ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థిత్వంపై కాంగ్రెస్ పార్టీలో క్లారిటీ వచ్చినట్టేనా? తాజా రాజకీయ పరిణామాలు ఇదే ప్రశ్నను రేకెత్తిస్తున్నాయి. రెండు రోజుల వ్యవధిలో చోటు చేసుకున్న ఘటనలను పరిశీలిస్తే ఖమ్మం పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థి ఎవరనే అంశం స్పష్టమవుతున్నట్టేనని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. దీంతో టికెట్ ఎవరికి దక్కనుందనే విషయం తేటతెల్లమవుతున్నట్లుగానే అంచనా వేస్తున్నారు.
రాష్ట్ర రాజకీయాలనే కీలక మలుపు తిప్పిన ఖమ్మం జిల్లా ఇప్పుడు మరోసారి రాష్ట్ర ప్రజల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. బీఆర్ఎస్ కు చెందిన ఏ ఒక్క అభ్యర్థినీ అసెంబ్లీ గేట్ తాకనివ్వనని సవాల్ చేసి మరీ కాంగ్రెస్ పార్టీలో చేరిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన ప్రతినను నెరవేర్చుకున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ లో చేరిన స్వల్ప కాలంలోనే పార్టీపరంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డికి లభించిన ప్రాధాన్యత తెలిసిందే. కాంగ్రెస్ లో పొంగులేటి చేరిక రాష్ట్ర రాజకీయాలనే మలుపు తిప్పిందనే విశ్లేషణలు ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ సాధించిన విజయంలో పొంగులేటి వంటి నాయకుల చేరిక సైతం కీలక భూమిక పోషించిందనే విషయం అందరికీ తెలిసిందే.
ఆయా పరిణామాల్లోనే బీఆర్ఎస్ పార్టీని గద్దె దించిన కాంగ్రెస్ నాయకులు వచ్చే పార్లమెంటు ఎన్నికల్లోనూ సత్తా చాటేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందులో భాగంగానే పార్లమెంటు నియోజకవర్గాలకు కో ఆర్డినేటర్లను నియమించి, సర్వేలు, దరఖాస్తుల స్వీకరణ, వడపోత వంటి ప్రక్రియను కాంగ్రెస్ ఎన్నికల కమిటీ నిర్వహిస్తోంది. రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థిత్వానికి అనేక మంది దరఖాస్తు చేశారు. వీరిలో కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి, సీనియర్ కాంగ్రెస్ నేత వి. హన్మంతరావు, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు, కాంగ్రెస్ నేత ప్రసాదరెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని తదితరులు ఉన్నారు.
ఈ నేపథ్యంలోనే తెలంగాణా నుంచి ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ పోటీ చేయాలని కోరుతూ పీసీసీ తీర్మానించింది. సోనియా ఇందుకు అంగీకరిస్తే ఖమ్మం నుంచి పోటీ చేయించాలని కూడా కాంగ్రెస్ నేతలు భావించారు. కానీ సోనియాగాంధీ రాజస్థాన్ నుంచి రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నామినేషన్ దాఖలు చేశారు. అదేవిధంగా గతంలో ఖమ్మం నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన రేణుకా చౌదరి ఎంపీ టికెట్ రేసులో ముఖ్య నాయకురాలిగా ఉన్నారు. ఆమెను కూడా రాజ్యసభకు పంపేందుకు టికెట్ కేటాయించిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాల్లో ఖమ్మం ఎంపీ టికెట్ ఎవరికి దక్కనుంచే అంశంలో క్లారిటీ వచ్చినట్లేనని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
ఎంపీ టికెట్ కోసం పోటీ పడుతున్న ముఖ్య నేతల్లో ప్రస్తుతం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాదరెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి భార్య నందిని ఇతర నాయకులు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఓ యూ ట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భట్టి భార్య నందిని చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ లో భిన్న వాదనలకు తావు కల్పించాయి. నందిని తన ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఎంపీ టికెట్ రేసులో తీవ్ర ప్రతిబంధకంగా మారాయనే వ్యాఖ్యలు కాంగ్రెస్ వర్గాల నుంచే వినిపిస్తున్నాయి.
ఈ పరిస్థితుల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాదరెడ్డి ఎంపీ టికెట్ రేసులో అందరికన్నా ముందున్నట్లు కాంగ్రెస్ వర్గాలు క్లారిటీగా చెబుతున్నాయి. ఓ రకంగా చెప్పాలంటే ప్రసాదరెడ్డికి కాంగ్రెస్ టికెట్ దాదాపుగా ఖరారైనట్లుగానే పేర్కొంటున్నారు. ఇటు ఖమ్మం, అటు మహబూబాబాద్ పార్లమెంట్ స్థానాలకు కో ఆర్డినేటర్ గా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బాధ్యతలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పరిస్థితుల్లో ఈ రెండు స్థానాల్లోనే కాదు రాష్ట్రంలోని మిగతా 15 ఎంపీ స్థానాల్లోనూ పార్టీ అభ్యర్థులను గెలిపించడంలో మంత్రి పొంగులేటి పాత్ర అత్యంత కీలకంగా ఉంటుందంటున్నారు. ఆయా అనేక అంశాలు పొంగులేటి ప్రసాదరెడ్డికి కలిసి వస్తున్నాయని, టికెట్ గ్యారంటీకి దోహదపడుతున్నాయని పరిశీలకుల భావన. మొత్తంగా ఏ కోణం నుంచి పరిశీలించినా, విశ్లేషించినా ఖమ్మం ఎంపీ టికెట్ ప్రసాదరెడ్డికి గ్యారంటీగానే కాంగ్రెస్ శ్రేణులు చెబుతున్నాయి. ఇంకా క్లుప్తంగా చెప్పాలంటే ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా ప్రసాదరెడ్డి ఖరారు ప్రకటన కాంగ్రెస్ పార్టీలో లాంఛనం మాత్రమేనని పరిశీలకులు సైతం వ్యాఖ్యానిస్తున్నారు.