ఔను…అచ్చంగా అవే దృశ్యాలు. అడవిలో మళ్లీ యుద్ద మేఘాలు అలుముకుంటున్నట్లు కనిపిస్తోంది. అన్నలు (నక్సల్స్), పోలీసులు దశాబ్ధాల అనంతరం పరస్పరం తలపడుతున్నట్లు సాక్షాత్కరిస్తోంది. దాదాపు పదేళ్ల కాలం తర్వాత ఛత్తీస్ గఢ్ అడవుల నుంచి తెలంగాణా అరణ్యంలోకి అడుగిడిన నక్సల్స్ తో అమీ, తుమీ తేల్చుకోవడానికే పోలీసులు సిద్దపడుతున్నారు. మరోవైపు పూర్వ వైభవం కోసం మావోయిస్టు పార్టీ నక్సల్స్ తమ ప్రయత్నాలు ప్రారంభించారు.
తెలంగాణా అడవుల్లో మళ్లీ మావోల అలజడి కనిపించడంతో రాష్ట్ర పోలీస్ బాస్, డీజీపీ మహేందర్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. అటవీ ప్రాంతాల్లోనే క్షేత్ర స్థాయి పర్యటన చేశారు. గోదావరి పరీవాహక ప్రాంతంలోని కుమ్రం భీం, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం తదితర జిల్లాల పోలీసు అధికారులను అప్రమత్తం చేశారు. నక్సల్స్ కట్టడికి తీసుకోవలసిన చర్యలపై దిశా, నిర్దేశం చేశారు. ఆయన పర్యటన అనంతరం నక్సల్స్ నేతల పేరుతో పలు పత్రికా ప్రకటనలు వెలువడ్డాయి. ఇదే దశలో మావోల విమర్శలను పోలీసు శాఖ ‘కౌంటర్’ చేస్తోంది కూడా. ఇందుకు సంబంధించి మావోయిస్టు పార్టీ నాయకుడు మహేష్, ములుగు జిల్లా ఎస్పీ వేర్వేరుగా జారీ చేసిన పత్రికా ప్రకటనలు సరిగ్గా 1990 దశకం నాటి ‘యుద్ధాన్ని’ తలపిస్తున్నాయి. పట్టుకోసం నక్సల్స్, వారి కట్టడి కోసం పోలీసుల యుద్ధం దశాబ్ధాల క్రితం నాటి దృశ్యాలను మళ్లీ గుర్తు చేస్తోంది. దిగువన గల ఆయా ప్రకటనలను పరిశీలిస్తే ఇదే అంశం బోధపడుతుంది.
ములుగు జిల్లా ఎస్పీ పేరుతో విడుదలైన ప్రకటన:
వాస్తవాలు మాట్లాడితే ఉలికిపడుతున్న మావోయిస్టులు.
ఇటీవల మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి గారు పర్యటించిన విషయం అందరికీ తెలిసినదే. ఈ సందర్భంగా మావోయిస్టుల అసాంఘిక కార్యకలాపాలపై డిజిపి గారు మీడియా వారితో మాట్లాడిన విషయాల పట్ల ఉలిక్కిపడిన మావోయిస్టులు మహేష్ అనే వ్యక్తి పేరిట ఈనెల 20వ తారీఖున ఒక కరపత్రాన్ని విడుదల చేశారు. ఈ కరపత్రాన్ని విడుదల చేసిన మహేష్ అనే వ్యక్తి ఎవరో అతని హోదా ఏమిటో కూడా ఎవరికీ తెలియదు.
కానీ మావోయిస్టు అగ్ర నాయకత్వం మాత్రం ఎవరెవరి పేరుతోనో కరపత్రాలను విడుదల చేస్తూ వ్యాపారస్తులను,ధనవంతులను బెదిరించి దౌర్జన్యంగా డబ్బులు వసూలు చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారు. నిజాలు మాట్లాడితే ఉలికిపాటు ఎక్కువ. మావోయిస్టులు ఇన్ఫార్మర్ల పేరుతో అమాయకపు గిరిజనులను కాల్చి చంపడం, కాంట్రాక్టర్లను బెదిరించడం కొత్తేమీ కాదు.మావోయిస్టు పార్టీలో మహిళలను శారీరకంగా హింసించడం తట్టుకోలేక విసిగిపోయి జనజీవన స్రవంతిలో కలవడం అవాస్తవమా.. ఏజెన్సీ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణ యంత్రాలను దగ్ధం చేయడం, కాంట్రాక్టర్లను హతమార్చడం, కార్మికులను వేధించడం లాంటివి కొన్ని దశాబ్దాలుగా మావోలు అనుసరిస్తున్న పద్ధతే అని అందరికీ తెలుసు. ఈ విషయాలనే డీజీపీ గారు మీడియా వారికి తెలియజేసారు. ఈ విషయాలలో కొత్తగా సృష్టించి డిజిపి గారు మాట్లాడింది ఏమీ లేదు. మావోయిస్టు పార్టీలోని లొసుగులను భయట పెట్టడం వలన డీజీపీ గారికి ఒరిగిందేమి లేదు.మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ పూర్వ నాయకులు జంపన్న,సత్యజీ లాంటి వారు విసిగిపోయి ఈ విషయాలను ఎప్పుడో బయటపెట్టారు.
తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదనడం విడ్డూరం. అభివృద్ధిని కాపాడవలసిన బాధ్యత మరియు శాంతి భద్రతలను కాపాడాల్సిన బాధ్యత అధికారులకు రాజ్యాంగం కల్పించింది. విధుల నిర్వహణలో భాగంగా ఆ బాధ్యతలను పోలీసులు మరియు ఇతర అధికారులు నిర్వహిస్తున్నారు. మావోయిస్టు అగ్ర నాయకులు ఒకరికి మించి మరొకరు కరపత్రాలను విడుదల చేస్తూ డబ్బులు దండుకుని, వ్యక్తిగత విలాసాలకు వాడుకోవడం తప్ప ఎవరి ప్రయోజనాలకు వాడుతున్నారు?. కంచె చేను మేసినట్లు అగ్ర నాయకులను చూసి దళ సభ్యులు పేద ప్రజలను పీడించడం వాస్తవం కాదా.. తుప్పుపట్టిన సిద్ధాంతాలను, పేదల రక్తం తాగే ఉద్యమాలు చేసేది మావోయిస్టులు కాదా..మీరా పోలీసులకు చెప్పేది. విధి నిర్వహణలో భాగంగా ప్రాణాలను లెక్కచేయకుండా మావోయిస్టుల అరాచకాలను ఎదుర్కొంటూ, ప్రజల కోసం పని చేస్తున్న పోలీసు ఉద్యోగం ఎందుకు అనడంలో ఔచిత్యం ఏమిటి..
ఇలాంటి కల్లబొల్లి కబుర్లు చెప్పి ప్రజలను ఎంతకాలం మోసం చేస్తారు? ఇప్పటికైనా కళ్లు తెరిచి జన జీవన స్రవంతిలో కలవండి.
సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్
ములుగు జిల్లా.