‘‘అభివృద్ధికి ఉపయోగపడే, రైతులకు రెండు పంటలకు నీళ్లు ఇచ్చేటువంటి ఈ ప్రాజెక్టులను మీరు చెబితే.., మేం ఆపకుంటే చేసేదేంది…? అని అడుగుతున్నం మేం. చేసేదేంది.., పీకేదేంది… రైతులది పట్టుకుని… ఇవ్వాళ రైతులందరూ అరిగోస పడుతున్నరు. మిల్ట్రీని ఏమన్న వరంగల్ పట్టుకొస్తవా? మిల్ట్రీని ఏమైన పాకాల కట్టకమీదకు తీసుకొస్తవా? మిల్ట్రీని ఏమైన దేవాదుల ప్రాజెక్టుకాడికి తీసుకొస్తవా? ఇది ప్రజాస్వామ్యం… నువ్వెవడికి మా ప్రాజెక్టులను ఆపాలని లేఖ పంపడానికి…? నువ్వెవడివి? ఒక దాడికి వెయ్యి దాడులు జేస్తం…’’
వ్యాఖ్యలు కాస్త పరుషంగానే ఉన్నాయ్ కదా! ఎలా ఉన్నప్పటికీ, ఓ నాయకుడు చేసిన వ్యాఖ్యల తీవ్రతను చెప్పేముందు ఆయన వాడిన పదప్రయోగాన్ని ఉన్నది ఉన్నట్లుగానే చెప్పాలి తప్పదు. ఇంతకీ ఈ పదునైన పదాలను ప్రత్యర్థులపై వాడింది ఎవరో తెలుసా? వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలు తీసుకువస్తోందని, ప్రాజెక్టులను అడ్డుకుంటోందని, కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు రాకుండా కుట్ర చేస్తోందని వరంగల్ రూరల్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ఈ మధ్య ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. దాదాపు వారం రోజులపాటు వీరావేశం ప్రదర్శించారు. అందులో భాగంగానే ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి చేసిన ఆయా కామెంట్స్.
సరే, ఉత్తుత్తినే కామెంట్లు చేస్తే సరిపోదు కదా? కేంద్రం తీరుపై తమ పవర్ కూడా చూపాలనుకున్నారేమో? ఇంకేముంది నిన్న, అనగా 29వ తేదీన వరంగల్ రూరల్ జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నాకు సిద్ధమయ్యారు. టీఆర్ఎస్ పార్టీకి చెందిన నర్సంపేట, పరకాల, వర్ధన్నపేట ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, ఆరూరి రమేష్ ల వీరావేశానికి కాంగ్రెస్ తరపున గెలిచి అధికార పార్టీలోకి దూకిన భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి కూడా శ్రుతి కలిపారట. వారం రోజులుగా ఆయా ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాల్లో మీటింగులు పెట్టి మరీ కేంద్రం తీరుపై అగ్గిలం మీద గుగ్గిలమయ్యారట. జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించేందుకు భారీ ఎత్తున టెంట్లు, షామియానాలు ఏర్పాటు చేశారు. అధికార పార్టీ ఎమ్మెల్యే ధర్నా కార్యక్రమమమంటే పోలీసులు కూడా కాస్త సహకరించాలి కదా? అందుకే ట్రాఫిక్ ను కూడా దారి మళ్లించారు.
ఈ రసవత్తర కార్యక్రమాన్ని కవర్ చేసేందుకు మన మీడియా మిత్రులు పోలోమంటూ కలెక్టరేట్ కు వెళ్లి, అక్కడ కనిపించిన దృశ్యాన్ని చూసి అవాక్కయ్యారట. ఎందుకంటే ధర్నాలేదు, గిర్నా లేదు, ఎక్కడి ఎమ్మెల్యేలు అక్కడే గప్ చుప్.. అని వర్తమానం అందేసరికి అసలేం జరిగిందనే అంశంపై విలేకరులు ఆరా తీశారు. వాస్తవానికి ఈ ధర్నా వంటి ప్రోగ్రామ్ పెట్టొద్దని మంత్రి దయాకర్ రావు మొదటి నుంచీ మొత్తుకుంటూనే ఉన్నారట. అయినప్పటికీ ఎమ్మెల్యేలు వినిపించుకోలేదట. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వరంగల్ ఎమ్మెల్యేలు ధర్నాకు తెగించారనే వార్త ఎట్టకేలకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చెవిన పడడంతో వాళ్లు సీరియస్ అయినట్లు తాజా వార్తల సారాంశం. దీంతో కిమ్మనకుండా ఎమ్మెల్యులు తమ ధర్నా ప్రోగ్రమ్ కు దండం పెట్టి, రాత్రి వేసిన టెంట్లను తెల్లారేసరికల్లా పీకేసి, సంక్రాంతి తర్వాత తమ కార్యచరణ ప్రకటిస్తామని చెప్పారట.
‘ఎమ్మెల్యేలు అన్నాక కాస్త వర్తమాన తాజా రాజకీయ పరిణామాలను పరికిస్తూ ఉండాలి. పెద్దసారు వేస్తున్న అడుగు, జాడలను అనునిత్యం కనిపెట్టుకుంటూ ఉండాలి. ఆయన అడుగులో అడుగేస్తూ రాజకీయ పావులు కదుపుతూ ఉండాలి. ఇందుకు విరుద్దంగా వ్యవహరించి దూకుడుగా ‘ధర్నా’కు దిగితే ఏమవుతుందో నాటిన వెదురుబొంగులను, వేసిన టెంట్లను పీకేసిన సీన్ చెప్పడం లేదూ?’’ అని ఈ ఘటనపై రాజకీయ పరిశీలకులు వెటకరిస్తున్నారు. అదీ సంగతి.