‘‘వెళుతున్న టైంలో కొంత మంది ఎవరో వస్తున్నారు. కొంచెం, ఒకసారి, అంటే ఫియా…ర్ నెస్ ఉండేసరికి కాల్ చేశాను. మాలికా కన్వెక్షన్ ఉంది కదా సర్? నేనూ… సర్వీస్ రోడ్లో వెళుతున్నాను. కొంచెం ఎవరో బైక్ మీద రాష్ గా వెళ్లడం, ఈవ్ టీజంగ్ లాగా చేస్తున్నారు. బైక్స్ సడన్ గా వెళ్లిపోయారు. అంటే ఒకసారి కనిపించారు. మళ్లీ ఒచ్చారు. సో…అందుకనే ఒకసారి ఇన్ఫాం చేద్దామని, యూ…నో? కొంచెం సిచ్చ్వేషన్ కూడా బాగ లేదు. సో అందుకనే సర్వీస్ రోడ్లో వెళ్తున్నాను నేను…నా అంతటగా, సో అందుకని, కొంచెం పక్కన వెహికిల్స్ వెళ్తున్నాగాని, వాళ్లు కొంచెం రాష్ గా మాట్లాడి వెళ్లిపోతున్నట్లు ఉంది. అందుకనే…’’
అంటూ ఓ యువతి కంగారు, కంగారుగా ఫోన్లో మాట్లాడుతుంటుంది. ఈ దృశ్యాన్ని టీవీలో చూస్తున్న మనం ఆ అమ్మాయి నిజంగానే ఆపదలో ఉన్నట్లు భావిస్తూ కంగారు పడిపోతుంటాం. కొద్దిసేపటి తర్వాత ఓ పోలీస్ వాహనం కుయ్…కుయ్…మంటూ రానే వచ్చింది. హమ్మయ్య అమ్మాయి సేఫ్ అనుకుంటాం మనం. కనిపిస్తోందా బండి? అని ఓగొంతు వినిపిస్తుంది. యా…ఎక్కడో సౌండ్ వినిపిస్తోందండీ. అంటుంది ఆ అమ్మాయి. సర్వీస్ రోడ్లో ఎదురుగ్గానే వస్తున్నాం మేడమ్ అంటూ పోలీసులు రానే వచ్చారు. కారు దిగి ఆ అమ్మాయిని రక్షించేందుకు హడావిడిగా వస్తున్నారు. కానీ ఆ యువతి ఏం చెప్పిందో తెలుసా? ఎస్…యా, మేమే షూటింగ్ చేస్తున్నాం. బట్ సారీ ఫర్ దట్. థాంక్యూ సర్, థాంక్యూ సోమచ్. ఫర్ క్విక్ రెస్పాన్స్. ‘మనం చూస్తున్నాం. పోలీసువాళ్లు మనకు చెప్పినట్లుగానే త్రీ మినట్స్ లో మన కళ్ల ముందు ఉన్నారు.’ అంటూ ఆ టీవీ రిపోర్టర్ కూల్ గా సెలవిచ్చారు. వార్నీ ఇంత సేపు చూసింది టీవీ వార్తా? అని మనం నిట్టూరుస్తాం. వచ్చిన పోలీసులతో కూడా ఆ రిపోర్టర్ కాసేపు టీవీలో మాట్లాడించారు. కొన్ని ఫేక్ కాల్స్ వస్తుంటాయి అని ఆ పోలీసు సైతం ఈ సందర్భంగా వ్యాఖ్యానించడం గమనార్హం.
దాదాపు నాలుగైదు నిమిషాల నిడివి గల ఈ వీడియోలో తెలంగాణా పోలీసుల స్పందనపై టీవీ9 చేసిన ప్రయోగం అద్భుతం కదూ? టీవీ9 అంటేనే ఇటువంటి ప్రయోగాలకు చిరునామా మరి. ఆ మధ్య సినీ నటి శ్రీదేవి బాత్ టబ్బులో పడి దుర్మరణం చెందిన సమయంలోనూ రిపోర్టర్ కూడా టబ్బులో పడుకుని చేసిన లైవ్ ప్రయోగం తెలిసిందే కదా? ఆ తరహాలోనే దిశ హత్యోదంతం నేపథ్యంలో టీవీ9 తాజాగా చేసిన ప్రయోగమన్నమాట. దిశ ఆపదలో ఉన్నపుడు ఫిర్యాదు స్వీకరించే అంశంలో వచ్చిన విమర్శలకు కుంగిపోకుండా టీవీ9 చేసిన ఈ ప్రయోగంపట్ల పోలీసులు ఫుల్ హ్యాపీ కావచ్చు. కానీ ఈ ప్రయోగం చేసిన సమయంలో మరో అమ్మాయి అదే ప్రాంతంలో ఆపదలో ఉంటే? ఇంకో చోట ఇంకెవరో యువతి పోలీసుల సహాయం కోసం వేచి ఉంటే? లేదా ఈ రిపోర్టింగ్ చేసిన మహిళా జర్నలిస్టుకే ఏదేని ఆపదవచ్చి మళ్లీ అదే నెంబర్ నుంచి ఫోన్ చేస్తే? ఆ నెంబర్ ఫలానా టీవీ రిపోర్టర్ మొబైల్ గా భావించి పోలీసులు లైట్ గా తీసుకుంటే? నాన్నా పులి కథ కాదా మరి? తెలంగాణా పోలీసుల పనితీరుకు ఈ తరహా సర్టిఫికెట్ అవసరం ఉందో లేదో తెలియదుగాని, ఇటువంటి ప్రయోగాల ఫలితంగా నిజంగా ఆపదలో ఉన్నవారికి మాత్రం పోలీసులు అసలైన సమయానికి అందుబాటులో లేకుండాపోయే ప్రమాదం మాత్రం ఉంటుంది. తమ విధులకు ఆటంకం కలిగించారనే భావన పోలీసులకు కూడా రాకపోవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం టీవీ9 ఛానల్ ఎవరి చేతుల్లో ఉందో గుర్తుంది కదూ!