మొన్న జెట్టి కుసుమ కుమార్… నిన్న వి. హన్మంతరావు.. ఈ ఇద్దరు కాంగ్రెస్ నేతలు ఖమ్మం ఎంపీ సీటుపై కన్నేయడం ఆ పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీంతో ఖమ్మం ఎంపీ సీటు.. స్థానికేతరులకు రాజకీయ అడ్డాగా మారిందా..? అంటే ఔననే సమాధానానికి చారిత్రక ఆధారాలున్నాయి. అనేక మంది స్థానికేతర నాయకులకు కూడా ఖమ్మం జిల్లా కేంద్రం రాజకీయంగా ఉజ్వల భవితనిస్తున్నదనే చెప్పవచ్చు.
అనేక ఎన్నికల్లో ఇక్కడ ఎంపీలుగా గెలుపొందినవారిలో తక్కువ మంది నాయకులు మాత్రమే ఖచ్చితమైన స్థానికులుగా ఇక్కడి ప్రజలు అభివర్ణిస్తుంటారు. ఖమ్మం నుంచి 1952, 1957 ఎన్నికల్లో ఎంపీగా గెలిచిన పీపుల్స్ డెమొక్రటిక్ ఫ్రంట్ (పీడీఎఫ్) నాయకుడు టీబీ విఠల్ రావు, 1962, 1967, 1971లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఎంపీగా విజయం సాధించిన టి. లక్ష్మికాంతమ్మ, 1991లోకాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన పీవీ రంగయ్య నాయుడు, 1998లో గెల్చిన నాదెండ్ల భాస్కర్ రావు, 1999, 2004లలో ఎంపీగా గెలుపొందిన రేణుకా చౌదరిలు స్థానికేతరులే కావడం గమనార్హం.
అదేవిధంగా 1977, 1980లలో గెలిచిన జలగం కొండల్ రావు, 1984, 1989లలో గెలుపొందిన జలగం వెంగళరావు, 2009, 2019లో ఎంపీగా గెల్చిన నామ నాగేశ్వర్ రావులు ఇతర జిల్లాల్లో జన్మించినప్పటికీ, వ్యాపారపరంగా దశాబ్ధాలుగా ఖమ్మం జిల్లాలో స్థిరపడి రాజకీయంగా చారిత్రక నేపథ్యాన్ని కలిగి ఉండడం గమనార్హం. ఇక 1996లో, 2014లో ఎంపీలుగా గెల్చిన తమ్మినేని వీరభద్రం, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు ఖమ్మం జిల్లాలోనే జన్మించిన నాయకులు కావడం విశేషం. ఇప్పటి వరకు జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థి రెండుసార్లు, తెలుగుదేశం, సీపీఎం, వైఎస్ఆర్ సీపీ, టీఆర్ఎస్ అభ్యర్థులు ఒక్కోసారి ఇక్కడ విజయం సాధించగా, 11సార్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే ఇక్కడ గెలుపొందారు. సాంప్రదాయ, పటిష్టమైన ఓటు బ్యాంకు కలిగిన కాంగ్రెస్ పార్టీకి ఖమ్మం దుర్భేద్యమైన కోటగా నిలిచిందనేందుకు ఇక్కడ ఆ పార్టీ అభ్యర్థులు సాధించిన విజయాలే నిదర్శనం. కొన్ని ప్రత్యేక పరిస్థితులు, రాజకీయ, సామాజిక సమీకరణల పరిణామాల్లో మాత్రమే ఇతర పార్టీల అభ్యర్థులు ఇక్కడ విజయం సాధించారనే వాదనలు కూడా ఉన్నాయి.
ఈ నేపథ్యంలో సహజంగానే ఖమ్మం టికెట్ దక్కించుకుంటే పార్లమెంటులో అడుగిడడం ఖాయమనే భావన పలువురు కాంగ్రెస్ నేతల్లో నెలకొంది. అందువల్లే కాబోలు అనేక సందర్భాల్లో స్థానికులకు కాకుండా పార్టీ అధిష్టానం వద్ద పలుకుబడి గల స్థానికేతర కాంగ్రెస్ నేతలు ఖమ్మం టికెట్ తెచ్చుకుని రాజకీయంగా ఎదుగుతున్నారనే వ్యాఖ్యలు కాంగ్రెస్ శ్రేణుల నుంచి బలంగా వినిపిస్తుంటాయి. తాజా పరిణామాల్లో డిప్యూటీ సీఎం భట్టి భార్య నందిని, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాదరెడ్డి, తుమ్మల తనయుడు యుగంధర్ సహా మరికొందరు స్థానిక నేతలు ఈసారి కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీ టికెట్ ను ఆశిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే మొన్న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జెట్టి కుసుమకుమార్, నిన్న సీనియర్ నేత వి. హన్మంతరావు రంగంలోకి దిగారు. తమకు ఖమ్మం టికెట్ ఇవ్వాలని కోరుతూ ప్రెస్ మీట్లు పెట్టి మరీ కోరుతున్నారు. తాజా వార్త ఏమిటంటే సీఎం రేవంతర్ రెడ్డి వినతి మేరకు తెలంగాణా నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అంగీకరించారట. ఖమ్మం, నల్లగొండ, భువనగిరి స్థానాలలో ఏదో ఒకచోటు నుంచి రాహుల్ గాంధీ పోటీ చేసేందుకు నిర్ణయం జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. రాహుల్ గాంధీ ఆయా మూడు నియోజకవర్గాల్లో ఏ స్థానాన్ని ఎంచుకుంటారనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఆసక్తికరంగా మారిందంటున్నారు.
ఇమేజ్: కాంగ్రెస్ సీనియర్ నేత వి. హన్మంతరావు