తెలంగాణా సీఎం కేసీఆర్ ఎన్నికల బరిలోకి దింపిన అభ్యర్థులకు వ్యతిరేకంగా కొందరు అధికారులు ప్రత్యర్థి పార్టీకి చెందిన నేతలతో చేతులు కలిపారా? అధికార పార్టీ అభ్యర్థులను చిక్కుల్లోకి నెట్టడానికి ప్రయత్నాలు చేశారా? ఇంత దుస్సాహసానికి ఒడి గట్టారా? కేసీఆర్ పార్టీ అభ్యర్థులపై కొందరు అధికారులకు అంతర్గతంగా అంత కోపం ఉందా? విద్యుక్త ధర్మం నిర్వహించాల్సిన అధికారులు అందుకు విరుద్ధంగా ప్రవర్తించారా? కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, అక్కడి ఎమ్మెల్యే, పౌర సరఫరాల మంత్రి గంగుల కమలాకర్ ల మధ్య తాజాగా చోటు చేసుకున్న రాజకీయ యుద్ధం ఇటువంటి అనేక సందేహాలను కలిగిస్తున్నది. ఎంపీ సంజయ్, ఎన్నికల అధికారిగా వ్యవహరించిన జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ మధ్య జరిగినట్లు పేర్కొంటున్న ఆడియో సంభాషణ తెలంగాణా రాజకీయాల్లో వేడి పుట్టిస్తోంది.
తనను ఓడించడానికి అధికారులు, నాయకులు ఇన్ని కుట్రలు పన్నారని తనకు తెలియదని, ప్రజల్లో గల వంద ప్రశ్నలకు లీకైన ఆడియో సంభాషణ సమాధానం చెబుతున్నదని మంత్రి గంగుల కమలాకర్ వ్యాఖ్యానించారు. కరీంనగర్ కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ వాయిస్ గా ప్రాచుర్యంలోకి వచ్చిన ఆడియో గురించి మంత్రి కమలాకర్ మాత్రం గుర్రుగానే ఉన్నారు. రాజ్యాంగ హోదాలో గల కలెక్టర్ మాట్లాడే పద్ధతి విన్నానని, ఈ అంశం తన పరిధిలోది కాదని, సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెడతానని కమలాకర్ చెబుతున్నారు. ఎన్నికల ఖర్చు, లోపాలు, అనర్హత వంటి అంశాలు ఈ ఆడియో సంభాషణలో ఉండడం విశేషం. గత డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జరిగినట్లు పేర్కోంటున్న ఈ ఆడియో సంభాషణ ఎవరి మెడకు చుట్టుకుంటుంది? మరెవరు బలి అవుతారు? అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
బండి సంజయ్, కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ మధ్య జరిగినట్లు పేర్కొంటున్న ఫోన్ సంభాషణ ఇదే:
ఎంపీ సంజయ్: సార్ నమస్కారం సార్
కలెక్టర్: నమస్తే.. నమస్తే
ఎంపీ : నేనే కలుద్దామనుకున్నా.. కానీ వద్దనుకొని ఆగిన సార్
కలెక్టర్: అచ్చా.. అచ్చా
ఎంపీ: సర్.. సర్
కలెక్టర్ : ఎక్స్పెండేచర్ గురించి బాధపడకండి
ఎంపీ : సర్.. సర్
కలెక్టర్ : అదీ.. ఆల్ రెడీ దానికి వన్ మంత్ టైం ఉంటుంది
ఎంపీ : సర్.. సర్
కలెక్టర్ : నేను అది చూసి పంపిస్తే అది కొంచెం వాళ్ల మీద ప్రెషర్ ఉంటుంది
ఎంపీ : అవున్ సర్
కలెక్టర్ : అదర్వైజ్ మల్లా వాళ్లు వచ్చి ఏదైనా ఒకటేసారి ఎక్సేండేచర్ వాళ్లకి ఎట్లా ఇవ్వండి (ఎట్లా ఇచ్చారు), ఎట్లా (ఇట్లా) కరెక్టు కాదా? అని ఒక పది రకమైన (పది రకాల) ఇబ్బంది పెడ్తారు మళ్లా..
ఎంపీ : నేనెప్పుడు రుణపడి ఉంటా సార్.. మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోను సార్.. అబ్బా మీరు చేసింది అబ్బా గంత.. నేను మిమ్మల్ని ఇండియాలో ఎక్కడున్నా మిమ్మల్ని మర్చిపోను సార్
కలెక్టర్ : థాంక్యూ.. థాంక్యూ
ఎంపీ : నేను వాస్తవానికి.. నేను గెలిచినంక ఫస్టు మీదగ్గరకి వచ్చి కలుస్తా అనుకున్న సార్
కలెక్టర్ : నో.. నో.. థ్యాంక్యూ.. మీరు దీనికి కొంచెం ఫాలోఅప్ చేయండి. టెన్త్ జనవరి వరకు ఫైనల్ అయిపోతది
ఎంపీ : సర్.. సర్..
కలెక్టర్ : మళ్లీ మీరు వెంటనే దానికి ఫాలోఅప్ చేసుకోవచ్చు
ఎంపీ : సర్.. సర్..
కలెక్టర్ : మీ నంబర్ నాకు ఒక్కసారి మెస్సేజ్ చేస్తే.. మీ నంబర్ కూడా సేవ్ చేస్తా. ఏదైనా ఉంటే ఫోన్ చేయండి.. నాతో మాట్లాడండి
ఎంపీ : సర్.. సర్.. చేస్తా.. అయితే నాకు వాట్సాప్ లేదు సార్
కలెక్టర్ : సరే నేను మల్లికార్జున్‌కు చేస్తా. ఆయన మీకు చూపిస్తారు.
ఎంపీ : సర్.. సర్.. సర్.. సర్
కలెక్టర్ : అండ్.. ఎక్కడా డిస్క్వాలిఫై అయ్యిండు నేను ఒక్కసారి మళ్లీ వన్ టూ డేస్ పేపర్లో చూశాను. కానీ మళ్లీ అది చూసి వాట్సాప్‌లో పెడతాను.
ఎంపీ : సర్.. సర్.. థాంక్యూ వెరీమచ్ సర్.. సారీ సర్.. నేను ఎప్పటి నుంచో కలుద్దామనుకుంటున్నా.. ఇబ్బంది ఉంటదని రాలేదు సార్..
కలెక్టర్ : నో.. నో.. నో ఇష్యూ..
ఎంపీ : సర్.. సర్ థాంక్యూ వెరీమచ్ సార్..
ఆడియో సంభాషణపై కలెక్టర్ ఏమంటున్నారంటే?
అధికార పత్రిక నమస్తే తెలంగాణా కథనం ప్రకారం…ఎంపీ బండి సంజయ్‌తో తాను మాట్లాడింది నిజమేనని కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ అంగీకరించారు. ఎనిమిది నిమిషాలపాటు మాట్లాడిన ఈ ఫోన్ రికార్డును కేవలం 1.30 నిమిషాలకు కుదించి విడుదల చేశారన్నారు. నిజానికి సంజయ్ ఫోన్ నంబర్ తన వద్ద లేదని, వేరే వాళ్ల నంబర్‌తో మాట్లాడారని చెప్పారు. అందులో ఎన్నికల వ్యయం ప్రస్తావన వచ్చిన మాట కూడా వాస్తవమేననీ, ఈ విషయంలో తాను అతనికి సహకరిస్తానని అన్నట్టుగా ఉన్నదని, పూర్తి నిడివిగల ఫోన్ రికార్డు తన వద్ద ఉన్నదనీ, దానిని మీడియాకు వెల్లడించాల్సిన అవసరం తనకు లేదని చెప్పారు. ఈ విషయమై ప్రభుత్వానికి నివేదిస్తానని స్పష్టం చేశారు.
మొత్తం ఘటనలో అసలు విషయం ఏమిటంటే…ఎంపీ బండి సంజయ్ తో అత్యంత సన్నిహితంగా తిరిగిన ఓ వ్యక్తి ఆడియోను లీక్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఎన్నికల సమయంలో సంజయ్ ను అంటిపెట్టుకుని తిరిగిన వ్యక్తి ఆడియోను లీక్ చేసి ప్రయోజనం పొందుతున్నట్లు అతని అనుచరగణం ఆరోపిస్తోంది. ఎన్నికల సందర్భంగా సంజయ్ అనేక మంది అధికారులతో మాట్లాడారని, ఓ వ్యక్తి ఫోన్ ద్వారానే సంజయ్ ఎక్కువగా మాట్లాడారని, సదరు వ్యక్తి నమ్మక ద్రోహానికి పాల్పడ్డారన్నది ఎంపీ అనుచరుల వాదన. సంభాషణ రికార్డు చేయడం చట్ట ప్రకారం నేరమని, ఈ ఘటనపై ఎంపీ ఢిల్లీలో ఫిర్యాదు చేసి కేసు పెడతారని కూడా వారు చెబుతున్నారు. మరోవైపు మంత్రి గంగుల కమలాకర్ కూడా ఈ అంశంలో పట్టుదలగానే ఉన్నారు. కలెక్టర్ బదిలీ కోసం మంత్రి అనుచరులు ప్రస్తుతం సోషల్ మీడియాలో పట్టుబడుతున్నారు.