కేటీఆర్ ఎవరు…? అని ప్రశ్నించారు వైఎస్ షర్మిల. శుక్రవారం నిర్వహించిన ‘మీడియా మీట్’ కార్యక్రమంలో షర్మిల మంత్రి కేటీఆర్ పై వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు ఆమె స్పందిస్తూ, కేటీఆర్ అంటే… అని పక్కన గల వారిని వాకబు చేస్తూ, కేటీఆర్ ఎవరు…? అని ప్రశ్నించారు. ఆ తర్వాత ఓ… కేసీఆర్ గారి కొడుకా..?’ అని నవ్వుతూ వ్యాఖ్యానించారు.
‘కేసీఆర్ గారు మహిళలను గౌరవించరు… మరి కేసీఆర్ గారి కొడుకుగారు మహిళలను గౌరవిస్తారని నేను అనుకోవాలా? ఎంత మంది మహిళలు ఉన్నారండీ టీఆర్ఎస్ పార్టీలో? ఎంత మందిని నిలబెట్టారు? ఎంత మందిని గెలిపించుకున్నారు? ఎంత మంది మంత్రులను చేశారు? ఒక్క మంత్రి అయినా మహిళ ఉందా అండీ? ఒక్కామె ఉందా? వాళ్ల పార్టీయేనా… పక్క పార్టీ నుంచి తెచ్చుకున్నారా? వీళ్లు మహిళల గురించి మాట్లాడుతారా? వీళ్ల దృష్టిలో… కేటీఆర్ గారి దృష్టిలో మహిళలంటే వంటింట్లో ఉండాలి..వ్రతాలు చేసుకోవాలనా అర్థం.. అంతేగా? అని షర్మిల ప్రశ్నించారు.
‘ఏ శతాబ్దంలో బతుకుతున్నామండీ? తెలంగాణా ఎక్కడుందండీ? మహిళలు ఎక్కడున్నారండీ? ఏం గౌరవిస్తున్నారండీ? సో…ఈరోజు మహిళలు వ్రతాలు చేసుకోవాలని తేల్చారు… పెద్దమనుషులు. సరే మేం ఆడవాళ్లం కదా? మేం వ్రతాలే చేస్తామని అనుకుందాం…నేను వ్రతమే చేస్తున్నానని అనుకుందాం… నిరుద్యోగుల కోసం వారానికోసారి నిరాహార దీక్ష చేస్తూ, అన్నం మెతుకు ముట్టకుండా నేను వ్రతం చేస్తున్నాననే అనుకుందాం. మరి పెద్ద మొగోడు కదా కేటీఆర్ గారు… ఏం చేస్తున్నారండీ? అధికారంలో ఉన్నారు కదా… ఏం చేస్తున్నారండీ? చెప్పండి… మీరు చెప్పండి… ఏం చేస్తున్నారండీ?’ అని నిలదీశారు.
‘మన రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నీ కలుపుకుంటే 3.85 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాల్సి ఉంటుంది కేసీఆర్ గారు… ఇవ్వమనండి… ఉద్యోగాలన్నీ ఇమ్మనండి. నోటిఫికేషన్లు ఇమ్మనండి.. భర్తీ చేయమనండి.. నా వ్రతం ఫలించిందని నేననుకుంటా..పెద్ద మొగోడు గదా.. సాధించాడని కూడా అనుకుంటా.. ఓకే? అని ముగించారు షర్మిల. షర్మిల చేసిన ఆయా వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను దిగువన గల లింక్ ద్వారా చూడవచ్చు.