స్వచ్ఛంద పదవీ విరమణకు (వీఆర్ఎస్) దరఖాస్తు చేసిన ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తదుపరి అడుగులేమిటి? ఇదీ తెలంగాణా వ్యాప్తంగా తాజా రాజకీయ చర్చ. ‘కృతజ్ఞతాభివందనం’ శీర్షికన ప్రియమైన ప్రజలకు.., అంటూ ఆయన ఈ సందర్భంగా విడుదల చేసిన రెండు పేజీల లేఖలో అనేక ఆసక్తికర అంశాలుండడం విశేషం. వీఆర్ఎస్ తీసుకోవడం కొంత బాధ కలిగించినా, ఎట్టకేలకు ఎలాంటి పరిమితులు లేకుండా, తన మనసుకు ఇష్టమైన పనులను, తనకు నచ్చిన రీతిలో చేయబోతున్నాననే ఆనందం తనకు మరింత ఉత్సాహాన్ని, కొత్త శక్తిని ఇస్తోందని ఆయన ప్రకటించడం గమనార్హం. అంతేకాదు తన పదవీ విరమణ తర్వాత తన శేష జీవితమంతా తన స్ఫూర్తి ప్రదాతలైన జ్యోతిరావు ఫూలే దంపతులు, అంబేడ్కర్, కాన్షీరాంలు చూపిన మార్గంలోనే నడిచి, పేదలకు, పీడితులకు అండగా ఉంటానని ప్రకటించారు. తద్వారా భావి తరాలను ఒక కొత్త ప్రపంచంలోకి నడిపించే ప్రయత్నం చేస్తానని అన్నారు. తన నూతన ప్రయాణంలో అందరి దీవెనలు మెండుగా ఉండాలని కూడా ప్రవీణ్ కుమార్ ఆకాంక్షించారు.
ఇదే దశలో… కొంత మంది వ్యక్తులు ప్రచారం చేస్తున్నట్లు ప్రవీణ్ కుమార్ వాలంటరీ రిటైర్మెంట్ కు, హుజూరాబాద్ ఉప ఎన్నికలకు ఎటువంటి సంబంధం లేదని, ఆట మొదలుకాబోతున్నదని ఆయన అభిమానులు సోషల్ మీడియా వేదికగా ప్రకటిస్తున్నారు. విద్యాపరంగా ఎన్నో మార్పులతో, ఎంతో మంది గుండెల్లో నిలిచిన ప్రవీణ్ కుమార్ ఇప్పుడు ప్రజాక్షేత్రంలోకి రంగ ప్రవేశం చేస్తున్నారని, అక్షరం, ఆరోగ్యం, ఆర్థికం, అధికారం లక్ష్యంగా పయనించబోతున్నారని అంటున్నారు. భవిష్యత్త్ కార్యాచరణ గురించి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ త్వరలో చెబుతారని కూడా స్వేరోలు కొందరు వెల్లడిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ టీఆర్ఎస్ లో చేరుతారనే ప్రచారంపై సహజంగానే సంశయాలు వ్యక్తమవుతున్నాయి.
తాజాగా వ్యాప్తిలోకి వచ్చిన ప్రచారం ప్రకారం… ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజకీయంగా సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ, తీన్మార్ మల్లన్నలతో కలిసి ఓ కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించబోతున్నారనేది ఆయా ప్రచారపు సారాంశం. ఆగస్టు 29వ తేదీ నుంచి ప్రారంభించే తన పాదయాత్రకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను ఆహ్వానిస్తున్నట్లు తీన్మార్ మల్లన్న ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ కార్యక్రమం సందర్భంగానే రాజకీయ సంచలనం చోటు చేసుకోబోతోందనే ప్రచారం జరుగుతోంది. అటు మంద కృష్ణ, ఇటు తీన్మార్ మల్లన్నలతో కలిసి ఆర్ఎస్ ప్రవీణ్ రాజకీయ అడుగులు వేయబోతున్నారని అంటున్నారు. అయితే ఈ అంశంలో మరింత స్పష్టత రావలసి ఉంది. కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీతో కలసి ఈ ముగ్గురు నేతలు పయనిస్తారా? లేక సరికొత్త రాజకీయ వేదికను ఏర్పాటు చేస్తారా? అనేది మాత్రం ప్రశ్నార్ధకంగానే ఉందంటున్నారు.
ఇదిలా ఉండగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మరే ఇతర రాజకీయ వేదికవైపు పయనించకుండా టీఆర్ఎస్ పార్టీ చీఫ్ కేసీఆర్ వ్యూహ రచన చేస్తున్నట్లు కూడా మరోవైపు ప్రచారం జరుగుతుండడం కొసమెరుపు.