రాజకీయం, రౌడీయిజం పెనవేసుకునే బంధం గురించి మనం సినిమాల్లో ఎక్కువగా చూస్తుంటాం. కానీ వర్తమాన రాజకీయాల్లో ఓ ఎన్కౌంటర్ ఘటన ఉత్తర ప్రదేశ్ రాజకీయాలను అతలాకుతలాం చేస్తోంది. మోస్ట్ వాంటెడ్ రౌడీషీటర్ వికాస్ దూబే ముఠా జరిపిన కాల్పుల్లో డీఎస్పీ, ముగ్గురు ఎస్ఐలు సహా ఎనిమిది మంది పోలీసు అధికారులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా ఈ సంఘటన పెద్ద సంచలనానికి దారి తీసింది.
వికాస్ దూబేని అరెస్ట్ చేసేందుకు వెళ్లిన పోలీసుల గురించి చౌబేపూర్ ఠాణాకు చెందిన పోలీసులు సమాచారాన్ని ముందే లీక్ చేశారనే ఆరోపణలపై స్టేషన్ హౌజ్ ఆఫీసర్ వినయ్ తివారీని సస్పెండ్ చేసి విచారిస్తున్నారు. మరో ఇద్దరు ఎస్ఐలు సహా ముగ్గురు పోలీసులను కూడా సస్పెండ్ చేశారు. ఇంకా దాదాపు 200 మంది పోలీసుల వ్యవహారశైలిపైనా దర్యాప్తు జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే వికాస్ దూబే ప్రధాన అనుచరుడు అమర్ దూబే పోలీసులతో జరిగిన ఎన్కౌంటర్ ఘటనలో కొద్ది గంటల క్రితమే హతమయ్యాడు.
ఈ నేపథ్యంలోనే రౌడీషీటర్ వికాస్ దూబే రాజకీయ నేతలతో, పోలీసు అధికారులతో సంబంధాలు కలిగి ఉన్నారనే వార్తలు సైతం జాతీయ మీడియాలో కుప్పలు తెప్పలుగా వస్తున్నాయి. బీజేపీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలతో ముందు నుంచే వికాస్ దూబేకు సంబంధాలు ఉన్నాయన్నది ఈ వార్తల సారాంశం. వికాస్ దూబేను 2017లో ఓ కేసు విచారణలో భాగంగా కాన్పూర్ పోలీసులు తీసుకురాగా, తనను ప్రశ్నించడానికి ముందే బీజేపీ ఎమ్మెల్యేలు అభిజిత్ సంగా, భగ్వతీ సాగర్ ల పేర్లు చెప్పి కేసు నుంచి తప్పించుకున్నాడట.
ఇక తాజాగా యూపీ రాజకీయ నేతలతో వికాస్ దూబే, ఓ పోలీసు ఉన్నతాధికారులతో వికాస్ దూబే కోశాధికారిగా పేర్కొంటున్న జై అనే వ్యక్తి సన్నిహితంగా ఉన్న ఫోటోలు ట్వీట్ల రూపంలో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అందుకు సంబంధించిన ట్వీట్లను దిగువను మీరూ చూడవచ్చు.