తనను ఎన్నుకున్న ప్రజలకు ఓ సర్పంచ్ ప్రొటీన్లతో కూడిన ఆహార పదార్థాలను అందించారు. ఆహార పదార్థాలంటే నాలుగు ఉల్లిగడ్డలు, పావు కిలో టమాటాలు, చిటికెడు చింతపండు, పప్పూ, ఉప్పు కాదండోయ్… ఏకంగా ఓ కోడిని, మరో పది కోడిగుడ్లను తన గ్రామ ప్రజలకు శనివారం ఉచితంగా పంపిణీ చేయడం విశేషం.
సంగారెడ్డి జిల్లా గుంతపల్లి సర్పంచ్ పడమటి సుమిత్ర ప్రజలకు పంపిణీ చేసిన ఇంటికో కోడి, 10 గుడ్ల వార్త చర్చనీయాంశంగా మారింది. గ్రామస్తుల ఆరోగ్యమే తనకు ముఖ్యమని, కరోనా నేపథ్యంలో ప్రజలకు ప్రొటీన్లతో కూడిన ఆహారం అవసరమని ఆమె అంటున్నారు. ఈమేరకు గ్రామంలోని 450 కుటుంబాలకు ఇంటింటికీ ఓ కోడి, 10 కోడిగుడ్లను సర్పంచ్ కుమారుడు అనంత్ రెడ్డి పంపిణీ చేయడం విశేషం.
ఇప్పటికే గ్రామంలోని కుటుంబాలకు ఆమె వారానికి సరిపడా కూరగాయలను, ఇతర నిత్యావసర సరుకులను దశలవారీగా పంపిణీ చేశారు. కరోనా విపత్తులో ప్రజలకు అండగా నిలవడం తన బాధ్యతగా భావించి సాయం చేస్తున్నట్లు సర్పంచ్ సుమిత్ర పేర్కొన్నారు. గ్రామస్తులు గడప దాటకుండా కరోనా కట్టడికి సహకరించాలని ఆమె ఈ సందర్భంగా ప్రజలను కోరారు.