ఈ దృశ్యాలు చూడండి. నాగార్జునసాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా మాంచి మాస్ పొలిటికల్ లీడర్ నిర్వహించిన బహిరంగ సభకు హాజరైన జనం మాత్రం కాదు. ఖమ్మం నగరంలో ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం సందర్భంగా సినిమా హీరో, హీరోయిన్లను తిలకించడానికి హాజరైన అశేష జనవాహినిగా అభివర్ణించాల్సిన చిత్రాలివి. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ కారణంగా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇటువంటి జనసమీకరణ కార్యక్రమానికి సంబంధిత అధికారులు ఎలా అనుమతిచ్చారనే ప్రశ్నలు రేకెత్తుతున్నాయి.
వాస్తవానికి ఈ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న హీరో, హీరోయిన్లు షాపింగ్ మాల్ లో ఉన్నది కొద్ది నిమిషాలే. కానీ అంతకు ముందు ఇద్దరు యాంకర్లతో దాదాపు రెండు గంటలపాటు యాంకరింగ్ చేయిస్తూ జనం భారీ ఎత్తున పోగు కావడానికి షాపింగ్ మాల్ యాజమాన్యమే కారణమనే విమర్శలు వచ్చాయి. కనీసం మాస్కులు కూడా ధరించకుండా పెద్ద ఎత్తున హాజరైన జనసంఖ్యతో కరోనా కేసులు పెరిగితే అందుకు బాధ్యులెవరన్నదే అసలు ప్రశ్న. కాగా కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించినవారిపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తామని ఖమ్మం పోలీస్ కమిషనరేట్ అధికారులు తాజాగా హెచ్చరికలు జారీ చేసిన పరిణామాల్లోనే ఈ దృశ్యాలు చోటు చేసుకోవడం గమనార్హం.