మహేష్ బాబు ‘ఖలేజా’ సినిమా గుర్తుంది కదా? ప్లాటినమ్ కన్నా విలువైన ఖనిజ నిక్షేపాలను హస్తగతం చేసుకునేందుకు ఇందులో ప్రకాష్ రాజ్ పోషించిన పాత్ర రక్తి కట్టింది. అది సినిమా… కానీ నిజ జీవితంలోనూ అటువంటి అంశమే ప్రామాణికంగా, సారాంశాన్ని కాస్త అటూ, ఇటూగా తీసుకుని జనంలో చర్చ జరిగే విధంగా ఎవరైనా వ్యవహరిస్తే…? అధికార పార్టీకి చెందిన ఓ కీలక నేతను లక్ష్యంగా చేసుకుని ప్రత్యర్థులు సోషల్ మీడియా పోస్టును నెట్టింట్లోకి వదిలితే…? వినడానికి, చదవడానికి ఆసక్తికరంగానే ఉండొచ్చు. కానీ వాస్తవం ఏమిటన్నదే అసలు ప్రశ్న. విశాఖలో చోటు చేసుకున్న తాజా విషాద ఘటనలో ఇదో తరహా రాజకీయం కాబోలు. లేదంటే వర్గ రాజకీయ ఎత్తుగడ కావచ్చు. ఇక అసలు విషయంలోకి వస్తే…
విశాఖ నగరంలో ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ విషాద ఘటనలో ఇప్పటికే 12 మంది మృతి చెందగా, వందలాది మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితులకు నష్టపరిహారం కింద రూ. 30 కోట్ల మొత్తాన్ని ఏపీ ప్రభుత్వం విడుదల కూడా చేసింది. మరోవైపు గ్యాస్ లీక్ ఘటనకు దారి తీసిన పరిస్థితులపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. కేంద్ర ప్రభుత్వం కూడా వివిధ రకాలుగా దర్యాప్తు ప్రారంభించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఘోర విషాద ఘటన నుంచి బాధిత కుటుంబాలతోపాటు విశాఖ నగర ప్రజలు పూర్తిగా తేరుకోకముందే ఓ సోషల్ మీడియా పోస్ట్ ఏపీ రాజకీయాల్లో కలకలానికి దారి తీసింది.
అధికార పార్టీలోని ఓ ముఖ్య నాయకున్ని, మరో ఆధ్యాత్మిక సాములోరిని కేంద్రంగా చేసుకుని తీవ్ర ఆరోపణలతో కూడిన ఈ పోస్ట్ వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొడుతోంది. వైఎస్ఆర్ సీపీలోని ఓ కీలక నేతపై భారీ భూ ఆరోపణలతో కూడిన ఈ పోస్టు సృష్టికర్తలెవరు? రాజకీయ ప్రత్యర్థులా? సొంత పార్టీకి చెందిన నాయకులేనా? ఇవీ సందేహాలు. ఎందుకంటే అధికార పార్టీలోని ఆయా కీలక నేత పెత్తనాన్ని, బుల్డోజింగ్ పద్ధతులను అదే పార్టీకి చెందిన విశాఖలోని స్థానిక నేతలు కొందరు ఏ మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారట. ఈ నేపథ్యంలో ఆయా పోస్టును తయారు చేసిందెవరనే అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
దాదాపుగా ‘జర్నలిస్టిక్’ భాషలోనే గల ఈ వాట్సాప్ పోస్ట్ ఏపీలోని అధికార పార్టీ నేతల్లోనేగాక, రాజకీయ పార్టీల్లో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారడం గమనార్హం. ఇంతకీ ఆ పోస్టులో ఉటంకించిన నేతల పేర్లను ప్రస్తావించకుండా అందులో ఏముందనే అంశాన్ని క్లుప్తంగా పరిశీలిస్తే… వైఎస్ఆర్ సీపీలోని ఓ కీలక నేత విశాఖలోని భూములపై కన్నేశారట. భూములను క్రమపద్ధతిలో కైంకర్యం చేసేందుకు పథక రచన చేశారట. గ్యాస్ లీక్ ఘటన జరిగిన ఎల్జీ పాలిమర్స్ సంస్థ గల వెంకటాపురం వైపునకూ ఆయా కీలక నేత భూముల హస్తగతం కోసం వచ్చారట. ప్రభుత్వ భూముల్లో ఉన్నవారిని ఖాళీ చేయించే ప్రణాళిక రూపొందించారని, ఈ నేపథ్యంలోనే గ్యాస్ లీకై మనుషులతోపాటు పశు, పక్ష్యాదులు పిట్టల్లా నేలకొరిగినట్లు ఆయా పోస్టులోని ఆరోపణల సారాంశం.
లాక్ డౌన్ తొలి దశ పూర్తయిన వెంటనే సదరు కీలక నేత ఎల్జీ పాలిమర్స్ సంస్థకు ఉత్పత్తి ప్రారంభించేందుకు అవసరమైన అనుమతులు ఇప్పించారనేది కూడా ఆయా పోస్టులో గల మరో ముఖ్య ఆరోపణ. ప్లాస్టిక్ తయారు చేసే సంస్థకు నిత్యావసరాల పరిశ్రమ తయారీ సంస్థగా అనుమతి ఇప్పిండం వెనుక విషయం చాలా ఉందని కూడా పేర్కొన్నారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ప్రస్తుత సీఎం జగన్ ఫొటోలు కూడా లేకుండా ఈ కీలక నేత ప్రారంభించిన ట్రస్టుకు కోట్ల రూపాయల విరాళాల టార్గెట్లను పారిశ్రామిక సంస్థలకు విధించినట్లు పోస్టులోని ఆరోపణల సారాంశం. ఎల్జీ పాలిమర్స్ కూడా భారీగానే ఈ ట్రస్టుకు విరాళాలు ఇచ్చిందని పోస్టులోని ఆరోపణ.
ఈ నేపథ్యంలో ఎల్జీ పాలిమర్స్ ఏరియాలోని భూములను సదరు కీలక నేత ప్రస్తుతం ఖాళీ చేయించాల్సిన అవసరం లేదని, అక్కడి ప్రజలే భయంతో ఖాళీ చేసి వెళ్లిపోతారని కూడా సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. మొత్తంగా విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ విషాద ఘటనలో అధికార పార్టీలోని కీలక నేతను టార్గెట్ చేస్తూ రూపొందించిన ఈ పోస్ట్ తీవ్ర దుమారం రేపుతోంది.
అచ్చు ‘ఖలేజా’ సినిమా కంటెంటును తలపించే విధంగా లేదూ… ఆయా సోషల్ మీడియా పోస్ట్? సినిమా కథనం కల్పితం. అయితే ఓ కీలక నేతను టార్గెట్ చేస్తూ వదిలిని ఈ సోషల్ మీడియా పోస్టు రాజకీయ ఈర్ష్యతో రూపొందించిందా? లేక ఏవేని వాస్తవాలను ప్రతిబింబిస్తోందా? అనే అంశాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిజా నిజాలేమిటనేది గ్యాస్ లీక్ ఘటనపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన విచారణ కమిటీ దర్యాప్తులో తేలుతుందన్నది నిర్వివాదాంశం.