తెలంగాణా రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు వార్నింగ్ ఇస్తూ టీపీసీసీ అధ్యక్షుని హోదాలో ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యల వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఖమ్మం నగరంలో ఇద్దరు మున్సిపల్ కార్పొరేటర్ల భర్తలపై నమోదైన వేర్వేరు పోలీసు కేసుల అంశంలో ఉత్తమ్ మంత్రి అజయ్ కుమార్ పై ఆరోపణలు చేస్తూ వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది. మంత్రి అజయ్ ఆదేశాల మేరకే ఖమ్మంలోని కాంగ్రెస్ నాయకులపై పోలీసులు తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని, పీడీ యాక్ట్ అమలు చేస్తున్నారని ఉత్తమ్ ఆరోపించారు. అజయ్ కుమార్ ను ఉటంకిస్తూ.., అడ్డగోలు ప్రవర్తన మంచిది కాదని, పిచ్చి పిచ్చి ప్రవర్తన చేసుకుంటే తగిన శాస్తి జరుగుతుందని హెచ్చరిస్తున్నట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు.

ఇద్దరు కాంగ్రెస్ నేతలపై పోలీస్ కేసుల అంశంపై సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క కూడా మాట్లాడారు. తాము ఆయా అంశాలపై డీజీపీని కలిసి వినతి పత్రం ఇచ్చామని, న్యాయం చేయాలని అభ్యర్థించామని చెప్పారు. మంత్రి అజయ్ కుమార్ ను ఉద్ధేశిస్తూ ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ అధ్యక్షుని హోదాలోనే ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. టీపీసీసీ చీఫ్ గా శనివారం రేవంత్ రెడ్డిని నియమించడానికి ముందు రోజు ఈ ఘటన జరిగినట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఉత్తమ్, భట్టి విక్రమార్క వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ఆలస్యంగా వెలుగులోకి రావడం, తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండడం గమనార్హం. ఆయా వీడియో క్లిప్పింగును దిగువన చూడవచ్చు.

Comments are closed.

Exit mobile version