తెలంగాణాలోనూ మద్యం షాపులను ఓపెన్ చేసే దిశగా ప్రభుత్వ అడుగులు పడుతున్నట్లే కనిపిస్తోంది. సుదీర్ఘ సరిహద్దు గల మహారాష్ట్ర, కర్నాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అక్కడి సర్కార్లు లిక్కర్ షాపులను బార్లా తెరిచాయని, ఏదో ఒక నిర్ణయం తీసుకోవలసిన సంకట స్థితి ఏర్పడిందని తెలంగాణాలో అధికార పత్రిక ‘నమస్తే తెలంగాణా’ భారీ వార్తా కథనాన్ని నిన్న బ్యానర్ స్టోరీగా ప్రచురించినపుడే దాదాపు విషయం బోధపడింది. ఇదే అంశాన్ని ఉటంకిస్తూ నిన్న ts29 వార్తా కథనాన్ని ప్రచురించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా మద్యం నిల్వలపై నివేదిక ఇవ్వాల్సిందిగా ఎక్సైజ్ శాఖను ప్రభుత్వం ఆదేశించింది. షాపుల వారీగా స్టాక్ పరిశీలించాలని అబ్కారీ శాఖ కమిషనర్ నుంచి ఆదేశాలు వచ్చాయి. మంగళవారం సాయంత్రంలోగా లిక్కర్ షాపుల్లో నిల్వలకు సంబంధించిన నివేదిక సమర్పించాలని ఆదేశించడం గమనార్హం. దీంతో ఇరుగు, పొరుగు రాష్ట్రాల్లోనే కాదు… తెలంగాణాలోనూ మందుబాబుల గొంతును తడిపే దిశగానే సర్కారు అడుగులు వేస్తున్నట్లు స్పష్టమవుతోంది. అయితే…?
‘లాక్ డౌన్’కు ముందు వైన్ షాపులకు ఎక్సైజ్ శాఖ లక్కతో వేసిన సీళ్లు భద్రంగానే ఉన్నాయి. కానీ అనేక వైన్ షాపుల్లో దొంగలు పడ్డారు. కాదు… కాదు వైన్ షాపుల నిర్వాహకులే కొందరు చోరీలకు పాల్పడి బ్లాక్ మార్కెట్ దందా ద్వారా భారీ ఎత్తున డబ్బు గడించారు ఈ విషయాన్నిఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులే వెల్లడించారు. భద్రాచలంలో జరిగిన ఘటనను ఈ సందర్భంగా ఉదహరించారు. రాష్ట్ర వ్యాప్తంగా వైన్ షాపుల సీళ్లు భద్రంగానే ఉన్నప్పటికీ, బ్యాక్ డోర్ నుంచి సరుకు మాయమైనట్లు వార్తలు కూడా వచ్చాయి.
ఈ పరిస్థితుల్లో వైన్ షాపుల్లో మద్యం నిల్వలపై సర్కారు ఆరా తీయడం గమనార్హం. ఈ సందర్భంగా వ్యక్తమవుతున్న సంశయాలేమిటంటే…? బ్యాక్ డోరు ద్వారా వైన్ షాపుల్లోని సరుకు బ్లాక్ దందాకు బలైతే? ఉన్నఫలంగా ఖాళీ షాపులను తెరిస్తే ప్రయోజనం ఏమిటి? హడావిడిగా షాపులు తెరవడానికి అనుమతినిస్తే? మద్యపాన ప్రియులు బారులు తీరితే? షాపుల్లో సరుకు లేకపోతే? తోపులాటలు, ఘర్షణలు చోటు చేసుకుంటే? సహనం కోల్పోయిన లిక్కర్ బాబులు వైన్ షాపులపై దాడులు చేస్తే…? అంతిమంగా శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమవుతుంది.
అందుకే కాబోలు… వైన్ షాపుల్లో స్టాక్ నిల్వలపై ముందుగానే సర్కారు నివేదికలను తెప్పించుకుంటోంది. లాక్ డౌన్ ముందు సీళ్లు వేసిన సందర్భంగా స్టాక్ రిజిస్టర్లో గల నిల్వలు షాపుల్లో లేకపోతే సర్కారు తీసుకునే చర్యల గురించి కాసేపు పక్కన బెడితే… మొత్తంగా మద్యం షాపులను తెరిచేందుకే సర్కారు సన్నాహాలు ప్రారంభించినట్లు స్పష్టమవుతోంది. కానీ స్టాకు నిల్వ తేలాల్సిందే. ఖాళీ షాపులు సాక్షాత్కరిస్తే ఓ వైపు వాటిపై చర్యలు తీసుకుంటూనే, మరోవైపు ఐఎంల్ డిపోల ద్వారా సరుకు తరలించాల్సిందే. స్టాకుతో కళకళలాడుతున్న షాపుల తాళాలు మాత్రం తీయాల్సిందే. ఈ కథనం రాసే సమయానికి కొనసాగుతున్న మంత్రివర్గ సమావేశానంతరం ఈ విషయంపై సీఎం కేసీఆర్ ఓ ప్రకటన చేయవచ్చని కూడా అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇదీ తెలంగాాణాలో వైన్ షాపుల ఓపెన్ కు సంబంధించిన తాజా సంగతి.