చూశారు కదా వీడియోను…? ఏపీ సీఎం వైెస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా ఏం చెప్పారో? కరోనా చికిత్స కోసం వచ్చే పేషెంట్లకు ఖచ్చితంగా అరగంటలో బెడ్ కేటాయించాలని, ఇందుకు విరుద్ధంగా జరిగితే కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు జవాబుదారీతనం వహించాల్సి ఉంటుందని కూడా స్పష్టం చేశారు. ఏ పేషెంట్ కూడా బెడ్ దొరకలేదని బాధపడరాదని, అదే జరిగితే మానవత్వానికే ప్రశ్నగా సీఎం జగన్ నిర్వచించారు. కోవిడ్ కేర్ ఆసుపత్రుల్లో బెడ్ లేదనే మాట రాకూడదని, వస్తే తీవ్ర నేరంగా పరిగణిస్తామని కూడా జగన్ స్పష్టీకరించారు. ఇక విషయంలోకి వెడదాం.
కానీ గురువారం జరిగిన ఈ ఘటన కరోనాకు సంబంధించింది కాకపోవడం గమనార్హం. ప్రాణాపాయ స్థితిలో గల ఓ ప్రభుత్వ ఉద్యోగికి ప్రయివేట్ ఆసుపత్రుల్లో చేదు అనుభవం ఎదురైనట్లు తాజా వార్త. నూజివీడులోని పౌర సంబంధాల శాఖలో టైపిస్టుగా పనిచేస్తున్న శౌరి ప్రసాద్ అనే వ్యక్తి కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతున్నారు. షుగర్ పేషెంట్ కూడా. ఈ నేపథ్యంలోనే మలేరియా, టైఫాయిడ్, కరోనా తదితర టెస్టులు కూడా చేయించుకున్నారు. ప్రసాద్ వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారని, షుగర్ తీవ్రత పెరగడంతో దాని ప్రభావం ఊపిరిత్తులపై పడిందని స్థానిక వైద్యులు చెప్పారట.
శ్వాస ఆడని విపత్కర పరిణామాల్లో శౌరి ప్రసాద్ ను హుటాహుటిన విజయవాడకు అంబులెన్సులో తరలించారు. అయితే ఇతనికి వైద్యం చేసే సంగతి దేవుడెరుగు, కనీసం చేర్చుకునేందుకు కూడా ప్రైవేట్ ఆసుపత్రుల నిర్వాహకులు నిరాకరించారు. దీంతో ప్రసాద్ ను తీసుకువెళ్లిన అంబులెన్స్ విజయవాడ నగర వీధుల్లోనే దాదాపు గంటసేపు చక్కర్లు కొట్టింది. కరోనా టెస్టుల్లో నెగిటివ్ రిపోర్టును చూపినా ప్రయివేట్ ఆసుపత్రులు అతన్ని చేర్చుకోకుండా నిర్దయను ప్రదర్శించాయి. చివరికి విషయాన్ని పౌర సంబంధాల శాఖకు చెందిన ఉన్నతాధికారులు కలెక్టర్ చెవిన వేయగా, ఆయన ఆదేశం మేరకు ఎట్టకేలకు విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో ప్రసాద్ ను చేర్చుకున్నారు.
వాస్తవానికి ప్రసాద్ కరోనా పేషెంట్ కానేకాదు. కానీ ప్రయివేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు అతన్ని చేర్చుకోవడానికి నిరాకరించి, ప్రవర్తించిన తీరు తీవ్ర వివాదాస్పదమైంది. ఈ ఘటనపై సీఎం జగన్ ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.