వరంగల్ మహానగరం చుట్టూ రింగురోడ్డు… ఆ రింగురోడ్డుకు సమీపంలోని రైతుల భూముల ‘ల్యాండ్ పూలింగ్’ అంశం ఇప్పుడు రగులుతున్న సమస్య. రాష్ట్ర వ్యాప్తంగా కలకలానికి దారి తీసిన ఉదంతం. రైతుల ప్రతిఘటన ఆగ్రహానికి వెనక్కి తగ్గి ప్రస్తుతానికి ల్యాండ్ పూలింగ్ ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారుల ప్రకటన. కానీ ల్యాండ్ పూలింగ్ కోసం తీసుకువచ్చిన జీవో 80/ఎ పూర్తిగా రద్దు చేయాల్సిందేనని రైతుల డిమాండ్. రైతుల భూములను ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించి తద్వారా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేందుకు కాకతీయ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ తీసుకున్న నిర్ణయానికి కర్షకుల నుంచి గట్టి షాక్ తగిలిందనే చెప్పాలి.
హనుమకొండ, వరంగల్, జనగామ జిల్లాలకు చెందిన రైతులు అలుపెరుగని పోరాటం చేయడంతో అధికారులతోపాటు ఎమ్మెల్యేలు కూడా వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఆయా జిల్లాల్లోని 27 గ్రామాల పరిధిలో గ ల 21 వేల 510 ఎకరాల భూ సమీకరణ యత్నాన్ని రైతుల ఆగ్రహ జ్వాలలు తాత్కాలికంగా నిలువరించాయి.
అయితే ఈ మొత్తం వ్యవహారంలో రైతులు సూటిగా సంధిస్తున్న తాజా ప్రశ్న ఇప్పుడు పెనుదుమారం రేపుతోంది. నోటిఫికేషన్ జారీ చేసిన తమ భూముల చెంతనే అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేల, ఇతర నాయకుల భూములు కూడా ఉన్నాయని, వాటిని ల్యాండ్ పూలింగ్ ద్వారా ఎందుకు సేకరించడం లేదని రైతులు నేరుగానే ప్రశ్నిస్తున్నారు. రైతుల భూములతో రియల్ వ్యాపారానికి దిగుతున్న ‘కుడా’కు టీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల, నేతల భూముల ఎందుకు కనిపించడం లేదనేది రైతుల కీలక ప్రశ్న.
ఇదే దశలో మరికొన్ని సంచలన అంశాలు ప్రాచుర్యంలోకి వచ్చాయి. వరంగల్ రింగు రోడ్డు చుట్టూ రెవెన్యూ శాఖకు చెందిన అధికారులు కొందరు ఇటీవల పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేశారా? ముఖ్యంగా హసన్ పర్తి, ధర్మసాగర్, స్టేషన్ ఘన్ పూర్, ఐనవోలు, దామెర, ఆత్మకూరు తదితర మండలాల్లో రింగు రోడ్డు సమీపంలో రెవెన్యూ అధికారులెవరైనా ‘ముందస్తు’ జాగ్రత్తగా భూములు కొనుగోలు చేశారా?
రెవెన్యూ అధికారులు కొందరు తమ కుటుంబ సభ్యుల పేర్లతో కొనుగోలు చేసిన భూములకు అదే శాఖకు చెందిన వీఆర్ఏలు దగ్గరుండి మరీ ఫెన్సింగులు వేయించారా? రెవెన్యూ అధికారులు భూములు కొనుగోలు చేయడం తప్పు కాకపోవచ్చు. కానీ… అసైన్డ్ భూములను, రైతులకు చెందిన భూములను ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించి పట్టణాభివృద్ధి సంస్థల ద్వారా ప్రభుత్వం చేస్తున్న రియల్ వ్యాపారం, ఆ తర్వాత సమీప భూములకు పెరిగే విలువను ముందు అంచనా వేసి అధికారులు భూముులు కొనుగోలు చేశారా?
ఉమ్మడి వరంగల్ మహానగర రింగు రోడ్డు చుట్టూ భూసేకరణ అంశంలో కీలక పాత్ర పోషిస్తున్న ఓ ముఖ్య రెవెన్యూ అధికారి హసన్ పర్తి మండల కేంద్రం వద్ద ఇటీవల ఏదేని భూమిని కొనుగోలు చేశారా? బినామీ పేరుపై ఆయా అధికారి ముందస్తుగా భూమిని కొనుగోలు చేసినట్లు ప్రచారంలోకి వచ్చిన ఘటన నిజమేనా? వరంగల్ మహానగరం చుట్టూ గల రింగురోడ్డు సమీపంలోనే కొందరు రెవెన్యూ అధికారులు ఇటీవల భారీ స్థాయిలో భూములు కొనుగోలు చేశారనే ప్రచారం ఎందుకు జరుగుతోంది? ఇదే నిజమైతే అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేల, ప్రజాప్రతినిధుల, ఇతర నేతల భూములనే కాదు రెవెన్యూ అధికారులు బినామీ పేర్లపై రింగురోడ్డు సమీపంలో కొనుగోలు చేసిన భూములను కూడా ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరిస్తారా? కొందరు రెవెన్యూ అధికారుల భూముల కొనుగోలు ప్రచారంలో నిజానిజాల నిగ్గు తేల్చడానికి ఏసీబీ విభాగంతో వరంగల్, హనుమకొండ జిల్లాల కలెక్టర్లు విచారణ జరిపించగలరా? ఇవీ రైతు వర్గాలు సంధిస్తున్న తాజా ప్రశ్నలు.