ఖమ్మం జిల్లాలోని ఓ కోర్టులో ప్రభుత్వంచే నియమితుడై, పనిచేస్తున్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ పై దళిత మహిళా న్యాయవాది చేసిన ఫిర్యాదు ప్రతి లీకైంది. కె. చంద్రావతి అనే మహిళా లాయర్ పోలీసులకు, రాష్ట్ర గవర్నర్ కు, సీఎం కు, హైకోర్టు చీఫ్ జస్టిస్ తదితరులకు చేసిన ఫిర్యాదు అంశం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. అయితే ఈనెల 10వ తేదీన ఆమె చేసిన ఫిర్యాదుపై పోలీసులు ఇప్పటి వరకు కేసు నమోదు చేయకపోవడాన్ని న్యాయవాద వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. ఫిర్యాదు అందిందే తడవుగా అనేక ఘటనల్లో రౌడీషీట్లు, పీడీ యాక్టులు నమోదు చేస్తున్న ఖమ్మం జిల్లా పోలీసులు దళిత వర్గానికి చెందిన ఓ మహిళా న్యాయవాది ఫిర్యాదుపై ఇప్పటి వరకు కనీస చర్యలు తీసుకోకపోవడంలో అంతర్యమేమిటని ఆ వర్గాలు వేలెత్తి చూపుతున్నాయి.
బాధిత లేడీ లాయర్ కె. చంద్రావతి చేసిన ఫిర్యాదు ప్రతి ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ ఫిర్యాదులో ఆమె చేసిన తీవ్ర ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి. చంద్రావతి పేరుతో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఫిర్యాదు ప్రతిలోని సారాంశం ఇలా ఉంది. విషయం ఆమె మాటల్లోనే…
‘‘నేను అనగా కె. చంద్రావతి, జూనియర్ మహిళా హరిజన న్యాయవాదిని. నేను మూడవ అదనపు ఫాస్ట్ ట్రాక్ కోర్టు పీపీ బెల్లం ప్రతాప్ వద్ద జూనియర్ న్యాయవాదిగా సాంఘిక సంక్షేమ సంఘం ఖమ్మం జిల్లా కలెక్టర్ ఉత్తర్వు ద్వారా నియమింపబడి, అదనపు పీసీ వారి కోర్టు అసిస్టెంట్ గా పనిచేస్తున్నాను. ప్రతాప్ వద్ద నేను కోర్టు ప్రొసీడింగ్స్ చూస్తూ పని నేర్చుకునేదాన్ని. ఆ తర్వాత క్రమంలో ప్రతాప్ లో చాలా మార్పు రావడం గమనించాను. నన్ను లైంగిక వేధింపులకు గురి చేశారు. నేను పూర్తిగా వ్యతిరేకించాను. ఈ విషయంలో నాలో నేనే బాధపడుతున్నాను. ఇదే క్రమంలో లేడీ ఆఫీసర్ హైమావతితో నాకు జరిగిన విషయం చెప్పాను. తొందరపడవద్దని, కొంత సమయం వేచి చూద్దామని ఆమె చెప్పారు. అతనిలో మార్పు రాకుంటే, చట్టపరంగా చర్యల కోసం సంబంధిత అధికారులకు తెలియజేద్దామని సలహా ఇచ్చారు. హైమావతి మేడం కూడా బెల్లం ప్రతాప్ ప్రవర్తనను గమనించేవారు. తాను అతనితో మాట్లాడడం లేదనే విషయాన్ని మనసులో పెట్టుకుని నన్ను లైంగికంగా వేధించేవారు. మీరు తండ్రిలాంటివారు, ఆ అమ్మాయి చిన్నపిల్ల, బతకడానికి వచ్చింది, మనం ఆ అమ్మాయికి సహాయం చేయాలేగాని, లైంగికంగా వేధించకూడదు.. అని హైమావతి మందలించారు. మరో అదనపు పీపీ పసుపులేటి శ్రీనివాస్ కూడా అతనికి సహకరించారు. నన్ను పదే పదే ఎగతాళి చేసేవారు.
హైమావతి మేడం మా గదిలోంచి కోర్టులోకి వెళ్లగానే బెల్లం ప్రతాప్ నా వ్యక్తిగత శరీర భాగాలను తాకేవారు. మానసికంగా హింసించేవారు. నిన్ను నేను అనుభవించాలి…నీవు నల్లగా ఉన్నప్పటికీ చాలా అందంగా ఉంటావు, నీ శరీర రూపం, దృఢత్వం నాకు నచ్చింది. నిన్ను కాళ్లూ, చేతులు కట్టేసి శారీరకంగా, లైంగికంగా అనుభవించాలి… అని వేధించేవాడు. ముద్దులు పెట్టుకోవాలని హింసించేవాడు. ఈ విషయాలను హైమావతి మేడమ్ కు చెప్పాను. నాకు సోదరిలా ఆమె జాగ్రత్తలు చెప్పేవారు. ప్రతాప్ తో పాటు మరో ఇద్దరు న్యాయాధికారులు కూడా నన్ను లైంగికంగా, శారీరకంగా వాడుకుని నా జీవితాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేశారు. ఈ విషయాన్ని హైమావతి మేడమ్ ప్రశ్నిస్తే ఆమెతోనూ గొడవ పడేవారు. ఇలా పదే పదే నన్ను వేధిస్తూ, నిన్ను ఏదోరకంగా శారీరకంగా, పూర్తి నగ్నంగా అనుభవిస్తామని బెల్లం ప్రతాప్ బెదిరించారు. తనను, తన పనులను జిల్లాలోగాని, డీవోపీలోగాని ఎవరూ అడ్డుకోరని కూడా బెదిరించేవాడు. ఆ తర్వాత హైమావతి మేడమ్ తో నేను అందరి జడ్జిల వద్దకు వెళ్లి జరిగిన విషయం చెప్పాను. ఆ తర్వాత పోలీస్ కమిషనర్ వద్దకు కూడా వెళ్లి అన్ని విషయాలు చెప్పవలసిన పరిస్థితి వచ్చింది. మహిళా కోర్టులో యావత్తు సిబ్బందికి నా బాధ తెలుసు. ఓరోజు మేడమ్ కు, పీపీగారి మధ్య ఘర్షణ కూడా జరిగింది.
నేను చాలా హ్యుములేషన్ కు గురయ్యాను. నువ్వు నా గురించి ఎవరికి చెప్పినా నమ్మరని బెల్లం ప్రతాప్ అన్నారు. ఇందుకు గల కారణాలను కూడా చెప్పారు. కావాలంటే నీకు ఏపీపీ పోస్టు ఇప్పిస్తాను అని ఆశ చూపారు. తనకు ఓ కమ్మ మినిస్టర్ బంధువని, జిల్లాలోనేగాక హైదరాబాద్ లో కూడా కావలసిన సహాయం చేస్తానన్నారు. కాబట్టి ఎప్పటికైనా తనకు లొంగిపోవలసిందేనని, తనతో శారీరక సంబంధం ఏర్పరచుకుంటే బాగుపడతావని చెప్పారు. పోలీసు శాఖలోనూ తనకో స్నేహితుడు ఉన్నాడని, మినిస్టర్ వద్దకు తీసుకువెడతానని, ప్రభుత్వ పదవులు ఇప్పిస్తానని, ఆర్టీసీ పీపీ ఇప్సిస్తానని చెప్పి అన్ని రకాలుగా వంచన చేసేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలోనూ హైమావతి మేడమ్ కు అన్ని విషయాలు చెప్పగా, ఆమె నన్ను సీపీ వద్దకు తీసుకువెళ్లి జరిగిన విషయం చెప్పారు. ఓరోజు పోట్ల శ్రీకాంత్ మా ఇంటికి రాగా, అతనికీ జరిగిన విషయాలు చెప్పగా, ఈ విషయం ఇక మర్చిపోవాలని చెప్పారు.
అంతా కాంప్రమైజ్ అయ్యిందని బెల్లం ప్రతాప్ కోర్టులో న్యాయవాదులకు తప్పుడు సమాచారం ఇచ్చారు. దీంతో ఎన్ని లక్షల రూపాయలు తీసుకుని రాజీ పడ్డావని న్యాయవాదులు నన్ను అడిగారు. దీనికి నేను మానసికంగా బాధపడ్డాను. కానీ రోజు రోజుకూ నా గురించి చెడు ప్రచారం చేస్తున్నారని, నా వీడియోలు, న్యూడ్ ఫొటోలు ఉన్నాయని, అందువల్ల నేను వారిపై దరఖాస్తు చేయలేనని తప్పుడు ప్రచారం చేశారు. నేను తట్టుకోలేకపోతున్నాను. నన్ను మానసికంగా హింసిస్తున్నారు. నేను డ్రింక్ చేశానని, వాళ్ల ఇంటికి వెళ్లి వాళ్ల ముగ్గురితో శారీరక సంబంధాలు పెట్టుకుని, లైంగికంగా అనుభవించారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నేను కోర్టులో తలెత్తుకోలేకపోతున్నాను. నేను ఆత్మహత్యాయత్నం కూడా చేశాను. సరిగ్గా చదవలేకపోతున్నాను. ఎస్ బీ ఆఫీసర్, ఏసీపీ ప్రసన్న కుమార్ మా ఇంటికి విచారణ కోసం రాగా, తనకు ఆరోగ్యం సహకరించలేదు. సీపీగారికి లిఖిత పూర్వక ఫిర్యాదు ఇవ్వాలని ఆయన చెప్పారు. కానీ నేను ఓరల్ గానే మొత్తం చెప్పాను. ఇప్పుడు దరఖాస్తు చేస్తున్నాను. నేను ఏ తప్పూ చేయలేదు, నాకు జరిగిన అవమానాలు ఏ అమ్మాయికీ కూడా జరగరాదని నేను కోరుకుంటున్నాను. కావున నాయందు దయ ఉంచి ఈ ముగ్గురిపై చట్టరీత్యా తగు చర్యలు తీసుకుని, ఎస్సీ, ఎస్టీ, POA చట్టం కింద కేసు నమోదు చేసి నాకు న్యాయం చేయాలని మిమ్మల్ని వేడుకుంటున్నాను’ అని చంద్రావతి తన ఫిర్యాదులో అభ్యర్థించారు.