‘‘దొంగలెవరో, దొరలెవరో ద్రోహులెవరో, మోసకారులెవరో, అసలు, సిసలు వాళ్లెవరో తెల్వాల్సి ఉంటది రాజకీయాలల్ల. ఒక్కటి మాత్రం సత్యం… దొంగలు, మోసకారులు ఒక్కసారి మోసం చేస్తరు కావచ్చు. ధర్మాన్ని మాత్రం ఎవ్వడూ మోసగించలేడు. న్యాయాన్ని కప్పిపుచ్చలేరు. ధర్మం, న్యాయం నుంచి ఎవరూ తప్పించుకోలేరు. ఒక పత్రిక రాస్తది… ఈయనకు మంత్రి పదవే రాకపోతుండే. కొడకా… కులంతో కొట్లాట చరిత్ర పెట్టలే. తెలంగాణా ఆత్మగౌరవం కోసం కొట్లాడినం. విముక్తి కోసం కొట్లాడినం తప్ప… చిన్న మనిషా? ఈటెల రాజేందర్ అనెటోడు? ఈటెల రాజేందర్ అనెటోడు తెలంగాణ ఉద్యమంలో మూడున్నర కోట్ల తెలంగాణా బిడ్డల ఆత్మగౌరవ బావుటా ఎగురవేసిన బిడ్డ ఈ బిడ్డ. మేం గులాబీ జెండాకు ఓనర్లం. మధ్యల వచ్చినోళ్లం కాదు. బత్కొచ్చినోళ్లం కాదు. అడుక్కునేవాళ్లెవరో రేపు తెలుస్తది. అధికారం శాశ్వతం కాదు. ధర్మం, న్యాయం శాశ్వతం. నాయకులు కాదు… ప్రజలే చరిత్ర నిర్మాతలు. ధీరుడు ప్రజల్లో కొట్లాడుతడు. కుట్రలు, డబ్బుతో కొట్లాడడు.’’

గుర్తున్నాయి కదా? మంత్రి ఈటెల రాజేందర్ గత ఆగస్టులో హుజురాబాద్ సభలో చేసిన సంచలన వ్యాఖ్యల్లో కొన్ని మాత్రమే ఇవి. ఈటెల వ్యాఖ్యలు తెలంగాణాలోని అధికార పార్టీలో అప్పట్లో పెద్ద దుమారమే లేపాయి. మామూలు దుమారం కూడా కాదు. అదే పార్టీలో గల ఎందరో నాయకులకు ఈటెల మాటలు తూటాల్లా…సూటిగా తగిలినట్లు వార్తలు కూడా వచ్చాయి, మరెందరో నాయకులు లోలోపలే విలవిలలాడినా కక్కలేక, మింగలేక మిన్నకున్న స్థితి. సీం కేసీఆర్ మంత్రివర్గ విస్తరణకు ముందు తనను మంత్రివర్గం నుంచి తప్పిస్తారని జరిగిన ప్రచారం నేపథ్యంలో ఈటెల చేసిన వ్యాఖ్యలకు మద్ధతా? అన్నట్లు మరికొన్ని గొంతులు కూడా కలిశాయి. రాజేంద్రన్న, తాను కడుపులో ఏదీ దాచుకోలేమని మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పది రోజుల వ్యవధిలోనే వ్యాఖ్యానించారు. గులాబీ జెండాకు తాను కూడా ఓనర్ నేనని మాజీ హోం మంత్రి నాయని నరసింహారెడ్డి ప్రకటించారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే కేసీఆర్ మంత్రివర్గ విస్తరణలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నయి. హరీష్ రావుతోపాటు కేటీఆర్ తదితరులకు మంత్రివర్గంలో చోటు దక్కింది.

అయితే ఇదే దశలో కరీంనగర్ జిల్లా నుంచి ఈటెల రాజేందర్ మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్నదశలోనే కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కు కూడా మంత్రివర్గంలో స్థానం కల్పించడం చర్చకు దారి తీసింది. ఈటెల ప్రాధాన్యాన్ని తగ్గించడానికే గంగులకు స్థానం కల్పించారనే ప్రచారం జరిగింది. దీంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మంత్రుల సంఖ్య నాలుగుకు చేరింది. కరీంనగర్ జిల్లాలో బీసీ వర్గానికి చెందిన ఈటెల రాజేందర్ ఉండగానే, అదే వర్గానికి చెందిన గంగుల కమలాకర్ కు స్థానం కల్పించారు. సిరిసిల్ల నుంచి కేటీఆర్, జగిత్యాల నుంచి కొప్పుల ఈశ్వర్ కూడా మంత్రులుగా ఉన్నారు. గత మంత్రివర్గ విస్తరణంలో ఈటెలను తొలగించలేని పరిస్థితుల్లో ఆయన ప్రాధాన్యతను తగ్గించడానికే గంగులకు స్థానం కల్పించారనే వ్యాఖ్యలు కూడా ఉన్నాయి.

ఈ నేపథ్యంలోనే ఈటెల రాజేందర్ పార్టీ మారతారనే వార్తలు తాజాగా ప్రచారంలోకి వచ్చాయి. వాస్తవానికి ఇప్పటికిప్పడు పార్టీ మారే పరిణామాలుగాని, పరిస్థితులుగాని ప్రస్తుతానికి ఈటెలకు ఏమీ లేకపోయినా ఈ వార్తలు రాజకీయ కలకలానికి కారణమయ్యాయి. ఈ అంశంపై మంత్రి ఈటెల స్వయంగా వివరణ ఇవ్వడం గమనార్హం. తాను పార్టీ మారుతాననని జరుగుతున్న ప్రచారం గాలి వార్తలుగా ఆయన కొట్టిపారేశారు. తాను పార్టీ మారేది లేదని కూడా స్పష్టం చేశారు. బీజేపీలోకి వస్తున్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారనే ప్రశ్నపై ఆయన స్పందిస్తూ, చెప్పేవాళ్లు ఎన్నయినా చెబుతారని, తాను కమ్యూనిస్టుగా పెరిగానని, అదే భావజాలంతో ఉన్నానని ఈటెల పేర్కొన్నారు. అయితే తెలంగాణాలో తాజాగా రాజకీయ పరిణామాలు ఏమీ లేకపోయినా, ఈటెల పార్టీ మారతారని బీజేపీ నేతలు ఎదుకు చెబుతున్నారన్నదే అసలు ప్రశ్న. కమ్యూనిస్టుగా పెరిగానని, అదే భావజాలంతో ఉన్నానని ఈటెల ప్రకటించడంపైనా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈటెల ఇప్పడు రాజకీయ నిర్ణయం తీసుకునే పరిస్థితులు కూడా ఏమీ లేవన్నది పలువురి వాదన. కాకపోతే ఆయన పరిస్థితి ‘నియోజకవర్గ మంత్రి’గా మారిందట. మంత్రిగా ఆయన పర్యటన తీరు…అయితే హుజురాబాద్…లేదంటే హైదరాబాద్ మాత్రమేనట.

Comments are closed.

Exit mobile version