు. ఆమె పార్టీ ప్రయత్నాలు ఇంకా ఆదిలోనే ఉన్నప్పటికీ, ఈనెల9న హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో ఆమె నల్లగొండ జిల్లా నేతలతో నిర్వహించిన ఆత్మీయ సమావేశానికి మీడియాలో లభించిన పబ్లిసిటీ అంతా ఇంతా కాదు. తన సోదరుని కుటుంబానికే చెందిన ‘సాక్షి’ మీడియా గ్రూపు షర్మిల పార్టీ గురించి పెద్దగా పట్టించుకోకపోయినా, ఇంటా, బయటా విమర్శలో, మరే కారణాలో తెలియదుగాని మొత్తంగా మరుసటి రోజు నుంచి కవరేజి ప్రారంభించింది. తెలంగాణాలో మాత్రమే షర్మిల పార్టీ ఏర్పాటు అంశంపై వైఎస్ఆర్ సీపీ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. అదంతా వేరే విషయం.
షర్మిల రాజకీయ అడుగుల్లో ఇప్పుడు తాజా విశేషమేమిటంటే… షర్మిల తన పార్టీకి పురుడుపోసే ప్రక్రియలో భాగంగా ఈనెల 21న ఖమ్మం జిల్లాను వేదికగా ఎంచుకోవడం. నేరుగా ప్రజలను కలుసుకునే లక్ష్యంతో జిల్లాల పర్యటనకు బయలుదేరడం. ఇందుకు ముందుగా ఖమ్మం జిల్లాను ఎంచుకోవడం. అసలేముంది ఖమ్మంలో? హైదరాబాద్, వరంగల్ వంటి మహానగరాలను, ఉత్తర తెలంగాణాకు గుండెకాయలాంటి కరీంనగర్ వంటి పెద్దనగరాన్ని కూడా కాదని, ఆంధప్రదేశ్ సరిహద్దుల్లోని ఖమ్మాన్ని మాత్రమే షర్మిల తన తొలిపర్యటనకు కేంద్రంగా ఎందుకు ఎంచుకున్నారు? షర్మిల పార్టీ ఏర్పాటు అంశంలో అసలేం జరుగుతోంది? తెలంగాణాలోని పది ఉమ్మడి జిల్లాల్లో ఆత్మీయ సమావేశం కోసం తొలుత నల్లగొండ జిల్లా నాయకులకు మాత్రమే అవకాశం కల్పించడంలో ఏదేని ప్రత్యేకత ఉందా? ఆ తర్వాత ఖమ్మంలో 250 కార్ల భారీ ర్యాలీతో ప్రవేశించాలని షర్మిల నిర్ణయించుకోవడంలో మరేదైనా ప్రాముఖ్యత ఉందా? ఇవీ తాజా ప్రశ్నలు. వీటన్నింటికీ సమాధానాలు వెతుక్కోవాలంటే ‘2009… ఓదార్పు యాత్ర’ అనే ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లక తప్పదు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణాన్ని తట్టుకోలేక ‘గుండె’లాగి మరణించిన కుటుంబాల సంఖ్య తెలంగాణాలోనే ఎక్కువ. ఇందులో ఏ సందేహం లేదు. అందుకు సంబంధించి అనేక గణాంక వివరాలు కూడా ఉన్నాయి. ఈ కుటుంబాలను ఓదార్చేందుకు వైఎస్ జగన్ స్వయంగా రంగంలోకి దిగారు. ‘ఓదార్పు’ యాత్రను ప్రారంభించారు. తొలుత ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరు నుంచి ప్రారంభమైన యాత్ర పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా సాగిన తర్వాత చింతలపూడి మీదుగా సత్తుపల్లి మండలం కిష్టారంలోకి ప్రవేశించింది. ఖమ్మం జిల్లాలో ఓదార్పు యాత్రను నిర్వహించేందుకు అప్పట్లో అధికారంలోనే గల అనేక మంది కాంగ్రెస్ నాయకులు జగన్ కు ఏమాత్రం సహకరించలేదు. వైఎస్ మరణం తర్వాత వెంటనే జగన్ సీఎం అయితే భారీగా లబ్ధి పొందాలని ఆశపడ్డ పలువురు నాయకులు కూడా ఆయన ఓదార్పు యాత్ర సందర్భంగా ముఖం చాటేశారు. కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేని కొందరు వ్యక్తులు, అప్పటి ‘సాక్షి’ ఉద్యోగుల తపన, కష్టం వల్ల మాత్రమే జగన్ ఓదార్పు యాత్ర విజయవంతమైంది. యాత్రను అడ్డుకునేందుకు జిల్లాలోనూ అనేక కుటిల ప్రయత్నాలు సాగాయి. ‘మానుకోట రాళ్ల’ ఘటనకు ముందుగానే ఖమ్మం జిల్లాలోనూ జగన్ ఓదార్పు యాత్రపై ఏదోరకంగా ‘రాళ్లు’ కురిపించేందుకు పలువురు ప్రయత్నించారు. ఈ పరిణామాలను ఓదార్పు యాత్రలో ఎలా నిలువరించగలిగారనేది వేరే విషయం. మొత్తంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జగన్ ఓదార్పు యాత్ర అనూహ్యరీతిలో భారీగా విజయవంతమైంది. ఇందుకు శ్రమించినవారందరూ ఆ తర్వాత నిరాదరణకు గురయ్యారనేది కాదనలేని వాస్తవం.
జగన్ సొంత పార్టీని ఏర్పాటు చేశాక, రాష్ట్ర విభజన అనంతరం సైతం ఖమ్మం జిల్లా వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి అండగా నిలిచింది. ప్రత్యేక రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లోనూ ఓ ఎంపీని, ముగ్గురు ఎమ్మెల్యేలను ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు ఆ పార్టీకి అందించారు. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణాలో వైఎస్ఆర్ సీపీకి ఈ తరహా గెలుపును ఇచ్చిన చరిత్ర ఖమ్మం జిల్లాకు మాత్రమే ఉంది. మిగతా తొమ్మిది ఉమ్మడి జిల్లాల్లో ఎక్కడా ఆ పార్టీ అభ్యర్థులు 2014 ఎన్నికల్లో విజయం సాధించిన దాఖలాలు లేవు. ఆ తర్వాత పరిణామాల్లో పార్టీ తరపున గెల్చిన ఎంపీ, ముగ్గురు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరారనేది వేరే విషయం. కానీ 2009 నుంచి 2014 వరకే కాదు, ఇప్పటి వరకు కూడా తొలుత వైఎస్ఆర్ సీపీ జెండాను మోసిన కార్యకర్తలకు ఆ తర్వాత లభించిన ఆదరణ ఏమిటనేది అసలు ప్రశ్న. అర్థబలం పుష్కలంగా ఉన్నవారు పార్టీలో చేరి రాజకీయంగా ఎదిగినప్పటికీ, ప్రతికూల పరిస్థితుల్లో పార్టీ జెండాను మోసినవారు మాత్రం ఆచూకీ లేకుండాపోయారనేది కళ్లముందు కనిపిస్తున్న దృశ్యం. ఇటువంటి కరడుగట్టిన వైఎస్ఆర్ అభిమానులను ఆ పార్టీ నాయకత్వం ఏవిధంగానూ పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్ల కాలంలోనూ మొదట్లో పార్టీకి వెన్నుదన్నుగా నిలిచినవారికి పార్టీగాని, నాయకులుగాని ఏమాత్రం అండగా ఉండలేదనే ఆరోపణలూ ఉన్నాయి.
ఈ నేపథ్యంలో షర్మిల తన పార్టీకి పురుడు పోసేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరించిన ఖమ్మం జిల్లాను ఎంచుకోవడంలో ఆశ్చర్యం లేకపోవచ్చు. వైఎస్ రాజశేఖ్ రెడ్డి కుటుంబానికి ఎనలేని అభిమానాన్ని చాటిన ఖమ్మం జిల్లా నుంచి పార్టీ కార్యకలాపాలను ప్రారంభిస్తే, దాని ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా ఉంటుందనే అంచనా ఉండవచ్చు. అంతేగాక వైఎస్ఆర్ సీపీ పార్టీతో ప్రయోజనం పొందిన నాయకులు అంతర్గతంగా సహకరిస్తూ ఉండవచ్చు, జనసమీకరణ చేస్తుండవచ్చు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కాంట్రాక్టులు చేస్తున్నట్లు ప్రాచుర్యంలో గల నాయకులు షర్మిల యాత్రకు అన్నిరకాలుగా లోపాయికారీ సహకారం చేస్తుండవచ్చు. వందలాది కార్లతో హైదరాబాద్ నుంచి భారీ ర్యాలీగా షర్మిల ఖమ్మం జిల్లా పర్యటనకు బయలుదేరనున్నట్లు వార్తలు వస్తున్నాయి. కార్ల సంఖ్య ఎంతయినా ఉండొచ్చు… హయత్ నగర్ నుంచి చౌటుప్పల్, నార్కట్ పల్లి, నకిరేకల్, సూర్యాపేట మీదుగా సాగే ఈ ర్యాలీలో మరిన్ని కార్లు కూడా ర్యాలీలో కలవొచ్చు. భారీ అట్టహాసంతో షర్మిల ఖమ్మం జిల్లాలో ప్రవేశించవచ్చు. షర్మిల వేస్తున్న ఆయా రాజకీయ అడుగుల వెనుక ఇద్దరు మాజీ ఎంపీల రహస్య సహకారం ఉందనే ప్రచారం ఎలాగూ ఉంది. కానీ తొలుత వైఎస్ఆర్ సీపీ జెండాను మోసిన పేద కార్యకర్తల పరిస్థితి ఇప్పుడెలా ఉంది? వాళ్లు ఏం చేస్తున్నారు? గడచిన దశాబ్ధకాలంలో వారిని ఎవరైనా పట్టించుకున్నారా? ఇప్పుడు షర్మిల స్థాపించే పార్టీ జెండాను తొలుత మోసేవారికి లభించే ప్రయోజనమేంటి? ఇవీ సమీక్షించాల్సిన అసలు అంశాలనే వాదన వైఎస్ఆర్ అభిమానుల్లో వినిపిస్తోంది. అదీ అసలు విషయం.