వందలాది మంది మావోయిస్టు నక్సలైట్లు నిర్వహించిన ఓ ‘అంతిమ యాత్ర’ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. మిన్ప ఎన్కౌంటర్ ఘటనలో చనిపోయిన తమ సహచరుల పాడెలను మోస్తూ భారీ సంఖ్యలో నక్సలైట్లు అంతిమ యాత్రను నిర్వహించిన వీడియో వెలుగు చూసింది. దట్టమైన అటవీ ప్రాంతంలో సుదీర్ఘంగా సాగిన ర్యాలీలో మహిళా నక్సల్స్ కూడా భారీ సంఖ్యలోనే పాల్గొనడం గమనార్హం.

నిరుడు మార్చి 21వ తేదీన సుక్మా జిల్లా మిన్ప అడవుల్లో మావోయిస్టు నక్సలైట్లకు, పోలీసులకు మధ్య భారీ ఎన్కౌంటర్ జరిగిన సంగతి తెలిసిందే. నక్సల్స్ ఏరివేతలో భాగంగా కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న పోలీసులను నక్సలైట్లు లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపారు. ఈ సందర్భంగా జరిగిన ఎన్కౌంటర్ లో 12 మంది డీఆర్జీ, అయిదుగురు ఎస్టీఎఫ్ జవాన్లు సహా మొత్తం 17 మంది పోలీసులు మృతి చెందారు.

ఇదే ఎన్కౌంటర్ లో తమ ముగ్గురు సహచరులు కూడా మరణించినట్లు నక్సల్స్ అప్పట్లో అంగీకరించారు. చనిపోయిన ముగ్గురు నక్సలైట్ల పార్థీవదేహాలకు అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు నక్సలైట్లు దండకారణ్యంలో భారీ ర్యాలీ నిర్వహించినప్పటికీ వీడియో ఇప్పుడు వెలుగు చూసింది.

మిన్ప దాడి అనంతరం బయటకు వచ్చిన వీడియో ఇదేనని బస్తర్ ఐజీ సుందర్ రాజ్ స్థానిక మీడియాకు చెప్పారు. వాస్తవానికి మిన్ప ఎన్కౌంటర్ లో నక్సలైట్లు కూడా భారీ సంఖ్యలోనే మరణించారని, వేర్వేరు ప్రాంతాల్లో వారి అంత్యక్రియలు జరిగాయని, కానీ సమాచారాన్ని నక్సల్స్ బహిర్గతం చేయలేదని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. నక్సలైట్ల ర్యాలీకి సంబంధించిన వీడియోను దిగువన గల లింక్ ద్వారా చూడవచ్చు.

Comments are closed.

Exit mobile version