కోరలు చాస్తున్న కరోనా తీవ్రత తెలంగాణాలోని వ్యాపారులను స్వచ్ఛంద బంద్ వైపు పయనింపజేస్తోంది. వ్యాపారాలు చేసుకునేందుకు లాక్ డౌన్ లో పాలకులు సడలింపులు ఇచ్చినప్పటికీ వర్తకులు భీతిల్లుతున్నారు. ఓ రకంగా చెప్పాలంటే ప్రజా శ్రేయస్సు లక్ష్యంగా తమకు తామే స్వచ్ఛందంగా ‘లాక్ డౌన్’ విధించుకుంటున్నారు.
ఈనెల 17వ తేదీన నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో ప్రధాని నరేంద్ర మోదీ ఏం చెప్పారో గుర్తుందిగా? ‘దేశంలో మళ్లీ లాక్ డౌన్ ఉండదు. నాలుగు దశల లాక్ డౌన్ ముగిసింది. అన్ లాక్ 1.0 నడుస్తున్నది. అన్ లాక్ 2.0 ఎలా అమలు చేయాలనే అంశంపై మనమంతా చర్చించుకోవాలి’ అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలంగాణా సీఎం కేసీఆర్ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కార్యాలయవర్గాలే ప్రకటించాయి కూడా.
అటు కేంద్ర స్థాయిలో, ఇటు రాష్ట్ర స్థాయిలో ఇచ్చిన లాక్ డౌన్ సడలింపులపై సహజంగానే వ్యాపారులు తొలుత సంబరపడ్డారు. ఎంతో కొంత తమ వ్యాపారాలు సాగుతాయని ఆశపడ్డారు. మరోవైపు లాక్ డౌన్ సడలింపులు ప్రభుత్వ ఆదాయాన్ని పెంచాయి కూడా. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం క్రమేణా మెరుగవుతున్నందువల్లే ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు జూన్ నెల పూర్తి వేతనాలు చెల్లింపునకు నిర్ణయం తీసుకున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించడం గమనార్హం.
కానీ కరోనా కల్లోల తాజా పరిస్థితులు ఆందోళనకరంగా పరిణమించాయి. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఏరోజుకారోజు పెరుగుతోంది. తెలంగాణాలో పది వేల సంఖ్యను దాటేసిందికూడా. ఈ పరిణామాలు సహజంగానే వర్తక, వాణిజ్య వర్గాలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. స్వచ్చందంగా లాక్ డౌన్ విధింపునకే వ్యాపారులు మొగ్గు చూపుతున్నారు. మొన్న కరీంనగర్ కిరాణా వర్తకులు కఠిన నిర్ణయం తీసుకున్నారు. మధ్యాహ్నం రెండు గంటల వరకే షాపులు తెరుస్తామని స్వచ్ఛందంగా ప్రకటించారు.
కరీంనగర్ కిరాణా వ్యాపారుల బాటలోనే హుస్నాబాద్ వైన్స్ అసోసియేషన్ పయనించింది. ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకే మద్యం షాపులు నిర్వహిస్తామని రెండు రోజుల క్రితమే ప్రకటించింది. సిరిసిల్ల వర్తకులు సైతం శుక్రవారం ఇటువంటి నిర్ణయమే తీసుకున్నారు. తమ షాపులను సాయంత్రం నాలుగు గంటల వరకే తెరిచి ఉంచుతామని సిరిసిల్ల కిరాణా, బట్టల, మొబైల్ షాపుల వ్యాపారులు తీర్మానించారు. వాటి ప్రతులను స్థానిక పోలీస్ స్టేషన్లో ఇచ్చారు.
తాజా సమాచారం ప్రకారం హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాల్లోని పలు ప్రాంతాల్లో వ్యాపారులు స్వచ్ఛందంగా షాపుల బంద్ కు నిర్ణయం తీసుకున్నారు. బేగంబజార్, ఫిల్ ఖానా, ఉస్మాన్ గంజ్, సిద్ధంబర్ బజార్, సూర్యాటవర్స్, ప్యారడైజ్, రాణిగంజ్ తదితర ప్రాంతాల్లో హోల్ సేల్, వస్త్ర దుకాణాలతోపాటు, బంగారం షాపుల వర్తకులు కూడా స్వచ్ఛంద మూసివేతకు నిర్ణయం తీసుకున్నారు. నేటి నుంచి వచ్చే నెల 5వ తేదీ వరకు షాపులు తెరిచే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రతరం కావడమే ఇందుకు కారణమని వ్యాపారులు వెల్లడిస్తున్నారు.