కరోనా వైరస్ తెలంగాణాలోని అధికార పార్టీ ఎమ్మెల్యేలను తీవ్రంగా భయపెడుతోందని చెప్పే ప్రత్యక్ష ఉదాహరణ ఇది. కరోనా కట్టడి, అందుకు తీసుకోవలసిన జాగ్రత్తలు, అధికారికంగా చేపట్టవలసిన చర్యలను స్వయంగా పర్యవేక్షించి, తన నియోజకవర్గ ప్రజలకు ధైర్యం చెప్పాల్సిన ప్రజాప్రతినిధి పేరుతో సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసిన ఓ పోస్ట్ నెటిజన్లలో తీవ్ర చర్చకు దారి తీసింది.
ఆ మధ్య తెలంగాణా ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ కరోనా చికిత్స నిర్వహించే వార్డులోకి వెళ్లి పరిస్థితులను స్వయంగా పరిశీలించిన సంగతి తెలిసిందే. కరీంనగర్ జిల్లా కేంద్రంలో మంత్రి గంగుల కమలాకర్ వైరస్ విరుగుడుకు స్వయంగా మందులను స్ప్రే చేసిన విషయమూ విదితమే. ఇండోనేషియా వాసుల కారణంగా కరీంనగర్ అల్లకల్లోలంగా మారినప్పుడు మంత్రి గంగులతోపాటు నగర మేయర్ సునీల్ రావు తదితరులు ప్రత్యక్షంగా కంటైన్మెంట్ వార్డుల్లో సంచరించి ప్రజలకు ధైర్యం చెప్పారు.
కానీ తాజా పరిణామాల్లో ముగ్గురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కరోనా బారిన పడడంతో ఆ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు తీవ్రంగా కలవరపడుతున్నట్లు స్పష్టమవుతోంది. తనను ప్రత్యక్షంగా ఎవరూ కలవరాదని, ఫోన్ ద్వారా లేదంటే వాట్సాప్ ద్వారా సంప్రదించాలని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ పేరుతో చక్కర్లు కొడుతున్న సోషల్ మీడియా పోస్టుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దిగువన గల వాట్సాప్ పోస్టును చదవండి. విషయం మీకే బోధపడుతుంది.
UPDATE:
కాగా ts29.in వెబ్ సైట్ ప్రచురించిన వార్తా కథనానికి వరంగల్ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ వేగంగా స్పందించడం విశేషం. కరోనా వైరస్ తాజా పరిణామాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజాప్రతినిధులు సమష్టిగా తీసుకున్న నిర్ణయమే సోషల్ మీడియా పోస్టుగా ఆయన చెప్పారు. కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో తాను తిరుగుతున్న సందర్బంగా నాయకులు, కార్యకర్తలు గుమిగూడుతారనే ఉద్దేశంతో వారిని ఫోన్ ద్వారా వాట్సప్ ద్వారా మాట్లాడాలని పోస్ట్ చేసినట్లు చెప్పారు. ప్రజలను కలవనని తాను ఎక్కడా అనలేదనే విషయాన్ని పోస్టులో గమనించవచ్చన్నారు. లాక్ డౌన్ టైంలో తాను నిరంతరం ప్రజల్లో ఉన్నానని, ఎప్పటికప్పుడు కరోనా నివారణ చర్యలు పర్యవేక్షించానని చెప్పారు. ప్రజలకు నిత్యావసర సరుకులు అందజేశానని, తమ దగ్గరకు వచ్చే ప్రజలకు సమస్యలు పరిష్కరిస్తున్నట్లు ఎమ్మెల్యే నరేందర్ స్పష్టం చేశారు. నిన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జిల్లా ప్రజా ప్రతినిదుల సమావేశంలో కరోనా వ్యాప్తి దృష్యా ప్రజల క్షేమం కోసం ఏదైనా అత్యవసర సమస్య ఉంటే ఫోన్ ద్వారా సంప్రదించాలని ప్రెస్ నోట్ కూడా విడుదల చేసినట్లు ఆయన గుర్తు చేశారు. అందులో బాగంగా ఎక్కడా నాయకులు, కార్యకర్తలు గుమిగూడకూడదనే ఉద్దేశంతో చేసిన సూచన మాత్రమేనని పేర్కొన్నారు. లాక్ డౌన్ మొదలునుండి నేటి వరకు తాను ప్రజల్లోనే ఉన్నట్లు చెప్పారు.