పురపాలక సంఘం :ఇల్లందు
****( *పత్రికా ప్రకటన* )*****
ఇందుమూలంగా ఇల్లందు పట్టణ ప్రజానీకానికి మరియు మీడియా మిత్రులకు తెలియజేయునది ఏమనగా ! ఈరోజు జగదాంబ సెంటర్ మెయిన్ రోడ్ లో కొన్ని మేకలు డివైడర్ పైనున్న హరితహారం కార్యక్రమం భాగంలో పెట్టిన మొక్కలను తినడం జరుగుతుంది ఆ దారిలో వెళ్తున్న మున్సిపల్ కమిషనర్ గారు చూసి ఇ వెంటనే మున్సిపల్ సిబ్బందిని పిలిపించి ఆ మేకలను బంధించడం జరిగింది కావున హరితహారం మొక్కలను పాడు చేసినందుకు గాను నష్ట పరిహారం లో భాగంగా మున్సిపల్ యాక్ట్ 2019 ప్రకారం, ఆ మేకలను ఒక్కో మేకకు 3000Rps జరిమానా వేయడం జరుగుతుంది. కనుక ఆ మేకల యజమాని ఎవరో విషయం తెలుసుకొని మున్సిపల్ ఆఫీస్ కి వచ్చి సోమవారం కళ్ళ వాటి జరిమానా కట్టి తీసుకు వెళ్లవలసిందిగా కోరుచున్నాను. లేనియెడల వాటిని సోమవారం రోజున వేలం పాట వేయడం జరుగుతుంది.
*కమిషనర్*, ఇల్లందు మున్సిపాలిటీ.
చదివారు కదా… ప్రకటన? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మున్సిపల్ కమిషనర్ పేరున వాట్సప్ గ్రూపుల్లో చక్కర్లు కొడుతున్న పోస్టు ఇది. మున్సిపల్ కమిషనర్ దారిలో వెడుతుండగా, హరిత హారం కార్యక్రమం కింద నాటిన మొక్కను మేకలు మేయడాన్ని ఆయన చూశారు. వెంటనే సిబ్బందిని పిలిపించి వాటిని బంధించారు. ఒక్కో మేకపై రూ. 3 వేల చొప్పున జరిమానా విధించారు. కానీ మేకల యజమాని ఎవరో తెలియదు. సోమవారంకల్లా సదరు మేకల యజమాని వచ్చి జరిమానా చెల్లించి, మేకలను తీసుకువెళ్లాలని, లేనిపక్షంలో మేకలను వేలం వేస్తామని హెచ్చరిస్తూ జారీ చేసిన ప్రకటన చర్చనీయాంశంగా మారింది.
హరితహారం కింద నాటిన మొక్కలను మెక్కిన మేకల సంఖ్య మొత్తం తొమ్మిది(ట). ఈ లెక్కన వాటికి చెల్లించాల్సిన జరిమానా మొత్తం రూ. 27 వేలు మాత్రమే అన్నమాట. ఇంతకీ ఈ ఘటనలో నేరం మొక్కలదా? మేకలదా? ఇదీ అసలు ప్రశ్న.
హరితహారం కార్యక్రమం కింద నాటిన మొక్కల సంరక్షణ విషయంలో తాము ముందే ‘చాటింపు’ వేయించామని, కాపలా లేకుండా మేకలను వదిలిన వాటి యజమాని బాధ్యత వహించి జరిమానా చెల్లించకతప్పదని మున్సిపల్ అధికారులు స్పష్టం చేస్తున్నారు.
ఇంతకీ సోమవారం మేకల యజమాని వస్తాడా? రూ. 27 వేలు జరిమానా చెల్లిస్తాడా? కరోనా కాలంలో అంత డబ్బు చెల్లించలేక చేతులెత్తేసి మేకలను వదిలించుకుంటాడా? వేచి చూడాల్సిందే.
ఫొటో: ఇల్లెందులో మున్సిపల్ అధికారులు బంధించిన మేకలు