‘‘పాలక విధానాలకు అనుగుణంగా, మా శాఖ అవసరార్థం, సందర్భానుసారం ఇటువంటి వ్యక్తులను మేం పెంచి పోషిస్తుంటాం… వాళ్లను వాడుకుంటాం… అది సమాజహితపు వ్యవస్థ కోసం మాత్రమే. కానీ ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేస్తూ, ఇటువంటి వ్యక్తులు ప్రజాకంఠకులుగా మారి, తలనెప్పిగా పరిణమించినపుడు మా తుపాకీకి మేం పని చెబుతాం. గతంలో వాళ్లు మాకు సహకరించినా సరే, ఇటువంటి వ్యక్తులను నిర్దాక్షిణ్యంగా ఏరివేసేందుకు మేం కఠిన చర్యలు తీసుకోకతప్పదు. పెంచిన చెట్టు ఆక్సిజన్ కాకుండా విషవాయువును వదిలినపుడు దాన్ని నరికేయడం మాకు పెద్ద సమస్య కాదు ’’
ఉమ్మడి రాష్ట్రంలో నక్సల్ ఉద్యమ అణచివేతలో దూకుడుగా వ్యవహరించిన ఓ ఐపీఎస్ అధికారి దాదాపు 23 ఏళ్ల క్రితం చెప్పిన భాష్యమిది. ఉత్తర తెలంగాణా జిల్లాల్లో ‘ఖతర్నాక్’ ఎస్పీగా ప్రాచుర్యం పొందిన ఆయా ఐపీఎస్ అధికారి అప్పటి పీపుల్స్ వార్ ఉద్యమాన్ని నిర్మూలించడంలో కీలక పాత్ర పోషించారు. ‘కోవర్ట్’ ఆపరేషన్ల సృష్టికర్తగా ఆయనకు పేరుంది. తదనంతర పరిణామాల్లో రాజధాని నగరానికి ఆయన బదిలీపై వెళ్లారు. కోవర్ట్ ఆపరేషన్ల కోసం పోలీసు శాఖ తరపున ఆయన వినియోగించినట్లు ప్రాచుర్యంలోకి వచ్చిన వ్యక్తులు కొందరు భూదందాలకు, అక్రమ వసూళ్లకు, సెటిల్మెంట్లకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఓ దశలో ప్రభుత్వానికే సవాల్ గా పరిణమించిన పరిస్థితి. అటువంటి సమయంలోనే అడిగిన ప్రశ్నకు ఆయన చెప్పిన సమాధానమే తొలి పేరాగ్రాఫ్. అనంతర పరిణామాల్లో ఆయా ఐపీఎస్ అధికారి చెప్పిన విధంగానే రాష్ట్రంలో పలు ఘటనలు చోటు చేసుకున్నాయి కూడా. గ్యాంగ్ స్టర్ నయీమ్ అంశం ఇందుకో ఉదాహరణగా పోలీసు అధికారులు చెబుతుంటారు. ఇప్పుడీ ప్రస్తావన దేనికంటే…?
వికాస్ దూబే… తెలుసుగా? దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాన్పూర్ ఎన్కౌంటర్లో మోస్ట్ వాంటెడ్ రౌడీషీటర్. ఓ డీఎస్పీ, ముగ్గురు ఎస్ఐలు సహా ఎనిమిది మంది పోలీసుల అధికారులను పొట్టనబెట్టుకున్న కిల్లర్ గ్యాంగ్ లీడర్. ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రంలో గన్ కల్చర్ కొత్తగా ప్రస్తావించే అంశం కాకపోవచ్చు. జాతీయ మీడియా కథనాల ప్రకారం రాజకీయ నేతలతో అక్కడి రౌడీయిజానికి సంబంధాలు సరికొత్తవి కాకపోవచ్చు. కానీ ఓ ఎన్కౌంటర్ జరిగాక, అందుకు ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న ఓ రౌడీషీటర్ వారం రోజులుగా పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతుండడమే అసలు విశేషం.
అధునాతన సాంకేతిక వనరులను వినియోగించినప్పటికీ వికాస్ దూబే చాకచక్యంగా తప్పించుకుని తిరుగుతుండడడమే ఆశ్చర్యకరంగా తెలంగాణాలోని పలువురు సీనియర్ పోలీసు అధికారులు అభివర్ణిస్తున్నారు. ఆసక్తికర అంశమేమిటంటే వికాస్ దూబేకు పోలీసు శాఖలోనే ‘ఇన్ఫార్మర్లు’ విచ్చలవిడిగా ఉండడం. కాన్పూర్ పరిసరాల్లోని నాలుగు పోలీస్ స్టేషన్ల పరిధిలో దాదాపు 200 మంది పోలీసులు వికాస్ దూబేకి సహకరిస్తున్నారట. ఈ ముఠాతో ఆయా పోలీసులకు గల సంబంధాలపై ప్రస్తుతం విచారణ కూడా జరుగుతోంది.
ఒకరు కాదు ఇద్దరు కాదు పోలీసు శాఖకు చెందిన 40 స్పెషల్ టీమ్ లు వికాస్ దూబే కోసం తీవ్రంగా గాలిస్తున్నాయి. ఫరీదాబాద్ లోని ఓ హోటల్లో వికాస్ దూబే తలదాచుకున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. కానీ పోలీసులు అక్కడికి వెళ్లేసరికే అతను తప్పించుకోవడం గమనార్హం. హోటల్ సీసీ ఫుటేజీలో ఇదే సీన్ కనిపించింది కూడా. ‘దృశ్యం’ సీనిమాలో చూపించిన విధంగా తన మొబైల్ ఫోన్ ను వికాస్ దూబే నేపాల్ వైపు వెడుతున్న ఓ కారులో పడేనట్లు పోలీసులు కనుగొన్నారు. తద్వారా తనకోసం గాలిస్తున్న బృందాలను తప్పుదోవ పట్టించాడు. వికాస్ దూబే కదలికల గురించి గాలింపు బృందాలకు ఉప్పందుతున్నప్పటికీ, పోలీసులు అక్కడికి చేరుకునేలోపే అతను తప్పించుకుంటున్న తీరు పోలీసు ఉన్నతాధికారులను విస్మయానికి గురిచేస్తోంది. దీంతో ఏరోజుకారోజు అతనిపై నగదు రివార్డు మొత్తాన్ని పెంచుతున్నారు. ప్రస్తుతం ఈ మొత్తం రూ. 5 లక్షలకు చేరుకుంది.
వికాస్ దూబేకు పోలీసులతో గల సన్నిహిత సంబంధాలపై ముఠా కాల్పుల్లో మరణించిన డీఎస్పీ దేవేంద్ర మిశ్రా గతంలోనే ఓ లేఖ రాసినట్లు వెలుగులోకి వచ్చింది. చౌబేపూర్ స్టేషన్ హౌజ్ ఆఫీసర్ వినయ్ తివారీకి వికాస్ దూబే ముఠాతో సన్నిహిత సంబంధాలున్నట్లు డీఎస్పీ రాసిన లేఖలో బహిర్గతమైనట్లు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. గత మార్చి14వ తేదీన డీఎస్పీ దేవేంద్ర మిశ్రా ఈ లేఖ రాసినప్పటికీ డీఐజీ అనంత్ వినయ్ తివారీపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. తాజా పరిణామాల్లో అనంత్ పై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. చౌబేపూర్ స్టేషన్ హౌజ్ ఆఫీసర్ వినయ్ తివారీని, మరో ఇద్దరు ఎస్ఐలు సహా నలుగురు పోలీసులను ఇప్పటికే ఈ ఘటనలో ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ వికాస్ దూబే అంశంలో మొత్తంగా చెప్పేదేమిటంటే… తీవ్రవాదుల, సంఘ వ్యతిరేక శక్తుల అణచివేతకు పోలీసులు ‘ఇన్ఫార్మర్’ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటారు. ఇందుకోసం నక్సల్ సానుభూతిపరులను, సాధారణ పౌరులను వినియోగించుకుంటారనే ప్రచారం ఉంది. కానీ వికాస్ దూబే పోలీసు శాఖలోనే ‘ఇన్ఫార్మర్ నెట్ వర్క్’ను ఏర్పాటు చేసుకోవడం గమనార్హం. పోలీసులకు సహకరిస్తే నక్సల్స్ పరిభాషలో పోలీస్ ఇన్ఫార్మర్ అంటుంటారు. మరి రౌడీలకు సహకరించే పోలీసులను ఏమని సంబోధించాలి…? రౌడీ ఇన్ఫార్మర్ అనొచ్చుగా..! మొత్తంగా వికాస్ దూబేను పెంచి పోషించిన యూపీ రాజకీయ నేతలు, పోలీసు వర్గాలు ఇప్పుడేం చేస్తాయన్నదే వేచి చూడాల్సిన అంశం.