మావోయిస్టు పార్టీపై కరోనా పంజా విసురుతోందా? ఆ పార్టీ అగ్రనేతలతోపాటు కేడర్ కూడా కరోనా మహమ్మారి కోరల్లో చిక్కుకుందా? సిల్గేర్ పోలీస్ క్యాంపునకు వ్యతిరేకంగా సాగుతున్న ఆందోళనా పర్వపు ఘటన ఇందుకు కారణమైందా? ఈ విషయంలో ఛత్తీస్ గఢ్ లోని పోలీసు అధికారులతో పాటు తెలంగాణాలోని భద్రాద్రి కొత్తగూడెం తదితర జిల్లాల ఎస్పీలు ఇప్పటికే పలు ప్రకటనలు చేసిన సంగతి తెలిసిందే. ఇదే దశలో వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి బుధవారం సంచలన ప్రకటన చేశారు. డజన్ మంది నక్సల్ నేతలు కరోనా బారిన పడ్డారని, వారు చికిత్స చేసుకునేందుకు పార్టీ నాయకత్వం అనుమతించడం లేదని ఆయన ప్రకటించారు. కరోనా బారిన పడి మెరుగైన చికిత్స కోసం హన్మకొండకు వస్తున్న మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్ జోన్ డివిజనల్ కమిటీ కార్యదర్శి గడ్డం మధుకర్ అలియాస్ మోహన్ అలియాస్ శోబ్రాయ్ తోపాటు ఓ మైనర్ కొరియర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి నక్సల్ నేతల ఆరోగ్యానికి సంబంధించి కీలక వివరాలు వెల్లడించారు.

ఈ విలేకరుల సమావేశంలో పోలీసు కమిషనర్ తరుణ్ జోషి మాట్లాడుతూ, కోవిడ్-19తో భాధపడుతూ మెరుగైన చికిత్స కోసం వచ్చి పోలీసులకు చిక్కిన మావోయిస్టు నేత గడ్డం మధుకర్ ఇచ్చిన సమాచారం మేరకు మావోయిస్టు పార్టీ కి చెందిన సూమారు 12 మంది కీలక నాయకులతో పాటు పార్టీ సభ్యులు కరోనాతో బాధపడుతున్నారని చెప్పారు. ఇందులో కటకం సుదర్శన్ ఆలియాస్ ఆనంద్, తిప్పరి తిరుతి ఆలియాస్ దేవుజీ, యాప నారాయణ ఆలియాస్ హరిబూషణ్, బడే చొక్కారావు ఆలియాస్ దామోదర్, కటకం రాజిరెడ్డి ఆలియాస్ ధర్మన్న, కట్టా రాంచందర్ రెడ్డి ఆలియాస్ వికల్స్, ములా దేవేందర్ రెడ్డి ఆలియాస్ మాస దడ, కుంకటి వెంకటయ్య ఆలియాస్ వికాస్, ముచ్చకి ఉజల్ ఆలియాస్ రఘు, కొడి మంజుల ఆలియాస్ నిర్మల, పూసం పద్మ, కాకర్ల సునీత ఆలియాస్ బుర్రా ఉన్నట్లు వివరించారు. అయితే కోవిడ్ వ్యాధికి చికిత్స చేసుకోనేందుకు మావోయిస్టు పార్టీ ఆయా నాయకులను అనుమతించడం లేదని, ఆరోగ్యం తీవ్రంగా క్షీణించినప్పుడు మాత్రమే కరోనా బారినపడినవారిని మెరుగైన చికిత్స పొందేందుకు పార్టీ అనుమతి ఇస్తోందన్నారు.

గత పదిరోజుల క్రితం బీజాపూర్ సిల్గేర్ గ్రామం వద్ద కొత్తగా ఏర్పాటు చేస్తున్న పోలీస్ క్యాంపును వ్యతిరేకిస్తూ ఛత్తీస్ ఘట్, తెలంగాణ రాష్ట్ర సరిహద్దు గ్రామాలకు చెందిన ప్రజలతో మావోయిస్టులు నిర్వహించిన నిరసన కార్యక్రమాల సమయంలో కోవిడ్ లక్షణాలు గల ప్రజలను మావోయిస్టు నాయకులు, సభ్యులు కలవడం ద్వారా వీరికి వైరస్ సక్రమించిందన్నారు. అదేవిధంగా దామోదర్ కు గార్డుగా వ్యవహరిస్తున్న మవోయిస్టు సభ్యుడు కోవిడ్ కు గురై చికిత్స కోసం మావోయిస్టు పార్టీ క్యాంపు నుండి తప్పించుకోని పారిపోతుండగా మిలిషియా సభ్యులకు పట్టుబడ్డాడని, అనంతరం సదరు మావోయిస్టుకు కోవిడ్ వ్యాధికి చికిత్స చేసుకోనేందుకు పార్టీ అనుమతి ఇవ్వలేదని పోలీస్ కమిషనర్ తెలిపారు. మావోయిస్టు పార్టీ కార్యకర్తల ప్రాథమిక, మానవ హక్కులను కాలరాస్తోందని. పార్టీ కార్యకర్తలు అనారోగ్యంతో బాధపడుతూ మెరుగైన చికిత్స పొందేందుకు కూడా బయటకి వెళ్లడానికి కూడా పార్టీ అనుమతి ఇవ్వకుండా అమానవీయంగా వ్యవరిస్తూన్నట్లుగా ఆయా సంఘటనల ద్వారా తెలుస్తోందన్నారు. కరోనా లేదా ఇతర వ్యాధులతో భాదపడుతున్న మావోయిస్టు నాయకులుగాని, కార్యకర్తలుగాని స్వేచ్ఛగా బయటకు వస్తే వారికి రాష్ట్ర ప్రభుత్వం తరుపున మెరుగైన చికిత్స అందించనున్నట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి విజ్ఞప్తి చేశారు.

ఫొటో: మీడియా సమావేశంలో మాట్లాడుతున్న వరంగల్ సీపీ తరుణ్ జోషి

Comments are closed.

Exit mobile version