బురద మడిలోకి దిగి నాట్లేసే కూలీలకు నారు పంచేవాడు రైతు… పంట చేనులోకి దిగి పురుగుల మందు కొట్టే వాడు, యూరియా చల్లే వాడు రైతు… వరి మోపులు కట్టి, మెద కొట్టి ధాన్యం తీసే వాడు రైతు. తీసిన ధాన్యంలో తాలు లేకుండా తూర్పారబట్టేవాడు రైతు. సేద్యంలో ఇవన్నీ పాత పద్ధతులు కాబట్టి… మొత్తంగా యాంత్రీకరణలో ట్రాక్టర్ ఎక్కి దుక్కి దున్నేవాడు, నారుకు నీళ్లు పెట్టేవాడు రైతు అనుకుందాం. సాగు భూమి అన్నాక కాకర చెట్టో, కంది చేనో పండాలి. కనీస చారెడు నువ్వులో, కుంచెడు కందులో భూమిలో నవ్వాలి. పంట భూమిలో ఏ పనీ చేయనివాడు కూడా రైతేనా? తొండలు కూడా గుడ్లు పెట్టని బీడు భూములు సైతం పచ్చని పంట క్షేత్రాలేనా? ఇటువంటి భూములకు తెలంగాాణా ప్రభుత్వం ఏటా రూ. 3 వేల కోట్లను ధారాదత్తం చేస్తోందా? ఎక్కడో విదేశాల్లోనో, హైదరాబాద్ నగరంలోనో తలదాచుకుంటున్న బడా ‘పెత్తందార్ల’కు పెట్టుబడి సాయం అందిస్తోందా? ఎందుకు? ఇది నిజమైన రైతుకు అమోద యోగ్యమేనా? ఈ ప్రశ్నలకు సమాధానం లభించాలంటే పూర్తి వివరాల్లోకి వెళ్లక తప్పదు.
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ రైతన్నల గోస అంతా ఇంతా కాదు. ఆరుగాలం కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకొని, పంటలు పండించి, అందరికీ అన్నంపెట్టే అన్నదాతకు కష్టాలు, కన్నీళ్లే మిగిలేవి. కరంటు రాక, నీళ్లు లేక పంటలు ఎండిపోయి దిక్కుతోచక, చివరకు వందలాది మంది రైతులు ఆత్మహత్యలు కూడా చేసుకున్న ఘటనలు అనేకం. ఈ నేపథ్యంలో స్వరాష్ట్రం వచ్చాక రైతుల సమస్యలను పరిష్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం వినూత్నమైన, ఆదర్శవంతమైన నిర్ణయాలు తీసుకున్నది.
ఇందులో భాగంగానే రైతులకు సకాలంలో కల్తీలేని విత్తనాలు, ఎరువులతోపాటు అత్యవసరమైన పంట పెట్టుబడిని ‘రైతుబంధు’ పేరిట ప్రభుత్వమే అందిస్తున్నది. అలాగే 60 ఏళ్లలోపు రైతుల ఏ కారణంతోనైనా మరణిస్తే 10 రోజుల్లోగా ఆ కుటుంబానికి రూ.5 లక్షలు అందేలా బీమా కల్పించి ఆదుకుంటూ దేశంలోనే తెలంగాణ ఆదర్శ రాష్ట్రంగా నిలిచింది. ఇంతవరకు రైతుల పక్షాన నిలిచి, ఇంత గొప్ప నిర్ణయాన్ని స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఎన్నడూ ఏ ప్రభుత్వమూ తీసుకోలేదు. రైతులకు పెట్టుబడి ఇచ్చి ‘రైతు బంధు’వు అయ్యాడు కేసీఆర్… అనడంలోనూ సందేహం లేదు. కానీ రైతులు పంటలు పండించే సాగు భూములకు మాత్రమే రైతుబంధు అందాలి. ఇది కనీస ధర్మం. కర్షకుని కష్టానికి సర్కారు చేదోడు, వాదోడు కూడా…
అయితే రైతుబంధు విషయంలో 30 లక్షల ఎకరాల సాగుచేయని పడావు భూముల యజమానులకు రెండు పంటలకు కలిపి ఎకరానికి ఏటా 10 వేల చొప్పున మొత్తం రూ. 3 వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని అందిస్తూ వృధా చేయడంపైనే అనేక అభ్యంతరాలున్నాయి. ప్రభుత్వం కూడా ఎంతసేపూ రైతుబంధు పథకం అమలు అంశంలో 12 వేల కోట్ల రూపాయల నిధులు, దాదాపు 58 లక్షల మంది రైతుల ఖాతాల్లో జమ అయిన విషయాలే చెబుతున్నదిగానీ, అందులో సాగుభూములెన్ని? పడావు భూములెన్ని? అనే వివరాలను మాత్రం చెప్పడం లేదు. ఇప్పటి వరకు ఈ వివరాలను ప్రభుత్వం అందించిన దాఖలాలు కూడా లేవు. కానీ ఆ విషయాల్ని మనం లెక్కిస్తే…
రైతుబంధు పథకం ద్వారా దాదాపు 58 లక్షల మంది రైతులకు పంట పెట్టుబడి కోసం కోసం 2019-20 బడ్జెట్లో రూ.12 వేల కోట్లు కేటాయించారు. అంటే.. ఇది ఎకరాకు పంటకు 5 వేల చొప్పున చొప్పున అందజేస్తే మొత్తం రెండు పంటలకు కలిపి 2 లక్షల 40 వేల ఎకరాలకు సరిపోతుంది. కానీ, ఇక్కడ సాగు అయిన భూముల విస్తీర్ణం చూస్తే… 2019 వానాకాలంలో 1 లక్షా 20 వేల ఎకరాలు + యాసంగిలో 60 లక్షల ఎకరాలు = దీంతో రెండు పంటలకూ కలిపి మొత్తం 1 లక్షా 80 వేల ఎకరాలే అవుతుంది.
వాస్తవానికి వానాకాలంలో సాగు చేసిన భూమిలోనే యాసంగిలోనూ రైతు పంటలు పండిస్తుంటాడు. సీజన్లను బట్టి వేర్వేరుగా, ప్రత్యేకంగా సేద్యపు భూములు ఉండవు. నీటి లభ్యత తదితర అంశాలు యాసంగి సేద్యపు విస్తీర్ణానికి ప్రామాణికంగా నిలుస్తాయి. అయినప్పటికీ 1.80 లక్షల ఎకరాలను పరిగణనలోకి తీసుకున్నా… ఈ విస్తీర్ణానికి రూ. 9 వేల కోట్ల రూపాయలు రైతుబంధు పథకం కోసం సరిపోతాయి. అంటే మిగతా 3 వేల కోట్లు రెండు పంటలకు కలిపి దాదాపు 60 వేల ఎకరాల పడావు భూములకు ( కనీసం దున్నకుండా వదిలేసిన / ఏ పంటలూ వేయని భూములు) కూడా రైతుబంధు అందుతోందనేది స్పష్టం. సాగు చేయకుండా వృథాగా పడి ఉన్న, రాళ్లు, రప్పలతో ఉన్న బంజరు, పడావు భూములకు కూడా రైతుబంధు పేరిట ఇస్తున్న ఈ 3 వేల కోట్ల రూపాయలు వృథాయే కదా?
అదేవిధంగా పదెకరాల వరకు భూమి ఉన్న రైతులకు మాత్రమే రైతుబంధు ఇస్తామని పరిమితి విధిస్తే మరో 15 లక్షల ఎకరాల భూమిని కలిగి ఉన్న బడా రైతులకు పథకాన్ని వర్తింపజేయాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే పదెకరాల పైన భూములున్న రైతులెవరూ పెట్టుబడి సాయం కోసం ఎదురుచూసే ఆర్థిక పరిస్థితులు పెద్దగా ఉండకపోవచ్చు. ఇటువంటి వారికి రైతుబంధు సాయం ఇవ్వాల్సిన పనే లేదన్ని మరో వాదన. దీంతో మరో 1,500 కోట్ల రూపాయలు మిగులుతాయి. మొత్తంగా ఈ 4,500 వేల కోట్ల రూపాయల ప్రజాధనంతో రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయవచ్చనేది విశ్లేషకుల అంచనా.
అయితే పడావు భూములు కలిగి ఉన్న దాదాపు 2 లక్షల మంది యజమానుల ఓట్ల కోసం, పదెకరాలకు పైగా భూమిని కలిగి ఉన్న మరో లక్ష మంది బడా రైతుల కుటుంబాల ఓట్ల కోసం… ‘మేం రైతుబంధు ఇలాగే ఇస్తాం. పథకాన్ని ఇలాగే కొనసాగిస్తాం. రూ. 3 వేల కోట్లు మాకో లెక్క కాదు. అవసరమైతే మరిన్ని అప్పులు చేసి అందిస్తాం’ అని పాలకులు ఎన్నికల కోణంలో ఆలోచిస్తే మాత్రం ఎవరు కూడా చేసేదేమీ లేదు… జయహో కేసీఆర్ సార్.. అని జేజేలు పలుకుతూ, పాలాభిషేకాలు చేయడం తప్ప. అదీ సంగతి.