కోడలు ఆత్మహత్య కేసులో వరంగల్ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కుటుంబ సభ్యులను నిర్దోషులుగా ప్రకటిస్తూ నాంపల్లి స్పెషల్ కోర్టు మంగళవారం తీర్పునిచ్చింది. దీంతో సిరిసిల్ల రాజయ్యకు భారీ ఊరట లభించినట్లయింది. దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన ఈ కేసులో సిరిసిల్ల రాజయ్యతో పాటు ఆయన కుటుంబసభ్యలపైనా పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.
హన్మకొండలో 2015 నవంబర్ 4న సిరిసిల్ల రాజయ్య ఇంట్లో ఆయన కోడలు సారిక (35), మనవళ్లు అభినవ్(7), ఆయాన్ (3), శ్రీయాన్ (3) అనుమానాస్పద స్థితిలో మంటల్లో సజీవ దహనమయ్యారు. ఈ ఘటనపై పోలీసులు అనుమానాస్పద మరణాలుగా కేసు నమోదు చేశారు. మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య దంపతులతో పాటు సారిక భర్త అనిల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ కేసులో ప్రధాన నిందితునిగా సారిక భర్త అనిల్, రెండో నిందితునిగా మాజీ ఎంపీ రాజయ్య, మూడో నిందితురాలిగా రాజయ్య భార్య మాధవిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వరంగల్ మహానగరంలో తీవ్ర ఉద్రికత్తకు దారి తీసిన ఈ ఘటనలో రాజయ్య కుటుంబమే వారిని హత్య చేసి ఉంటుందని భావించారు.
ఘటన జరిగిన ఇంటి ముందు పెద్ద ఎత్తున ప్రజలు ఆందోళనకు కూడా దిగారు. అనంతర పరిణామాల్లో కాంగ్రెస్ పార్టీ రాజయ్యను సస్పెండ్ చేసింది. ఈ కేసులో సరైన ఆధారాలు పోలీసులు సమర్పించకపోవడంతో వరంగల్ జిల్లా న్యాయస్థానం రాజయ్య కుటుంబాన్ని నిర్దోషులుగా ప్రకటిస్తూ మంగళవారం కేసు కొట్టేసింది.