ఈ ఫొటోను నిశితంగా పరిశీలించండి. అబ్బే… ఈరోజు అన్ని పత్రికల్లో వచ్చిన ఫొటోలే కదా? అని అని తీసి పారేయకండి. ఆసాంతం చదివాక అసలు విషయం తెలుసుకుని మీరే నివ్వెరపోతారు. సరే, ఫొటోను చూశారు కదా? నిన్న తాను ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ పర్యటించి అనేక అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఇందులో భాగంగానే గజ్వేల్ లో ఏర్పాటు చేసిన సమీకృత మార్కెట్ ను ప్రారంభించారు. కూరగాయల దుకాణదారుల వద్దకు వెళ్లి మార్కెట్ ఎలా ఉంది? సౌలత్ లు మంచిగున్నయా? అని కూడా కేసీఆర్ ఆరా తీశారు. ‘సంబురంగా ఉంది సారూ, నీ కడుపు సల్లగుండ, మంచి పని జేయించినవ్’ అంటూ అడివమ్మ అనే మహిళా వ్యాపారి సీఎం కేసీఆర్ సార్ కు చేతులెత్తి మొక్కిన ఫొటోను దాదాపు అన్ని పత్రికలు ప్రముఖంగానే ప్రచురించాయి.

ఇప్పడు ఈ పొటోను జాగ్రత్తగా పరిశీలించండి. మొదటి ఫొటోలో కేసీఆర్ సార్ కు చేతులెత్తి మొక్కుతున్న అడివమ్మ అనే కూరగాయల వ్యాపారే ఈ ఫొటోలోనూ ఉన్నారు. కూరగాయల వ్యాపారుల మంచీ, చెడుల గురించి తెలుసుకున్న కేసీఆర్ ఈ అడివమ్మ దగ్గరే కూరగాయలను కొని బోణీ చేయడం ద్వారా ఆమెకు రూ. 2 వేల నోటును కూడా ఇచ్చారు. అడివమ్మ కూరగాయల దుకాణంలో క్యారెట్, కాకర, చిక్కుడు, వంకాయ, టమాట వంటి రకరకాల కూరగాయలతోపాటు పచ్చి మిర్చి వగైరా కూడా ఉన్నాయి. ‘ఏమ్మా…కిలో టమాట ఎంత?’ అని సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా అడివమ్మతో మాటా మంతీ కూడా చేశారు. ఇప్పుడు రెండో ఫొటోను మరోసారి పరిశీలించండి. అడివమ్మ కూరగాయల దుకాణంలో ఉల్లిగడ్డలు కూడా ఉన్నాయి కదూ! కేసీఆర్ తోపాటు ఆయన వెంట గల మంత్రులు, అధికారుల్లో ఎవరు కూడా అడివమ్మ దుకాణంలో గల ఉల్లిగడ్డల ధర మాత్రం అడగలేదట. ఎందుకో తెలుసా? అడిగితే భగ్గుమంటున్న ఉల్లి గడ్డల ధరల నేపథ్యంలో కిలో రూ. 150 నుంచి రూ. 200 ధరను అడివమ్మ చెప్పక తప్పదు మరి. ధర అడిగాక ‘అడగబోతే అడివి’ తరహాలో గల ఉల్లిగడ్డలను అడివమ్మ దగ్గర కొనక తప్పదు కదా? సీఎం కేసీఆర్ సార్ అంతేసి ధర చెల్లించి ఉల్లిగడ్డలు కొంటే ఆకాశన్నంటుతున్న ఉల్లి ధరను అధికారికం చేసినట్లు అవుతుందట. అంతేకాదు కేసీఆర్ సార్ వంటి పెద్దోళ్లు తప్ప సామాన్యులెవరూ ఉల్లి గడ్డలు కొనే పరిస్థితులు ప్రస్తుతుం దరిదాపుల్లో లేవని కూడా చెప్పకనే చెప్పినట్లవుతుందట. అదీ ఈ రెండు ఫొటోలు చెప్పిన అసలు సంగతి.

Comments are closed.

Exit mobile version