చదివారా? ఇంటర్నేషనల్ వెబ్ సైట్ల కథనాలట!!
జీహెచ్ఎంసీ ఎన్నికల సంగతేమోగాని, వాట్పప్ యూనివర్సిటీలు మాత్రం తమ సత్తాను ప్రదర్శిస్తున్నాయ్. అటు బీజేపీ, ఇటు టీఆర్ఎస్ పార్టీలకు చెందిన సోషల్ మీడియా వింగ్ లు తమ ప్రతిభను విశ్వరూపం స్థాయిలో ప్రదర్శిస్తున్నాయి. ఎక్కువ ఉపోద్ఘాతంలోకి వెళ్లకుండా నేరుగా విషయంలోకి వెడితే… జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గత నెల 28న తెలంగాణా సీఎం కేసీఆర్ ఎల్బీ స్టేడియంలో ప్రసంగించిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల సభలో కేసీఆర్ స్పీచ్ తన సహజ శైలికి భిన్నంగా ఉందనే ప్రచారం జరిగింది. ఇదిగో… ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియా పోస్ట్ ఒకటి తెగ చక్కర్లు కొడుతోంది. బీజేపీ వేసిన స్కెచ్ తో కేసీఆర్ గజగజ వణికిపోయారని, వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణాను బీజేపి వదిలేస్తానని ‘రాయబేరం’ చేసుకున్నారని, అందువల్లే కేంద్ర హోం మంత్రి ఈనెల 29న హైదరాబాద్ రోడ్ షో సందర్భంగా చేయాల్సిన స్పీచ్ సర్వం మారిపోయిందనేది ఆయా పోస్ట్ సారాంశం.
ఇంత జరిగాక టీఆర్ఎస్ సోషల్ మీడియా సైనికులు ఊర్కుంటారా మరి? అసలు కేసీఆర్ సార్ వేసిన స్కెచ్ తో హోం మంత్రి అమిత్ షా హైదరాబాద్ నుంచి తోక ముడిచారని, ప్రధాని మోదీ నోరు కిక్కురుమనడం లేదని, కేసీఆర్ సార్ ఇచ్చిన వార్నింగ్ కు బీజేపీ అగ్రనేతల వెన్నులో వణుకు పుట్టి, జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్ అడుగిడకుండా ఒప్పించే వ్యూహరచన చేస్తున్నారనేది టీఆర్ఎస్ శ్రేణులు సోషల్ మీడియాలో వదిలిన కౌంటర్ పోస్ట్ సారాంశం. ఆసక్తికర అంశమేమిటంటే… ఈ రెండు పోస్టులను కూడా అవేవో ప్రముఖ ఇంటర్నేషనల్ వెబ్ సైట్లు ప్రచురించిన వార్తా కథనాలుగా ప్రస్తావించడం. ఆ వెబ్ సైట్ల ఊరూ, పేరూ ఏదీ లేకుండా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న రెండు కథనాలను ఉన్నది ఉన్నట్లుగానే దిగువన మీరూ ఓ లుక్కేయండి కాసేపు. సీరియస్ గా కాదు సుమీ… సరదాగా మాత్రమే చదవండి!
గత రెండు రోజులుగా ఢీల్లి వేదికగా అనూహ్య పరిణామాలు…
ప్రముఖ ఇంటర్నేషనల్ వెబ్సైట్ లో సంచలన కథనం..
కె.సి.ఆర్ కాళ్ళ బేరం
ఢీల్లిలో రెడీ అయిన అమిత్ షా స్పీచ్ హైదరాబాద్ చేరుకునేలోగా మారిపోవడానికి కారణాలు ఏంటి…
ఒక ప్రముఖ రియలేస్టేట్ వ్యాపారవేత్త, మరో ప్రముఖ కాంట్రాక్టర్, ఒక కేంద్ర సహాయ మంత్రి, స్వామీజీ నడిపిన రాయబారం ఏంటి….
2వ తేదీన హైదరాబాద్ లోని కొందరు ప్రముఖ రాజకీయ నాయకుల మీద దాడులకు రెడీ అయ్యిన కేంద్ర సంస్థను కొన్ని రోజులు ఆగమని చెప్పింది అందుకేనా…
అమిత్ షా స్పీచ్ విని షాక్ అయిన బండి సంజయ్ కి క్లారిటీ ఇచ్చిన ఉత్తరాది బీజేపీ నేత..
కేసీఆర్ కాళేశ్వరం అవినీతి, మై హోమ్ రామేశ్వర్ అవినీతి, కేసీఆర్ కుటుంబ అవినీతిపై నా దగ్గర పూర్తి సాక్ష్యాలు ఉన్నాయి, త్వరలోనే సీబీఐ విచారణ జరగబోతుంది. కేసీఆర్ కుటుంబం తెలంగాణలో దోచుకుంది కక్కిస్తా… తెలంగాణ నయా నిజాం ఊచలు లెక్కించాల్సిందే… ఇది అమిత్ షా ఢీల్లీలో రెడీ చేసుకున్న స్పీచ్. అన్ని పార్టీల్లో ఉన్నట్లే బీజేపీ లో ఉన్న కేసీఆర్ కోవర్టులు ఈ సమాచారాన్ని కేసీఆర్ కు చేరవేశారు.. దొరికితే కాళ్ళు లేకపోతే జుట్టు పట్టుకునే కేసీఆర్ వెంటనే తన అస్త్రాలను బయటకు తీసి రాయబారం పంపించారు.. తెలంగాణకు చెందిన ఇద్దరు ప్రముఖ వ్యాపారస్తులు, స్వామీజీని రంగంలోకి దింపి తనకు బీజేపీ నుంచి ఏమి కావాలి, తాను బీజేపీ కి ఏమి ఇవ్వగలనో స్పష్టంగా చెప్పారని, దానికి బీజేపీ నేతలు కూడా సంతృప్తి చెందినట్లు ఆ ప్రముఖ వెబ్సైట్ ప్రచురించింది. దేశం మొత్తం పార్టీని విస్తరిస్తున్న బీజేపీకి తెలంగాణలో లైన్ క్లియర్ చేయడానికి స్వయంగా కేసీఆర్ ఒప్పుకునట్లు ఆ వెబ్సైట్ ప్రచురించింది. మీకు అధికారం కావాలి నా కుటుంబం 10 సంవత్సరాలు అధికారంలో ఉంది ఇక చాలు నాకు కావాల్సింది నా కుటుంబ సేఫ్ గా ఉండడం.. నాకు కుటుంబ భరోసా ఇవ్వండి, తెలంగాణలో అధికారాన్ని మీకు అప్పజెప్పుతా.. ఈ మూడు సంవత్సరాలు నా కొడుకు సీఎంగా ఉంటాడు మీరు ఇబ్బంది పెట్టకండి నేను 2022 లో మీకు వదిలేస్తా ఇది కేసీఆర్ ఢీల్లి పెద్దలకు పంపిన రాయబారం అని వెబ్సైట్ ప్రచురించింది. హైదరాబాద్ లో అమిత్ షా కేసీఆర్ ను జైల్ కు పంపిస్తా అని శపథం చేస్తాడు అనుకున్న సంజయ్ కి షా స్పీచ్ విని షాక్ తిన్నాడట, ఏంది అన్న ఇది అని ఒక సీనియర్ అని అడిగితే జరిగిన రాయబారం చెప్పడంతో సైలెంట్ గా ఉండిపోవడం సంజయ్ వంతు అయ్యింది అనేది ఆ వెబ్సైట్ కథనం సారాంశం. అది ఒక ప్రముఖ వెబ్సైట్ అవ్వడంతో ఇప్పుడు చర్చ అంత దీనిపైనే సాగుతుంది.
ఇక టీఆర్ఎస్ వర్గీయుల కథనం దిగువన చదవండి
హైదరాబాద్ లో అమిత్ షా ఎందుకు తోక ముడిచాడు ?
మోడీ కిక్కురుమననిది అందుకేనా ?
అసలు కేసీఆర్ ఏం వార్నింగ్ ఇచ్చాడు ?
దేశచరిత్రలో ఇంతవరకు ఎన్నడూ లేనివిధంగా ఒక మేయర్ ఎన్నికను కేంద్రంలో అధికారంలో ఉన్నపార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఏకంగా కేంద్ర హోంమంత్రి, కేంద్ర మంత్రులు , ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను ప్రచారానికి దింపారు. ఏకంగా ప్రధానమంత్రి మోడీ కరోనా టీకా పేరుతో హైదరాబాద్ వచ్చి వెళ్లారు. మోడీ వచ్చి ఏదైనా ప్రకటన చేస్తాడని అందరూ భావించారు. కనీసం హైదరాబాద్ కు నిధులు ప్రకటిస్తే టీఆర్ఎస్ మీద దూకుడుగా వెళ్లవచ్చని బండి సంజయ్ వర్గం భావించింది. కానీ అది జరగలేదు. తరువాత అమిత్ షా వచ్చినప్పుడన్నా ఏదైనా ప్రకటించడం, కేసీఆర్ ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలు చేస్తాడని భావించారు. అయితే మోడీ నోరు తెరవకపోవడం, అమిత్ షా కిక్కురుమనకపోవడం వెనక కేసీఆర్ పరోక్ష హెచ్చరికలే కారణం అని తెలుస్తుంది. కేసీఆర్ ఇచ్చిన వార్నింగ్ తో ఏ క్షణాన కేసీఆర్ ఢిల్లీలో అడుగుపెడతాడో అని బీజేపీ అధిష్టానం వణుకుతుందని అమెరికాకు చెందిన ప్రముఖ వెబ్ న్యూస్ ఆసక్తికర కథనం వెల్లడించింది.
దాదాపు 300 పార్లమెంట్ స్థానాలతో కేంద్రంలో స్పష్టమైన మెజారిటీ ఉన్న బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చిన ప్రజలకు ఉపయోగపడే ఒక్క పని చేయలేదు. పైగా రెండోసారి అధికారంలోకి వచ్చాక ప్రభుత్వరంగ సంస్థలను మరింత త్వరగా అమ్మడం మొదలుపెట్టారు. క్రూడాయిల్ ధరలు తగ్గినా పెట్రోల్, డీజిల్ ధరలలో మార్పులేదు. కొత్తగా కార్పోరేట్లకు మేలు చేసే వ్యవసాయ, పవర్ చట్టాలు తెచ్చారు. దొడ్డిదారిన వివిధ రాష్ట్రాలలో అధికారం అందుకున్న బీజేపీకి దక్షిణాది కొరకరాని కొయ్యగా మారింది.
దీనికితోడు కేసీఆర్ ఎప్పటికైనా తమకు ప్రత్యామ్నాయం అవుతాడని మోడీ – షా ద్వయం భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే 28 నియోజకవర్గాల మీద ప్రభావం చూపే హైదరాబాద్ మేయర్ ఎన్నిక మీద బీజేపీ గురిపెట్టింది. దుబ్బాక ఎన్నిక నుండి బీజేపీ తప్పుడు ప్రచారం, రాష్ట్రప్రభుత్వానికి సంబంధం లేకుండా దొంగహామీల మీద దృష్టిపెట్టిన కేసీఆర్ దేశంలో బీజేపీయేతర పార్టీలతో అంతర్గత చర్చలు జరుపుతున్నారు. జీహెచ్ఎంసీలో బీజేపీ అజెండా పూర్తిగా తెలుసుకున్నాక, బీజేపీ ఎన్నికల ప్రచార సరళి మొత్తం చేతికి అందాక కేసీఆర్ బీజేపీతో సన్నిహితంగా ఉండే వర్గాలతో మెల్లిగా సంకేతాలు పంపినట్లు ఆ వెబ్ న్యూస్ సంచలన విషయాలు పేర్కొంది. కేసీఆర్ పంపిన సంకేతాలతో మోడీ, అమిత్ షా ఏం చేయాలి ? కేసీఆర్ ను ఎలా ప్రసన్నం చేసుకోవాలి అన్నదానిపై దృష్టి సారించినట్లు సమాచారం.
ఆరేళ్లుగా అధికారంలో ఉన్నా కేంద్రంలో ఉన్న మీరు పేద ప్రజలకు చేసిందేం లేదు. అంబానీ, ఆదానీ ఆస్తులు పెంచుతూ దేశాన్ని దివాళా తీయిస్తున్నారు. తెలంగాణ లో రైతుబంధు, రైతుభీమా, 24 గంటల కరంటు, కేసీఆర్ కిట్, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లతో పాటు , సన్నబియ్యం అన్నం, కొత్త గురుకులాలు, పంచాయతీ రాజ్ చట్టంతో గ్రామాలు, మున్సిపల్ చట్టంతో పట్టణాల అభివృద్ధి చేస్తున్నాం. 14 ఏండ్లు కష్టపడి , అవమానాలు పడి , చావు నోట్ల తలపెట్టి తెచ్చుకున్న తెలంగాణ అభివృద్ధి కోసం ఇన్ని రోజులు ఇక్కడ దృష్టి పెట్టాను. ఇక తెలంగాణలో నా పని నా కొడుకు చూసుకుంటాడు. దేశం మీదనే నా దృష్టి. అద్వానీ, వాజ్ పేయి కష్టపడి స్వదేశీ నినాదం, హిందుత్వ భావజాలంతో బీజేపీని నిలబెడితే ప్రజలను మోసం చేస్తూ దేశాన్ని ఇంత ఘోరంగా కార్పోరేట్ల పరం చేస్తారా ? దక్షిణాది రాష్ట్రాలు పన్నులు కడుతుంటే వాటిని బీజేపీ పాలిత ప్రాంతాలకు తరలిస్తూ మాకు నిధులు ఇవ్వకుండా వేధిస్తారా ? నిజాయితీగా మాట్లాడితే సతాయిస్తారా ? అసలు ఆరేళ్లలో ఏం చేశారు ? రైతులు రోడ్డెక్కుతుంటే దాడులు చేస్తారా ? అన్నం పెట్టే రైతన్నను లాఠీలతో కొడతారా ? యూపీలో ఏం జరుగుతుంది ? మీడియాను అడ్డు పెట్టుకుని ప్రపంచాన్ని మభ్యపెడతారా ? ఢిల్లీలో తెలంగాణ భవన్ త్వరగా నిర్మించిన తరువాత నా మకాం అక్కడే ఉంటుంది. అప్పటి వరకు తెలంగాణ బీజేపీ నేతలతో ఎన్ని చిల్లర కూతలు కూయిస్తారో కూయించండి. మీరు ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో అల్లర్లు సృష్టించే ప్రయత్నం చేస్తారా .. నేను ప్రాణం పెట్టి తెచ్చుకున్న రాష్ట్రం నా కండ్ల ముందు ఆగం చెయ్యాలని భావిస్తే చూస్తూ ఊరుకుంటానని ఎలా అనుకున్నారు ? పార్లమెంటును గడగడలాడించి తెలంగాణ తెచ్చుకున్న నాకు బీజేపీని ఎలా టార్గెట్ చేయాలో తెలియదా ? ప్రజాక్షేత్రంలో మిమ్మల్ని ఎలా నిలబెట్టాలో తెలియదా ? నేను ఒక్కసారి పర్యటన మొదలు పెడితే ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర ఏకం చెయ్యగలను. మీరు ఎన్ని నాటకాలు ఆడినా నేను జాతీయ రాజకీయాలలో వేలు పెట్టనంత వరకే .. ఒకసారి నేను అడుగుపెట్టాక మీరు నన్ను తట్టుకోలేరు. కాస్త ఆలస్యం అవుతుందేమో కానీ దేశానికి మీరు చేసిన నష్టం, కార్పోరేట్లకు అమ్మిన తీరు, పెంచిన ఆస్తుల వివరాలు దేశంలోని ప్రతి గడపకూ వివరిస్తా అని కేసీఆర్ అన్నాడట.
కేసీఆర్ సందేశం అందుకున్న మోడీ, అమిత్ షా ద్వయం గొంతులో పచ్చి వెలక్కాయ పడిందట. కేసీఆర్ కు స్వతహాగ తెలుగు మీద మాత్రమే కాకుండా ఇంగ్లీషు, హిందీ, ఉర్దూ భాషల మీద గట్టిపట్టుంది. ప్రజలకు అర్ధమయ్యే రీతిలో విషయాన్ని వివరించగలిగిన నేత. నిజంగానే కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెడితే తట్టుకోవడం కష్టం. ప్రజలకు బీజేపీ తప్పిదాలను వివరించే నేత లేకపోవడంతో సరిపోయింది. కేసీఆర్ లాంటి నేత వస్తే బీజేపీ డౌన్ ఫాల్ మొదలవుతుంది. అనవసరంగా కేసీఆర్ ను గెలికి కొంపమీదకు తెచ్చుకునుడు ఎందుకని బీజేపీ అధిష్టానం , మోడీ, అమిత్ షాలు అనుకున్నట్లు ఆ వెబ్ సైట్ పేర్కొంది. అందుకే హైదరాబాద్ వచ్చినా ప్రోటోకాల్ ప్రకారం కేసీఆర్ ఆహ్వానించాల్సి ఉన్నా కేసీఆర్ కు మొకం చూయించలేక ఏకంగా ప్రధాని కార్యాలయం నుండే చరిత్రలో తొలిసారి అధికారికంగా ఒక ముఖ్యమంత్రిని రావద్దు అని లేఖ పంపినట్లు సమాచారం. ఇక అమిత్ షా కూడా ఏదో పర్యటన ఖరారు అయింది కాబట్టి పార్టీ శ్రేణులు ఉత్సాహం కోల్పోవద్దని వచ్చి వెళ్లినట్లు తెలుస్తుంది. అందుకే ర్యాలీలో విలేకరి రెండు ప్రశ్నలు అడగగానే కేసీఆర్ కార్యాలయం నుండి వచ్చావా ? అనడమే అమిత్ షా , మోడీల భయానికి కారణం అని ఆ వెబ్సైట్ పేర్కొంది. జీహేచ్ఎంసీ ఎలాగూ గెలిచేది లేదు, అనవసరంగా కేసీఆర్ గెలుక్కుని కొరివితో తల గోక్కున్నామా ? మరో మూడేళ్లు తెలంగాణ లో కేసీఆర్ దే అధికారం, ఇక 2022 లో 119 నియోజకవర్గాలలో నిలబెట్టేందుకే మొత్తం అభ్యర్థులు లేరు. వారిని వెతకడం , నిలబెట్టి అధికారం దక్కించుకోవడం అనేది వట్టి ముచ్చట. ఇన్ని పథకాలు పెట్టిన కేసీఆర్ కు తెలంగాణ లో మళ్లీ అధికారం ఖాయం. కానీ ఈ లోపు కేసీఆర్ అధికారం కొడుక్కు ఇచ్చి దేశం మీద పడితే తమ పరిస్థితి ఏంటి ? అని మోడీ – అమిత్ షాలు నెత్తిపట్టుకున్నారని సమాచారం. ఎలాగైనా కేసీఆర్ ను కలిసి జాతీయ రాజకీయాల్లోకి రాకుండా ఉండాలని ఒప్పించుకునే ప్రయత్నాలను వీరు చేస్తున్నట్లు సమాచారం.