జర్నలిస్టుల ఆందోళనకు మావోయిస్టు పార్టీ నక్సలైట్లు మెట్టు దిగారు. ఇరువర్గాల మధ్య ఏర్పడిన వివాదాన్ని కూర్చుని మాట్లాడుకుందామని శాంతించారు. ఈమేరకు మావోయిస్టు పార్టీ సౌత్ సబ్ జోనల్ బ్యూరో కమిటీ ఓ ప్రకటన విడుదల చేసింది. ఛత్తీస్ గఢ్ లోని బీజాపూర్ జిల్లాకు చెందిన ఐదుగురు విలేకరులకు హెచ్చరిస్తూ మావోయిస్టు పార్టీ ఇటీవల ఓ లేఖ విడుదల చేసిన సంగతి తెలిసిందే. నక్సల్స్ బెదిరింపులను నిరసిస్తూ స్థానిక జర్నలిస్టులు ఆందోళనకు దిగారు. ఇందులో భాగంగానే మావోయిస్టుల చర్యను ఖండిస్తూ బైక్ ర్యాలీలు, ధర్నాలు, సభలు, సమావేశాల వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. దీంతో మావోయిస్టు పార్టీ ఓ మెట్టు దిగింది.
ఇదీ చదవండి: ‘బస్తర్ మీడియా’కు నక్సల్స్ ధమ్కీ!
తమకు వ్యతిరేకంగా ప్రజలను సమీకరించి చేస్తున్న ఆందోళలను, ర్యాలీలను, సమావేశాల వంటి అన్ని కార్యక్రమాలను నిలిపివేయాల్సిందిగా మావోయిస్టు పార్టీ బీజాపూర్ జర్నలిస్టులను అభ్యర్థించింది. ఇరు వర్గాల మధ్య ఏ సమస్య తలెత్తినా కలిసి చర్చించడం ద్వారా సమస్యను పరిష్కరించుకుందామని సూచించింది. ‘బస్తర్ ప్రాంత విలేకరులకు లాల్ సలామ్’ పేరుతో ఆ పార్టీ జారీ చేసిన ప్రకటనను దిగువన చూడవచ్చు.