తెలంగాణా రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్ రావు సతీమణి శ్రీనిత పాల వ్యాపారంలోకి ప్రవేశించారు. మహిళల దుస్తుల తయారీలో ప్రత్యేకతను సాధించిన శ్రీనిత తాజాగా సామాజిక కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆమె పాల ఉత్పత్తుల రంగంలోకి అడుగిడారు.
నాణ్యమైన, స్వచ్ఛమైన పాల ఉత్పత్తుల ‘మిల్చి మిల్క్’ (Milchy Milk) పేరుతో తాము సరికొత్త బ్రాండ్ ను తయారు చేస్తున్నట్లు తన్నీరు శ్రీనిత చెప్పారు. కరోనా వంటి అనారోగ్యకర పరిస్థితులు ప్రస్థుతం ఏర్పడ్డాయని, ప్రతీ ఒక్కరూ రోగ నిరోధక శక్తిని పెంపొందించుకుంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని ఆమె మిల్చీ మిల్స్ ఆవిష్కరణ సందర్భంగా చెప్పారు.
ఇందుకు మనం రోజూ తీసుకునే స్వచ్ఛమైన పాలు, పాల ఉత్పత్తులు ఎంతగానో దోహదం చేస్తాయన్నారు. మిల్చి మిల్క్ బ్రాండ్ స్వచ్ఛమైన తాజా పాల సేకరణ, ప్రాసెసింగ్, ప్యాకింగ్, సప్లై పూర్తి హైజెనిక్ పద్దతిలో నిర్వహించనున్నట్లు వివరించారు. వినియోగదారులు సంపూర్ణంగా నమ్మదగిన పాల ఉత్పత్తులు మిల్చీ బ్రాండ్ గా ఆమె తెలిపారు.
ప్రతిరోజూ పాలను సేకరిస్తూ, అనుభవజ్ఞులైన నిర్వాహకుల ఉద్యోగుల పర్యవేక్షణలో చిల్లింగ్ కేంద్రాలు, బల్క్ కూలర్లు, ప్యాకింగ్ స్టేషన్ల ద్వారా మొత్తం సరఫరా మార్గాలపై కఠినమైన నియంత్రణతో వినియోగదారుల ఇంటి వద్దకే తాజా స్వచ్ఛమైన పాలు, పాల ఉత్పత్తులను పంపిణీ చేస్తామని తన్నీరు శ్రీనిత వివరించారు.