గడచిన రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఓ వీడియో గిర గిరా తిరుగుతోంది. సోషల్ మీడియా పరిభాష ప్రకారం ‘వైరల్’గా మారిందన్నమాట. రైలు పట్టాలపై తమ ఇళ్లకు వెడుతున్న వలస కూలీల నుంచి రైల్వే జవాను ఒకతను ‘అమ్యామ్యాలు’ వసూలు చేస్తున్న దృశ్యానికి సంబంధించిన వీడియో అది. గత 48 గంటల వ్యవధిలో ఏ వాట్సాప్ గ్రూపులో చూసినా ఇదే వీడియో కనిపిస్తోంది. ‘అన్నా ఇది మన సైట్లో పెట్టండి, సార్… ఇదీ మీ సైట్లో వాడండి’ అంటూ మిత్రులు, శ్రేయోభిలాషులు, జర్నలిస్టులు ts29కు ప్రత్యేకంగా ఈ వీడియోను షేర్ చేస్తున్నారు.
వాస్తవానికి ఈ వీడియో రెండు రోజుల క్రితమే ts29కు చేరింది. కానీ ఎక్కడో వీడియోపై సందేహం. ఎందుకంటే వలస కూలీలుగా పేర్కొంటున్న మహిళల నుంచి డబ్బు వసూల్ చేస్తున్న రైల్వే కానిస్టేబుల్ కే కాదు… ఘటనా స్థలిలోగల మహిళల్లో ఎవరికి కూడా ఎటువంటి మాస్కులు లేవు. ఇదేదో పాత వీడియోగా స్పష్టంగా తెలుస్తూనే ఉంది. కానీ వీడియోను అదే పనిగా అనేక మంది షేర్ చేస్తున్నారు. ‘గాయం’ సినిమాలో సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన ‘నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని సమాజాన్ని..’ అనే పాట వీడియో బ్యాక్ డ్రాప్ లో వినిపిస్తోంది. అంటే వీడియోకు తెలుగు పాటను మిక్సింగ్ చేశారన్నమాట.
ఆది నుంచీ సందేహంగానే సంశయిస్తున్న వీడియో గురించి ‘గూగుల్’ చేస్తే తేలిందేమిటో తెలుసా? అది సూరత్ నుంచి షేర్ చేసిన పాత వీడియోగా ‘ఆల్ట్ న్యూస్’ తేల్చింది. నిరుడు జూలై 19న పోస్ట్ చేసిన ట్వీటుకు సంబంధించిన వీడియోగా రివర్స్ సెర్చ్ ద్వారా వెల్లడైనట్లు ‘ఆల్ట్ న్యూస్’ ప్రకటించింది. వాస్తవానికి రైల్వే ట్రాక్స్ లో మద్యం అక్రమ రవాణా చేసే మహిళల నుంచి లంచం తీసుకుంటున్న కానిస్టేబుల్ వీడియోగా స్పష్టం చేసింది. ఈ ఘటనలో ఆర్పీఎఫ్ విభాగానికి చెందిన జవాన్ జైకాంత్ ను సర్వీసు నుంచి తొలగించినట్లు కూడా ‘అహ్మదాబాద్ మిర్రర్’ వార్తా కథనం ప్రచురించినట్లు ‘ఆల్ట్ న్యూస్’ పేర్కొంది. అప్పటి ఈ పాత వీడియోనే తాజాగా వలస కూలీల నుంచి డబ్బు వసూలు చేస్తున్నట్లు ఆపాదిస్తూ నెటిజన్లు తెగ షేర్ చేస్తున్నారట. అదీ వైరల్ వీడియోకు సంబంధించిన అసలు సంగతి.