కరోనా మహమ్మారి, బ్లాక్ ఫంగస్ బాధలతోనే ప్రజానీకం అల్లాడుతున్న పరిస్థితుల్లో మరో కొత్తరకం ఫంగస్ బీహార్ లో వెలుగు చూసింది. బ్లాక్ ఫంగస్ కన్నా ప్రాణాంతకమైనదిగా భావిస్తున్న దీన్ని ‘వైట్ ఫంగస్’గా వ్యవహరిస్తున్నారు. స్టెరాయిడ్లు ఎక్కువగా తీసుకునేవారికి, షుగర్ పేషెంట్లకు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి వైట్ ఫంగస్ సోకుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. బీహార్ లోని పాట్నాకు చెందిన నలుగురిలో వైట్ ఫంగస్ కనిపించగా, బాధితుల్లో ఓ డాక్టర్ కూడా ఉన్నట్లు జాతీయ వార్తా సంస్థలు నివేదిస్తున్నాయి. కరోనా వైరస్ లక్షణాలు గల ఈ నలుగురు బాధితులకు వాస్తవికంగా కరోనా సోకలేదని, అన్ని వైద్య పరీక్షల్లో వీరికి నెగిటివ్ రిపోర్టులు వచ్చాయని సమాచారం. అయితే ఈ నివేదికలను లోతుగా పరిశీలించినపుడు బాధితులకు వైట్ ఫంగస్ సోకినట్లు వెల్లడైందని, అదృష్టం కొద్దీ యాంటీ ఫంగల్ మెడిసిన్స్ ఇవ్వడంతో బాధితులు వైట్ ఫంగస్ బారి నుంచి కోలుకున్నట్లు పీఎంసీహెచ్ కు చెందిన మైక్రోబయాలజీ విభాగపు హెడ్ డాక్టర్ ఎస్ఎన్ సింగ్ వివరించారు. వైట్ ఫంగస్ బారిపడినవారికి ఊపిరిత్తులు, చర్మం, ఉదరం, చర్మం, కిడ్నీలు, మెదడు, మర్మావయాలు ప్రభావితమవుతాయని వైద్య వర్గాలు చెబుతున్నట్లు జాతీయ వార్తా సంస్థలు తమ కథనాల్లో నివేదించాయి.