‘ఏవండీ…అనవసరంగా మీరు అపార్థం చేసుకున్నారు. మీడియా విషయంలో జగన్ సర్కార్ ఇచ్చిన జీవో గురించి సీనియర్ సంపాదకుడు కె. రామచంద్రమూర్తి, జర్నలిస్టు సంఘం జాతీయ నేత దేవులపల్లి అమర్ వంటి పెద్దవారు ఎంత చక్కగా చెప్పారండీ…’ ఇదీ ఓ జర్నలిస్టు మిత్రుడు వెటకరించిన వ్యాఖ్య.

వాస్తవమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీడియా విషయంలో గత నెల 30న జారీ చేసిన జీవో నెం. 2430 గురించి అటు రామచంద్రమూర్తి, ఇటు అమర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజల్లోనేగాక జర్నలిస్టు వర్గాల్లోనూ తీవ్ర చర్చకు దారి తీశాయి. అధికార పార్టీకి చెందిన నేతలు, మంత్రులు తమ పార్టీకి చెందిన ప్రభుత్వం జారీ చేసిన జీవోను సమర్ధించుకునేందుకు నానా తంటాలు పడవచ్చు. వివిధ రకాల వ్యాఖ్యలు చేయవచ్చు. అవసరమైతే కలాలకు కులాలు ఆపాదించవచ్చు.  అందులో తప్పేమీ లేకపోవచ్చు. ఎందుకంటే అవి రాజకీయ నోటి నుంచి వచ్చే పదాలు కాబట్టి. ప్రభుత్వ చర్యను సమర్ధించుకోవాలి కాబట్టి.  కానీ సమాజ హితం కోరే సీనియర్ జర్నలిస్టులుగా ప్రాచుర్యం పొందిన కేఆర్ మూర్తి, అమర్ వంటి వారు ఈ జీవో విషయంలో చేసిన సమర్ధింపు వ్యాఖ్యలే ఇప్పడు జర్నలిస్టువర్గాల్లో భిన్నాభిప్రాయలకు వేదికగా మారాయి. ఇటు కేఆర్ మూర్తిగాని, అటు అమర్ గాని సామాన్య జర్నలిస్టులేమీ కాదు. సీనియర్ సంపాదకుడిగా, ఇటీవలి కాలం వరకు సాక్షి పత్రిక ఎడిటోరియల్ డైరెక్టర్ గా పదవీ బాధ్యతలు నిర్వహించిన కేఆర్ మూర్తికి ప్రజాస్వామ్య పరిరక్షణ, జర్నలిస్టు హక్కుల గురించి పోరాటాలు చేసిన ట్రాక్ రికార్డు ఉంది. అదేవిధంగా పత్రికా స్వేచ్ఛ కోసం పాటుపడడంలో, జర్నలిస్టు హక్కుల గురించి పోరాటం చేయడంలో అమర్ కు జాతీయ స్థాయి నాయకుడిగా పేరుంది. సాక్షి టీవీలో ఫోర్త్ ఎస్టేట్ కార్యక్రమాన్ని నిర్వహించిన నేపథ్యమూ ఉంది. ఈ ఇద్దరూ ప్రస్తుతం జగన్ సర్కార్ లో సలహాదారులు.

కేఆర్ మూర్తి, దేవులపల్లి అమరే కాదు…మరి కొందరు సీనియర్ జర్నలిస్టులూ జగన్ ప్రభుత్వంలో సలహాదారులుగా నియమితులై భారీ మొత్తపు వేతనాలు అందుకుంటున్నారు. ఓ రకంగా చెప్పాలంటే జగన్ ప్రభుత్వంలోని సలహాదారుల్లో ఎక్కువ మంది సలహాదారులు జర్నలిస్టులే. వీరిలో ఆంధ్రా, తెలంగాణా వంటి పదాలు అప్రస్తుతం, అది వేరే చర్చ. కానీ….ఇంత మంది పెద్ద జర్నలిస్టులు సలహాదారులుగా ఉన్న నేపథ్యంలో మీడియాపై ఆంక్షలు విధిస్తూ జగన్ ప్రభుత్వం జీవోను జారీ చేయడమే చర్చకు ఆస్కారం కలిగిస్తున్నది. అంటే ప్రభుత్వంలోని జర్నలిస్టు సలహాదారులకు తెలిసే ఈ జీవో జారీ చేశారా? లేక వారి సలహాతోనే జగన్ ప్రభుత్వం ఇందుకు సాహసించిందా? అనే సంశయాలు జర్నలిస్టు వర్గాల్లో తలెత్తుతున్నాయి. జర్నలిస్టు సలహాదారులకు తెలిసీ, వారి ఆమోదంతోనే ఈ జీవో జారీ అయిన పక్షంలో జర్నలిస్టుల హక్కులు, పత్రికా స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం వంటి పదాల అంశంలో కేఆర్ మూర్తి, అమర్ వంటి వారు గతంలో చేసిన పోరాటాలకు అర్థం, పరమార్థం ఏమిటనే ప్రశ్నలు కూడా ఉద్భవిస్తున్నాయి. జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డుల మంజూరుకు సంబంధించి తెలంగాణా ప్రభుత్వం జారీ చేసిన 239 జీవో విషయంలో జర్నలిస్టు సంఘాలు ఇప్పటికీ ఆందోళన చెందుతున్నాయి. పోరాటాలు చేస్తున్నాయి. తెలంగాణా సర్కార్ జారీ చేసిన 239 జీవో రద్దుకు పట్టుబడుతున్నాయి. ఈ జీవో జారీకి ముందు రామచంద్రమూర్తి ఆధ్వర్యంలో జర్నలిస్టు పెద్దలు చేసిన సిఫారసులను కూడా జర్నలిస్టులు ఈ సందర్భంగా ఉటంకిస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్ ప్రభుత్వం మీడియా రాతలకు సంబంధించి జారీ చేసిన జీవో నెం. 2430 గురించి అటు రామచంద్రమూర్తి, ఇటు దేవులపల్లి అమర్ చేసిన వ్యాఖ్యలు మీరూ చదవండి. మళ్లీ…మళ్లీ చదవండి. చదివాక మీరు కూడా వారిని అపార్ధం చేసుకోకండి…

‘అవాస్తవాలు రాసి ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించే మీడియా సంస్థలపై న్యాయస్థానంలో దావా వేసేందుకు శాఖాధిపతులకు అనుమతిస్తూ ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగానే జీఓ జారీచేసింది. ప్రభుత్వ ప్రతిష్టకు భంగకరంగా వార్తలు రాస్తే న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు సమాచార శాఖ కమిషనర్‌కు అధికారం ఉండేది. వికేంద్రీకరణలో భాగంగా ప్రస్తుత సర్కారు ఆ అధికారాన్ని అన్ని శాఖల అధిపతులకు  కల్పించింది. దురుద్దేశంతో అవాస్తవాలు రాసే మీడియా సంస్థలే కేసులకు భయపడతాయి.’

-కె. రామచంద్రమూర్తి, ప్రభుత్వ సలహాదారు (పబ్లిక్ పాలసీ)

‘ఏపీ సర్కారు తీసుకువచ్చిన జీఓతో సత్యాలు రాసే పాత్రికేయులు, దానిని ప్రచురించే పత్రికా యాజ మాన్యాలు భయపడాల్సిన అవసరంలేదు. అసత్యాలు, అభూత కల్పనలు రాస్తున్న మీడియా సంస్థలకే ఇది ఇబ్బందికరం. పత్రికా స్వేచ్ఛపై ఏపీ ప్రభుత్వానికి సంపూర్ణమైన గౌరవం ఉంది.’

-దేవులపల్లి అమర్, ప్రభుత్వ సలహాదారు (జాతీయ మీడియా)

Comments are closed.

Exit mobile version