రాజకీయాల్లో విలువలు అంటే అవినీతికి దూరంగా ఉండడమే కాదు తమను తాము గౌరవించి మాట్లాడుకోవడం. ఒక పార్టీ నాయకుడు ప్రత్యర్థి పార్టీ నాయకుణ్ణి గౌరవించలేకపోతే ఇద్దర్నీ ప్రజలు గౌరవించరు. ప్రత్యర్ధులు విమర్శలు చేసుకోవడం మానేసి అవహేళన చేసుకోవడం, అవాంఛనీయ పదప్రయోగం చేయడం ఎక్కువైంది.
రాజకీయ నాయకులు కేవలం ప్రత్యర్ధులు అన్న కారణంగా తమను తామే గౌరవించుకోలేకపోతే ప్రజలు రాజకీయనాయకులను ఎందుకు గౌరవిస్తారు? ప్రత్యర్థులను అవమానకరంగా, అవహేళనగా సంబోధించడం ఎన్టీఆర్ తో మొదలైంది. అయన ప్రత్యర్థులను కుక్కమూతి పిందెలు అంటూ సంబోధించారు. అప్పటివరకు ప్రత్యర్థులను రాజకీయ నాయకులు ఇలా సంబోధించడం నేను వినలేదు. ఆ తర్వాత ఈ సంబోధన ఎంతవరకూ వెళ్ళిందంటే అప్పటి ప్రజారాజ్యంలో యువరాజ్యం నేత పవన్ కళ్యాణ్ ప్రత్యర్థులను పంచెలూడదీసి కొడతాం అనే వరకు. ఒక నేత ఇంకో నేతను పంచె ఊడదీసి కొడితే ఇద్దరు నేతలనూ ప్రజలు అలాగే కొట్టారా?
ఈ ఐదేళ్ళలో ఈ వ్యక్తిగత అవమానకర పదప్రయోగం మరింత పెరిగింది. నేతలు తమను తామే చులకన చేసుకుంటూ అలాంటి పదప్రయోగాన్నే విమర్శ అనుకుని సంబరపడ్డారు. ముఖ్యమంత్రి స్థాయిలోని వ్యక్తి ప్రత్యర్థిని కోడికత్తి పార్టీ నేత అనడం, ప్రతిపక్ష నేత ముఖ్యమంత్రిని కాల్చి చంపినా తప్పులేదు అనడం రాజకీయ నాయకులుగా తమ స్థాయిని వారే దిగజార్చుకున్నారు. ఇక చిన్న స్థాయి నాయకులు కూడా ముఖ్యమంత్రిని ఏకవచనంతో సంబోధించడం, ఈ పార్టీ వారు ప్రతిపక్ష నేతను ఏకవచనంతో సంబోధించడం రాజకీయాలను దిగజార్చి, రాజకీయ నాయకుల పట్ల ప్రజల్లో గౌరవం, విశ్వాసం లేకుండా చేసుకున్నారు.
ఇందంతా ఎందుకు జరిగిందంటే ప్రత్యర్థిని విమర్శించేందుకు నీదగ్గర Subject లేదు. సమాచార సేకరణ లేదు. అందుకే అసభ్య పదజాలం ఒకరిపై ఒకరు వాడుకుంటూ ఒకరినొకరు దిగజార్చుకుంటూ మరింత పతనానికి వారిదార్లు వారే వేసుకుంటున్నారు.
ఇది మంచిది కాదు. అధికారం వేరు. అందుకోసం subject నేర్చుకోండి. మీ ప్రత్యర్థులపై సబ్జెక్టుతో దాడి చేయండి. అసభ్య పదజాలంతో, అవమానకర పదజాలంతో, ఏకవచన సంబోధనతో, మీ పరువు మీరే తీసుకోకండి. మిమ్మల్ని మీరు గౌరవించకోకపోతే ప్రజలెందుకు మిమ్మల్ని గౌరవిస్తారు? ముందు ఏకవచన సంబోధన మానుకోండి. సాటి నేతను గౌరవించుకోవడం కూడా రాకపోతే ప్రజాస్వామ్యానికి మీరెందుకు?
✍️ గోపి దారా