తెలంగాణా మీడియా అకాడమీ చైర్మెన్ అల్లం నారాయణకు అత్యంత సన్నిహితుడు, టీయూడబ్ల్యూజే (టీజేఎఫ్) ఖమ్మం జిల్లా అధ్యక్షుడు ఆకుతోట ఆదినారాయణపై వరుసగా పోలీసు కేసులు నమోదవుతున్నాయి. ఒకటి కాదు రెండు కాదు గత కొంత కాలంగా దాదాపు ఆరు కేసులను పోలీసులు ఆదినారాయణపై నమోదు చేసినట్లు తాజా సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. అయితే అధికారికంగా ఈ కేసుల వివరాలను పోలీసులు ఏ సందర్భంలోనూ మీడియాకు వెల్లడించిన దాఖలాలు లేవు. దాడులకు దిగడం, బెదిరింపులకు పాల్పడడం వంటి అభియోగాలపైనే కాదు, రాజద్రోహానికి పాల్పడినట్లు ఇతనిపై పోలీసులు కేసులు నమోదు చేయడం గమనార్హం.

ఖమ్మం జిల్లా టీయూడబ్ల్యూజే (టీజేఎఫ్) జిల్లా అధ్యక్షునిగా పనిచేస్తున్న ఆకుతోట ఆదినారాయణ జర్నలిస్టు సర్కిళ్లలో సుపరిచితుడే. ముఖ్యంగా మీడియా అకాడమీ చైర్మెన్ అల్లం నారాయణకు అత్యంత సన్నిహితునిగా ప్రాచుర్యం పొందాడు. అధికార పార్టీకి అనుబంధ సంఘంగా వార్తల్లో గల టీయూడబ్ల్యూజే (టీజేఎఫ్) ఖమ్మం జిల్లా అధ్యక్షునిగా పనిచేస్తున్న ఆదినారాయణపై వరుసగా పోలీసు కేసులు నమోదవుతన్న తీరు సహజంగానే పాత్రికేయ వర్గాల్లో చర్చకు దారి తీసింది.

గడచిన కొద్ది సంవత్సరాలుగా ఆయన అనేక కేసుల్లో నిందితునిగా పోలీసు రికార్డుల్లోకి ఎక్కాడు. ఆదినారాయణపై దాదాపు ఆరు పోలీసు కేసులు ఉన్నట్లు అనధికార సమాచారాన్ని బట్టి తెలుస్తుండగా, అందుబాటులో ఉన్న అధికారిక సమాచారం ప్రకారం మాత్రం మూడు కేసుల వివరాలు మాత్రమే లభ్యమయ్యాయి. వాటి వివరాల్లోకి వెడితే…

ఖమ్మం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో క్రైం నెం. 117/2015 ద్వారా ఐపీసీ 324 రెడ్ విత్ 34 సెక్షన్ కింద కేసు నమోదైంది. అనంతర పరిణామాల్లో ఈ కేసు కాంప్రమైజ్ అయ్యింది. అదేవిధంగా క్రైం నెం. 210/2016 ద్వారా ఖమ్మం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఐపీసీ 384 సెక్షన్ కింద మరో కేసు నమోదైంది. ఇదే పోలీస్ స్టేషన్ లో క్రైం నెం. 65/2021 ద్వారా ఐపీసీ 290, 505(1) (b) (c), 505 (2), 120 (b) సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఇవిగాక మరో రెండు, మూడు కేసుల్లో కూడా ఆదినారాయణపై పోలీసులకు ఫిర్యాదులు అందగా, కేసులు నమోదైనట్లు తెలుస్తున్న సమాచారం అధికారికంగా ధ్రువపడలేదు. ఆయా మొత్తం కేసుల్లో ఏ ఒక్క ఘటనలోనూ ఆదినారాయణను పోలీసులు ఇప్పటి వరకు అరెస్ట్ చేసిన దాఖలాలు లేకపోవడం కొసమెరుపు. అయితే కొన్ని కేసులకు సంబంధించి ఆదినారాయణ హైకోర్టును ఆశ్రయించినట్లు సమాచారం.

Comments are closed.

Exit mobile version