నిన్న ఎన్కౌంటర్ కు గురైన కాన్పూర్ రౌడీషీటర్ వికాస్ దూబే ఉదంతం తెలంగాణాలోని రౌడీషీటర్లకు చిక్కులు తెచ్చిపెట్టింది. ఎక్కడి ఉత్తరప్రదేశ్? మరెక్కడి తెలంగాణా? అనే సంశయాలు కలుగుతున్నాయ్ కదూ! అక్కడే ఉంది అసలు విషయం.
శాంతిభద్రతల పరిరక్షణలో తెలంగాణా పోలీసులకు దేశంలోనే ప్రత్యేక పేరు ప్రఖ్యాతులు ఉన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా తీవ్రవాదం అణచివేతలో, నేర నియంత్రణలో, సైబర్ క్రైమ్ కట్టడి తదితర అంశాల్లో తెలంగాణా పోలీసుల నైపుణ్యత అనేకసార్లు ప్రశంసలకు నోచుకుంది కూడా. ఎక్కడైనా ఏదైనా అవాంఛనీయ స్థాయిలో సంచలన ఘటన జరిగితే చాలు తెలంగాణా పోలీసులు వెంటనే అలర్ట్ అవుతారు.
ఇదిగో ఇందులో భాగంగానే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్ లో జరిగిన ఘటన తెలంగాణా పోలీసులను మరోసారి అలర్ట్ చేసినట్లయింది. గత 3వ తేదీన రౌడీషీటర్ వికాస్ దూబే ముఠా చేతిలో డీఎస్పీ సహా ఎనిమిది మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే కదా? అనంతర పరిణామాల్లో వికాస్ దూబే అనుచరులు కూడా కొందరు పోలీసు ఎన్కౌంటర్లో హతమయ్యారు. మోస్ట్ వాంటెడ్ కిల్లర్ గ్యాంగ్ లీడర్ వికాస్ దూబే కూడా మధ్యప్రదేశ్ పోలీసులకు చిక్కి శుక్రవారం యూపీ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించి ఎన్కౌంటర్ లో మరణించాడు.
వికాస్ దూబే ఎన్కౌంటర్ ఘటనకు ముందే తెలంగాణా డీజీపీ మహేందర్ రెడ్డి నుంచి రాష్ట్ర పోలీసులకు ఆదేశాలు వచ్చాయట. అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోని రౌడీషీటర్ల కదలికలపై ప్రత్యేక నిఘా ద్వారా ఓ కన్నేసి ఉంచాలన్నది డీజీపీ ఆదేశాల సారాంశమట. కరోనా పరిణామాల్లో రాష్ట్రంలోని రౌడీషీటర్లపై పోలీసులకు కాస్త కాన్సంట్రేషన్ తగ్గినమాట వాస్తవమే కావచ్చు. వికాస్ దూబే ముఠా కాల్పుల దురాగతం నేపథ్యంలో డీజీపీ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు రాష్ట్ర పోలీసులు అప్రమత్తమై రౌడీ షీటర్లపై దృష్టి సారించారు.
పోలీసు రికార్డుల్లో గల రౌడీలు ప్రస్తుతం ఏం చేస్తున్నారు? వారి దిన చర్యలేమిటి? స్థానికంగానే ఉంటున్నారా? మరే ఇతర ప్రాంతాల్లోనైనా ఉంటున్నారా? వేరే ఏరియాల్లో ఉంటే అక్కడేం చేస్తున్నారు? స్థానికంగా వారి కదలికలేమిటి? ఇటువంటి అనేక ప్రశ్నలకు సంధిస్తూ రౌడీషీటర్లకు తెలంగాణా పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. ఫొటోలో మీరు చూస్తున్న దృశ్యం ఖమ్మం రూరల్ ఎస్ఐ రాము రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్న ఘటనకు సంబంధించినదే.