పాలేరు రిజర్వాయర్ దిగువన గల నాగార్జున సాగర్ ఎడమ కాల్వ మరమ్మత్తులు ఎట్టకేలకు పూర్తయ్యాయి. విపక్ష పార్టీ తీవ్ర విమర్శలు, మంత్రులు తుమ్మల, పొంగులేటిల ఆగ్రహం నేపథ్యంలో అధికారులు ఎట్టకేలకు కాల్వ మరమ్మత్తులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశారు. మంగళవారం ఉదయమే మరమ్మత్తులను పూర్తి చేసిన అధికారులు కొద్దిసేపటి క్రితమే కాలువ ద్వారా 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.
భారీ వర్షాలు, వరదల కారణంగా ఈనెల 1వ తేదీన పాలేరు దిగువన గల సాగర్ ఎడమ కాల్వకు గండి పడిన సంగతి తెలిసిందే. గడచిన 22 రోజులుగా సాగుతున్న కాల్వ మరమ్మతులపై ప్రభుత్వం విమర్శలను ఎదుర్కుంది. ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులుండీ ఓ కాల్వ గండిని పూడ్చలేకపోతున్నారని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు నిన్న తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
ఈ నేపథ్యంలోనే మంత్రి తుమ్మల నిన్న కాల్వను సందర్శించి ఇంజనీరింగ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారంకల్లా మరమ్మతులు పూర్తి చేసి నీటిని విడుదల చేయాలని ఆదేశించారు. ఆ తర్వాత గత రాత్రి రాత్రి మరో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా పాలేరుకు వెళ్లారు. కాల్వ మరమ్మతులను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. ఎట్టకేలకు అధికారులు కాల్వ మరమ్మతులను పూర్తి చేసి నీటిని విడుదల చేశారు. గంట గంటకూ నీటి ప్రవాహాన్ని పెంచుతామని అధికార వర్గాలు చెబుతున్నాయి.