ఇక్కడ మీరు చూస్తున్నది ఎవరో బాడీ బిల్డర్ గా భావిస్తే పొరపాటే అవుతుంది. ఆయన ఐఎఎస్ ఆఫీసర్. ఔను… ఓ జిల్లాకు కలెక్టర్ కూడా. ఎక్కడో కాదు. మన తెలంగాణాకు సరిహద్దుల్లో, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు అనుకుని ఉన్న ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లా కలెక్టర్ వినీత్ నందన్వర్. ఇప్పుడీ కలెక్టర్ శరీర దారుఢ్య ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
కలెక్టర్ వినీత్ ఫొటోలు చూసిన యువత ప్రేరణ పొందుతోంది కూడా. సిక్స్ ప్యాక్ అబ్స్, పర్ఫెక్ట్ బాడీ చిత్రాలు వాట్సాప్, ఇతర సోషల్ మీడియా వేదికలపై చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవలే సుక్మా జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన ఐఎఎస్ వినీత్ నందన్వర్ తన ఆరోగ్యకర శీవన శైలి గురించి యువతకు ఉద్భోదిస్తున్నారు. తన శరీర దారుఢ్యాన్ని కాపాడుకోవడానికి ఆయన తీవ్రంగా శ్రమిస్తుంటారు. ప్రభుత్వ విధులు ముగిసిందే తడవుగా మిగతా సమయాన్ని తన సిక్స్ ప్యాక్ కండలను కాపాడుకునేందుకు కఠోర వ్యాయామం చేస్తుంటారు.
ఎప్పుడూ బిజీ, బిజీగా గడిపే వినీత్ గత ఆగస్టులో కరోనా బారిన పడ్డారు. ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొంది కోలుకున్నారు. అయితే ఆ తర్వాత తన శరీర దారుఢ్యాన్ని తిరిగి రాబట్టుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చిందని వినీత్ చెబుతున్నారు. క్రమశిక్షణ, జీవనశైలి ఫలితంగానే కరోనా అనంతరం తన శరీర దారుఢ్యాన్ని తిరిగి పొందగలిగానని పేర్కొన్నారు. వ్యాయామం ద్వాారా మాత్రమే సంక్రమించిన తన శరీర కండలను కాపాడుకునేందుకు ఎటువంటి ప్రత్యేక పొడులనుగాని, ఇతరత్రా చెడు మార్గాలను గాని ఆశ్రయించనని కలెక్టర్ వినీత్ చెప్పారు.
నాలుగేళ్ల కఠోర కృషి ఫలితమే ప్రస్తుత తన శరీర రూపంగా వెల్లడించారు. సహజ ఆహారాన్ని మాత్రమే తాను తీసుకుంటానని, జంక్ ఫుడ్, వేపుడు పదార్ధాల జోలికి వెళ్లనని వినీత్ స్పష్టం చేశారు. చక్కటి శరీర రూపానికి, ఆరోగ్యానికి వ్యాయామం అవశ్యకతను ఆయన యువతకు ఎప్పుడూ చెబుతూనే ఉంటారు. సుక్మా కలెక్టర్ వినీత్ నందన్వర్ ‘బాడీ బిల్డర్’ ఫొటోల గురించి జాతీయ మీడియా సైతం ప్రత్యేక వార్తా కథనాలను అందిస్తుండడం విశేషం.