పురాణాలు… ఇతిహాసాలు… రాజు… ప్రజలు…వంటి పదాలతో హైకోర్టు చేసిన సూచనలేవీ తెలంగాణా ప్రభుత్వం చెవికెక్కినట్లు లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తప్పడు అఫిడవిట్లు, కొందరు  ఐఏఎస్ అధికారుల వ్యవహారశైలిపై హైకోర్టు చీఫ్ జస్టిస్ తలంటినా ఆర్టీసీ కార్మికుల సమ్మె అంశంలో ప్రభుత్వ వైఖరిలో ఎటువంటి మార్పు కనిపించడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. తాము 48 వేల మంది ఆర్టీసీ కార్మికుల గురించి కాకుండా, మూడు కోట్ల మంది ప్రజల గురించి యోచిస్తున్నామని, ఈ సర్కార్ కురూ. 47 కోట్ల అంశం పెద్ద కష్టమేమీ కాదంటూ హైకోర్టు ఈనెల 7న చేసిన వ్యాఖ్యలు పాలకులు వినిపించుకున్నట్లు కనిపించడం లేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వానికి మరోసారి చెబుతున్నామని, కార్మికులతో చర్చలు జరిపి, సంప్రదింపులతో ఓ నిర్ణయానికి రావాలని, లేని పక్షంలో తామే ఓ నిర్ణయం తీసుకుంటామని కాస్త కఠినంగానే హైకోర్టు చేసిన హెచ్చరికను కూడా ప్రభుత్వం ఖాతరు చేసినట్లు కనిపించడం లేదంటున్నారు. ఎందుకంటే…

ఆర్టీసీ సమ్మెపై ఈనెల 7వ తేదీన జరిగిన విచారణ సందర్భంగా రాష్ట్ర హైకోర్టు కొందరు ఐఎఎస్ అధికారులకు తలంటిన సంగతి తెలిసిందే కదా? పనిలో పనిగా ప్రభుత్వానికి, నేరుగా కాకపోయినా పరోక్షంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కు పురాణాలు, ఇతిహాసాలను గుర్తు చేస్తూ కొన్ని హిత సూచనలు కూడా చేసింది. కానీ ప్రభుత్వం ఇవేవీ పట్టించుకున్నట్లు కనిపించడం లేదనే భావన ఆర్టీసీ కార్మిక వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఆర్టీసీ సమ్మెపై సోమవారం (నేడు) విచారణ జరుగుతున్న సందర్భంగా హైకోర్టులో దాఖలు చేయడానికి ప్రభుత్వం రూపొందించిన అఫిడవిట్ లోని ముఖ్యాంశాలు ఇవే అనుమానాలను కలిగిస్తున్నట్లు కార్మిక వర్గాలు పేర్కొంటున్నాయి. కార్మికుల డిమాండ్ల పరిష్కారం కోసం చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశామని, రూ. 47 కోట్లు చెల్లించినా సమస్యలు కొలిక్కి రావని, ఆర్టీసీ యూనియన్ల తీరుతో చర్చల వల్ల లభించే ప్రయోనం లేదని, ఆర్టీసీ తీవ్ర నష్టాల్లో ఉందని, ఇంకెంత కాలం సాయం చేయాలి? అనే అంశాల సారాంశంతో ప్రభుత్వం మరో అఫిడవిట్ ను సిద్ధం చేసింది. సోమవారం హైకోర్టులో దాఖలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధం చేసిన ఈ అఫిడవిట్ లోని ఆర్థిక ముఖ్యాంశాలను పరిశీలిస్తే సమ్మెపై, ఆర్టీసీ భవితవ్యంపై ప్రభుత్వ యోచన స్పష్టంగానే గోచరిస్తోందని పరిశీలకులు అంటున్నారు. ఉద్యోగుల పీఎఫ్ రూ. 788.30 కోట్లు, క్రెడిట్ కో-ఆపరేటివ్ సొసైటీ రూ. 500.95 కోట్లు, 2014-18 మధ్య లీవ్ ఎన్ క్యాష్ మెంట్ కింద రూ. 180.00 కోట్లు, రిటైర్డ్ ఎంప్లాయీస్ సెటిల్మెంట్ కోసం రూ. 52.00 కోట్లు, 2017-19 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి మోటారు వాహన పన్ను కింద 452.36 కోట్లు, ఆయిల్ బిల్లుల చెల్లింపు కింద రూ. 34.45 కోట్లు, జోన్ పేమెంట్స్, హెడ్ క్వార్టర్స్ చెల్లింపుల కింద రూ. 36.40 కోట్లు, అద్దె బస్సలు ఛార్జీల కింద రూ. 25.00 కోట్లు, బస్సు బాడీలకు సంబంధించి రూ. 60.00 లక్షలు, బస్సు బిల్డర్లకు రూ. 74.60 కోట్లు, అక్టోబర్, నవంబర్ నెలల రుణ చెల్లింపుల కింద రూ. 65.00 కోట్ల ఆర్థిక మొత్తాలను ప్రభుత్వం తెరపైకి తీసుకువచ్చింది. హైకోర్టు సూచనలను పాటిస్తే రూ. 2,209.00 కోట్ల మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుందని, ఇది రూ. 47 కోట్ల చెల్లింపులతో తీరే సమస్య కాదని ప్రభుత్వం తేల్చి చెబుతున్నట్లు తాజాగా తయారైన అఫిడవిట్ సారాంశం. మరోవైపు గత ఆగస్టు నాటికి ఆర్టీసీ నష్టాల మొత్తం రూ. 5,269.25 కోట్లకు చేరినట్లు కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది. అంతేగాక పండుగ సీజన్లలో సమ్మె వల్ల ఆర్టీసీ ఆదాయానికి గండి పడిందని, అయోధ్య భూమిపై సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన రోజే ఛలో ట్యాంక్  బండ్ నిర్వహించారని ప్రభుత్వం వినూత్న వాదనను తెరపైకి తీసుకువస్తున్న తీరుపైనా కార్మిక వర్గాలు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం సిద్ధం చేసిన ఈ అఫిడవిట్ లోని అంతరంగాన్ని పరిశీలిస్తే టీఎస్ ఆర్టీసీని పూర్తి స్థాయిలో ప్రయివేట్ పరం చేసేందుకే ప్రభుత్వం మొగ్గు చూపుతోందనే అభిప్రాయాలను కార్మిక వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.

అయితే టీఎస్ఆర్టీసీకి చట్టబద్దతే లేదని, విభజన తంతు పూర్తి కాలేదని, ఏపీఎస్ ఆర్టీసీతో మాత్రమే కేంద్రానికి వాటా సంబంధముందని కేంద్ర ప్రభుత్వం తరపున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ రాజేశ్వరరావు ఈనెల 7న హైకోర్టులో వాదనలు వినిపించిన నేపథ్యంలో తెలంగాణా సర్కార్ ఆర్టీసీని ప్రయివేట్ మార్గంలో ఎలా పయనింపజేస్తుందన్నది మరో ప్రశ్న. టీఎస్ ఆర్టీసీకి చట్టబద్ధత లేకపోతే కేంద్రం ఎలక్ట్రిక్ బస్సులను ఏ ప్రాతిపదకన మంజూరు చేసిందని ప్రభుత్వ వర్గాలు మరోవైపు వాదిస్తున్నాయి. వాద ప్రతివాదన సంగతి ఎలా ఉన్నప్పటికీ 38వ రోజుకు చేరుకున్న ఆర్టీసీ సమ్మె అంశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ వైఖరిపై ఓ జర్నలిస్టు మిత్రుడు ఆసక్తికర ప్రశ్నను సంధించారు అదేమిటో ఆయన మాటల్లోనే…

‘‘సాధారణంగా సీఎం కేసీఆర్ భేషజాలకు వెళ్లరు. అనేక సందర్భాల్లో కేసీఆరే ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఏపీలో ఆర్టీసీ విలీనం గురించి తెలంగాణా కార్మికులు కూడా పట్టుబడుతున్నారు కదా? జగన్ ప్రభుత్వం  అక్కడ ఏం చేస్తుందో చూద్దాం… అక్కడ విలీన ప్రక్రియ మొత్తం  పూర్తయ్యాక, మనం కూడా మంచీ, చెడులు ఆలోచించి అదే మార్గంలో పయనిద్దాం. ముందు సమ్మె విరమించి బస్సులు నడపండి. మిగతా సమస్యల పరిష్కారం నాకు వదిలేయండి…అని కార్మిక సంఘాలను పిలిచి కాస్త నచ్చజెపితే పరిస్థితి ఇంత దూరం వచ్చేది కాదు కదా? కార్మికులు కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసేవారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి దిష్టిబొమ్మలు తగలబెడుతున్నారు. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? కార్మికులకు నచ్చజెప్పకుండా మొండి వైఖరిని అవలంభిస్తున్నారంటే… ఆర్టీసీపై పాలకుల మస్తిష్కంలో అసలు యోచన ఏదో ఉన్నట్లే కదా?’’

Comments are closed.

Exit mobile version