వరంగల్ అర్బన్, రూరల్ జిల్లాల ఏర్పాటే అహేతుకమైనది. తెలంగాణలో ఏ origin జిల్లా కూడా ఇలా పేరు మార్పునకు, కుంచించుకుపోవడానికి గురికాలేదు. వరంగల్ అర్బన్ జిల్లా అనే పేరు వల్ల పూర్వ వరంగల్ తన గంభీరతను, ప్రాభవాన్ని కోల్పోయి చిన్నబోయినట్టుగా కనిపించింది.
వాస్తవానికి సీఎం కేసీఆర్ 2016లో తెలంగాణలో జిల్లాల పునర్విభజన సమయంలోనే వరంగల్, హన్మకొండ జిల్లాల ఏర్పాటు ప్రస్తావన తీసుకువచ్చారు. కానీ వరంగల్ నగరం చారిత్రక, వారసత్వ సంపదకు అవిభాజ్యమైన ప్రతీక అని, దానిని విడగొట్టవద్దని చిన్నపాటి ఉద్యమాలే మొదలయ్యాయి. అప్పటి పరిస్థితుల ఆధారంగా వరంగల్, హన్మకొండ జిల్లాలకు బదులు, వరంగల్ అర్బన్, రూరల్ జిల్లాలను ఏర్పాటుచేశారు.
రాష్ట్రంలో వరంగల్ రూరల్ జిల్లా ఒక విఫల ప్రయోగంగా నిలిచింది. గత నాలుగున్నరేళ్లుగా జిల్లా కేంద్రం లేని ఏకైక జిల్లాగా గుర్తింపు పొందింది. పరకాల, నర్సంపేట, వర్ధన్నపేట ఎమ్మెల్యేలు… రూరల్ జిల్లా కేంద్రం తమ తమ నియోజకవర్గాల్లోకి రావాలని ఎవరికివారు పట్టుబట్టి, చివరకు ఎవరూ దానిని సాధించలేకపోయారు.
వరంగల్ అర్బన్ పరిధిలోని నగరంలోనే ‘వరంగల్ రూరల్ జిల్లా’ కార్యాలయాలు తాత్కాలికంగా ఏర్పాటయ్యాయి. అంటే ఒకరకంగా ఇన్నాళ్లూ అద్దెకొంపల్లో అరకొర వసతుల మధ్య సంసారాన్ని వెళ్లదీశాయి.
రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి నిర్ణయాలు తీసుకుంటే పాలన ఎంత అస్తవ్యస్తంగా ఉంటుందో చెప్పడానికి వరంగల్ రూరల్ జిల్లాయే నిదర్శనం.
వరంగల్, హన్మకొండ పట్టణాలు పక్క పక్కనే ఉన్నప్పటికీ, అభివృద్ధిపరంగా వరంగల్ ప్రాంతం చాలా వెనుకబడిపోయినట్టుగా కనిపిస్తుంది. అధికార కార్యాలయాలు, సంపన్నవర్గాలు హన్మకొండలోనే కేంద్రీకృతం అయ్యాయి. అభివృద్ధి అంతా హన్మకొండ కేంద్రంగానే సాగింది. ఉమ్మడి వరంగల్ జిల్లాకు పాలన కేంద్రం వరంగల్ అని పేరున్నప్పటికీ, పాలన అంతా హన్మకొండ కేంద్రంగానే సాగేది.
వరంగల్, హన్మకొండ జిల్లాలకు సంబంధించి హన్మకొండకు ఇప్పటికే కలెక్టరేట్ ఉండగా, origin జిల్లా అయిన వరంగల్‌కు కొత్తగా కలెక్టరేట్ కట్టవలసిన పరిస్థితి ఏర్పడింది. వరంగల్ నగరంలో జరిగిన అభివృద్ధిలోని డొల్లతనం మరోసారి స్పష్టమైంది.
చారిత్రక నగరిని రెండు ముక్కలు చేయవద్దని 2016లో ఆందోళనలు చేసిన వివిధ సంఘాల వారు ఇప్పుడు నోరు మెదపడం లేదు. కొత్త జిల్లాల వల్ల వచ్చేదీ, పోయేదీ ఏమీ లేదని వారు భావిస్తున్నట్టుంది.
వరంగల్ రూరల్ జిల్లా నాలుగేళ్ల గోస చూసిన తర్వాత, వరంగల్ అర్బన్, రూరల్ జిల్లాను ఏకం చేసి ‘వరంగల్ జిల్లా’ను ఏర్పాటు చేస్తే బాగుంటుందనేది అనేకమంది మనోగతం. కానీ 33 సెంటిమెంట్‌తో ఏలినవారు ఇప్పుడు మరో గొల్లెం పెట్టారు.
వరంగల్ రూరల్ జిల్లాను వరంగల్ పట్టణ కేంద్రంగా ‘వరంగల్ జిల్లా’గా మార్చడం వల్ల కొత్త కలెక్టరేట్ రావొచ్చేమో గానీ, ప్రాంతాభివృద్ధి మాత్రం ప్రజాప్రతినిధుల్లో చిత్తశుద్ధి ఉన్నప్పుడే సాధ్యమవుతుంది.
అభివృద్ధిపరంగా వరంగల్ కోటను వెయ్యి స్తంభాల గుడి డామినేట్ చేసేది. గోవిందరాజుల గుట్టను మెట్టుగుట్ట డామినేట్ చేసేది. పాతబస్తీలు, ఇరుకు గల్లీలు, మురికివాడలు వరంగల్ పట్టణ ఆస్తి అయితే, విశాల రహదారులు, కొత్తకాలనీలు, ఆధునిక సౌకర్యాలు హన్మకొండ సొత్తు. ఈ అసమతౌల్యం నూతన ‘వరంగల్ జిల్లా’తోనైనా మారుతుందేమో చూడాలి.
వరంగల్ నగరం రెండు ముక్కలు కావడం వల్ల కాకతీయుల చారిత్రక వారసత్వానికి వచ్చిన ముప్పేమీ లేదు. అయితే గియితే వాటిని రెండు జిల్లాల కలెక్టర్లు మరింతగా అభివృద్ధి చేసుకుంటారు. ఎఎస్ఐ వంటి సంస్థలు కేటాయించే నిధులకు జిల్లాల విభజన అడ్డంకేమీ కాకపోవచ్చు.
చారిత్రక పట్టణాలైన వరంగల్, హన్మకొండల పేర్లు తెలంగాణ యవనికపై జిల్లాలుగా మళ్లీ తళుక్కుమనబోతుండటం ఎంతో సంతృప్తి కలిగించే విషయం.
✍️ శంకర్ రావు శెంకేసి