తెలంగాణాలో వీఐపీ కరోనా పేషెంట్ల సంఖ్య పెరుగుతోంది. వైరస్ బారిన పడుతున్న రాజకీయ నేతల, ఉన్నతాధికారుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. తొలుత జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, తర్వాత నిజామాబాద్ రూరల్, అర్బన్ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్దన్, గణేష్ గుప్తాలు కరోనా వైరస్ బారిన పడ్డారు.
ఈ పరిణామం అధికార పార్టీ నేతల్లో తీవ్ర ఆందోళనకు కారణమైంది. ముగ్గురు ఎమ్మెల్యేలకు వరుసగా కరోనా సోకడంతో టీఆర్ఎస్ పార్టీకి చెందిన కొందరు మంత్రులు, మరికొందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు అప్రమత్తమయ్యారు. అత్యవసరమైతే తప్ప తమ వద్దకు ఎవరూ రావద్దని, సమస్య ఏదైనా ఉంటే వాట్సాప్, ఫోన్ ద్వారా సంప్రదించాలని పార్టీ కార్యకర్తలకు, నాయకులకు సోషల్ మీడియా ద్వారా విజ్ఞప్తి చేశారు. తనను శుభకార్యాలకు, శంకుస్థాపనలకు పిలవవద్దని, పిలిచినా రానని హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ఫేస్ బుక్ ద్వారా తేల్చి చెప్పారు.
ఇదే దశలో ఇతర పార్టీలకు చెందిన నాయకులు సైతం కరోనా పేషెంట్లుగా మారుతున్నారు. పీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డికి కరోనా పాజిటివ్ రిజల్ట్ వచ్చిన సంగతి తెలిసిందే. బీజేపీ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డికి కరోనా సోకగా, చికిత్స తీసుకుంటున్నారు. తెలంగాణాలో బీజేపీకి చెందిన ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్ ను కరోనా భయం వెంటాడుతోంది. ఆయ గన్ మెన్ కు కరోనా సోకడమే ఇందుకు కారణం. ముందు జాగ్రత్తగా రాజాసింగ్ కు చేసిన వైద్య పరీక్షల నివేదిక రావలసి ఉంది.
తెలంగాణా ఆర్థిక మంత్రి హరీష్ రావు, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి హోం క్వారంటైన్లో ఉన్నారు. మరోవైపు పోలీసు ఉన్నతాధికారులను సైతం కరోనా కలవరపెడుతోంది. రాజధానిలోని ముగ్గురు ఐపీఎస్ అధికారులకు కరోనా సోకినట్లు వార్తలు వచ్చాయి. వీరి సంఖ్య ఐదు వరకు ఉంటుందనే ప్రచారం మరోవైపు సాగుతోంది. డీజీపీ కార్యాలయంలో పనిచేసే ఓ ఉద్యోగికి కరోనా సోకిన ఫలితంగా అదనపు డీజీ స్థాయి ఐపీఎస్ అధికారి హోం క్వారంటైన్ కు వెళ్లక తప్పలేదు.
తాజాగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి. హనుమంతరావుకు కూడా కరోనా సోకింది. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ లోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఓ వైపు రాజకీయ నాయకులు, మరోవైపు ఐపీఎస్ వంటి ఉన్నతాధికారులు కరోనా బారిన పడుతున్న పరిణామాలు సహజంగానే తీవ్ర ఆందోళనకు కారణమవుతున్నాయి. ఎందుకంటే… వారికి సన్నిహితంగా మెలిగిన వారిలో తీవ్ర గుబులు కలుగుతోంది.