రెవెన్యూ అధికారుల తీరుపై ఓ మహిళ వినూత్న నిరసనకు దిగారు. తన పుస్తెల తాడు (తాళి బొట్టు) తీసుకుని తన భూమిని పట్టా చేయాలని ఆమె అభ్యర్థించారు. ఈ సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల రెవెన్యూ కార్యాలయం వేదికగా జరిగింది. వివరాల్లోకి వెడితే… రుద్రంగి మండలం మానాల గ్రామానికి చెందిన పొలాస రాజేశం మంగకు సర్వే నెంబర్ 130/14లో 2 ఎకరాల భూమి ఉంది. తన భర్త రాజేశం మూడేళ్ల క్రితం చనిపోగా తన భూమిని వేరే వాళ్ళకు తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది పట్టా చేశారని బాధిత మహిళ ఆరోపిస్తున్నారు.
తన భూమిని తనకు పట్టా చేయాలని మూడేళ్లుగా రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్త ఎలాగూ లేడని, తన తాళిబొట్టు తీసి రెవెన్యూ ఆఫీసు గేటుకు వేలాడదీసి నిరసన వ్యక్తం చేశారు. ఈ తాళిబొట్టును లంచంగా తీసుకుని తన భూమిని తనకు పట్టా చేయాలని మంగ అభ్యర్థించారు. ఉద్యోగ రీత్యా తాను మెట్ పల్లిలో పని చేసుకుంటూ ఉండగా, ఇతరులు తన భూమిని పట్టా చేసుకున్నారని, ఇందుకు అధికారులు కూడా సహకరించారని ఆమె ఆరోపించారు. తన భర్త ఎలాగూ లేడని, కనీసం తనకు ఆధారమైన భూమినైనా ఇప్పించాలని మంగ అధికారులను వేడుకుంటున్నారు.