కాకతీయ త్రి నగరం జలదిగ్భంధంలో చిక్కుకుంది. గడచిన మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వరంగల్ మహానగరం జలమయంగా మారింది. అటు వరంగల్, ఇటు హన్మకొండతోపాటు కాజీపేట పట్టణంలోని పలు కాలనీలు వరద నీటిలో చిక్కుకున్నాయి.
వరంగల్ పట్టణంలోని కాశీబుగ్గ, ఎస్ఆర్ నగర్, వివేకానంద కాలనీ, సాయిగణేష్ కాలనీ, లక్మీగణపతి కాలనీ, ఎంపీఆర్ నగర్, ఏనుమాల కాలనీలు జలమయమయ్యాయి. సంతోష్ మాత కాలనీ, రామన్నపేట, పోతనరోడ్డు, సమ్మయ్యనగర్, అమరావతి కాలనీ, నవయుగ కాలనీ, కొత్తవాడ, పోచమ్మకుంట, శివనగర్ తదితర ప్రాంతాలు నీట మునగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు.
వరంగల్, హన్మకొండ పట్టణాల్లో గడచిన 24 గంటల్లో 22.3 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో వడ్డేపల్లి, భద్రకాళి చెరువుల్లో నీరు మత్తడి దూకుతోంది. నాలాలు పొంగి, పొర్లుతుండడంతో వరంగల్ మహానగరం విలవిలలాడుతోంది. జలమయంగా మారిన వరంగల్ త్రినగరిలోని పలు ప్రాంతాల చిత్రాలను, హన్మకొండ నయాంనగర్ ప్రాంత వీడియోను ఇక్కడ చూడవచ్చు.