తెలంగాణా కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్ పర్సన్, సినీ నటి విజయశాంతి జర్నలిస్టు పాత్రలో ఒదిగపోతున్నారు. సినిమా పాత్రలో కాదు సుమీ.., రాజకీయ పాత్రలోనే. అలాగని ఆమె రాజకీయాలనేమీ విడనాడలేదు. కాకపోతే అచ్చంగా జర్నలిస్టులు రాసే భాషనే వాడుతూ ఫేస్ బుక్ పేజీలో అధికార పార్టీ నేతలను విమర్శిస్తున్నారు.
‘‘చర్చ జరుగుతోంది. టీఆర్ఎస్ వర్గాలు ప్రచారం మొదలు పెట్టాయి. ఈ వాదనకు బలం చేకూర్చే విధంగా.., విశ్లేషకులు చెబుతున్నారు. పలు అనుమానాలకు తావిస్తోంది. వాదన వినిపిస్తోంది. ప్రజలు అభిప్రాయపడుతున్నారు.’’ ఈ తరహా పదాలు ఎక్కడో చదివినట్టుంది కదూ? ఔను అనేక మంది జర్నలిస్టులు తమ వార్తా కథనాల్లో తరచూ వాడే పద ప్రయోగం ఇది. ఈ మధ్య కొందరు ఎడిటర్లు కూడా తమ వ్యాసాల్లో ఇదే తరహా పదాలను ఉపయోగిస్తున్నారనేది వేరే విషయం.
ఇక అసలు విషయంలోకి వస్తే… దుబ్బాక ఎన్నికల నేపథ్యంలో పీసీసీ ప్రచార కమిటీ చైర్ పర్సన్ విజయశాంతి తన ఫేస్ బుక్ ఖాతాలో ఈ తరహా భాషతో పోస్టులను పెడుతున్నారు. దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారానికి ఆమె వెళ్లిన దాఖలాలు కూడా లేవు. మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి నేరుగా విమర్శించిన ఉదంతాలు కూడా పెద్దగా లేవు. కానీ ఫేస్ బుక్ వాల్ పై మాత్రం టీఆర్ఎస్ నేతలపై ఇలా విరుచుకుపడుతున్నారు. విజయశాంతి ఫేస్ బుక్ పేజీలో గల పోస్టులను మెయిన్ స్ట్రీమ్ మీడియా వార్తా కథనాలుగా అందిస్తుండడం కూడా విశేషం. ఈనెల 26, 28 తేదీల్లో, సుమారు పది గంటల క్రితం కూడా విజయశాంతి ‘జర్నలిస్టు’ భాషా పదాలు ప్రామాణికంగా మూడు పోస్టులు పెట్టారు. ఆయా పోస్టులను దిగువన ఉన్నది ఉన్నట్లుగానే చదివేయండి మరి.
దుబ్బాక ఉప ఉపఎన్నికలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు డిపాజిట్లు రాకుండా చేయాలని కంటి మీద కునుకు లేకుండా.. చెమటోడ్చి పనిచేస్తున్న తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు గారికి ఆయన మామ, సీఎం కేసీఆర్ గారు ఊహించని షాక్ ఇచ్చినట్లు చర్చ జరుగుతోంది. దుబ్బాక ఉపఎన్నిక తర్వాత జిహెచ్ఎంసి ఎన్నికలను నిర్వహించి, ఆ ఫలితాలు వచ్చిన వెంటనే, తన తనయుడు కేటీఆర్‌ను సీఎం పదవిలో కూర్చోబెట్టేందుకు కెసిఆర్ గారు రంగం సిద్ధం చేసినట్టు టిఆర్ఎస్ వర్గాలు ప్రచారం మొదలు పెట్టాయి. ఈ వాదనకు బలం చేకూర్చే విధంగా… మొదటిసారి కెసిఆర్ గారి నోట సీఎం పదవికి రాజీనామా మాట బయటకు వచ్చింది. బీజేపీ మీద నెపం పెట్టి… తాను సిఎం పదవికి రాజీనామా చేస్తానని కెసిఆర్ గారు సంకేతాలివ్వడం భవిష్యత్ రాజకీయానికి అద్దం పడుతోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుత హోంమంత్రి, బిజెపి మాజీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా గారు గతంలో తెలంగాణ పర్యటనలో ఉన్నప్పుడు కేంద్ర నిధులను కేసీఆర్ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు. దీనిపై అప్పట్లో స్పందించిన కెసిఆర్ గారు, నోటికొచ్చినట్లు ఆరోపణలు చేయడం కాదు… ఆధారాలను చూపించకపోతే అమిత్ షా గారిని తెలంగాణ భూభాగం నుంచి కదలనివ్వనని వార్నింగ్ ఇచ్చిన విషయాన్ని ఎవరూ మర్చిపోలేరు. తర్వాత ఆ వార్నింగ్ ఏమైందో ఎవరికీ అంతుచిక్కలేదు. అంతేకాదు తనపైనా.. తన ప్రభుత్వం పైనా నిరాధార ఆరోపణలు చేస్తే, ప్రతిపక్ష నేతలను జైలుకు పంపిస్తానని కెసిఆర్ గారు బెదిరించిన సందర్భాలు కూడా ఉన్నాయి. తన ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తే ప్రతిపక్షాలపై విరుచుకుపడే కేసీఆర్ గారు, ఇప్పుడు సీఎం పదవికి రాజీనామా చేస్తానని కొత్త అంశాన్ని ఎందుకు తెరమీదకు తెచ్చారు అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఓవైపు హరీష్ రావు గారు దుబ్బాకలో ప్రచారం చేస్తూ బీజేపీ నేతల మీద విరుచుకు పడుతున్న తరుణంలో.. ఆయన ప్రచారాన్ని డామినేట్ చేసే విధంగా కెసిఆర్ గారు బిజెపి నేతలకు సవాల్ విసరడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ ప్రకటన బిజెపి నేతలకే కాదు.. పరోక్షంగా హరీష్ రావు గారికి కూడా సంకేతం ఇచ్చినట్టే అని తెలంగాణ సమాజం భావిస్తోంది. మొత్తం మీద కెసిఆర్ గారి రాజీనామా ప్రకటన చూస్తుంటే.. దుబ్బాక ఉపఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించిన తర్వాత (ఒకవేళ గెలిస్తే) హరీష్ రావు గారికి ఆయన మామ కేసీఆర్ గారు బంపర్ గిఫ్ట్ ఇవ్వబోతున్నారని… ఆ గిఫ్ట్ ఏమిటంటే.. తాను సీఎం పదవికి రాజీనామా చేసి, కేటీఆర్‌ను సిఎం గద్దెపై కూర్చోబెట్టబోతున్నారన్న వాదన వినిపిస్తోంది. ఎంతైనా నమ్మినవారిని గొంతు కోయడంలో కెసిఆర్ గారు అనుసరించే స్టైలే వేరు…
విజయశాంతి, కాంగ్రెస్ పార్టీ (తెలంగాణ)
దుబ్బాక ఎన్నికల్లో అధికార టీఆరెస్ సర్వ విధాలుగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నట్లు తెలంగాణ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల కోడ్ రావడానికి ముందే టీఆరెస్ ఆ నియోజకవర్గంలో గెలుపు కోసం అనేక దుష్ప్రయోగాలు ప్రారంభించింది. గత కొన్నిరోజులుగా మరింత బరితెగించేందుకు అధికార పార్టీ సిద్ధపడుతున్నట్టు స్పష్టమవుతోంది. ఈ పరిస్థితుల్లో ఆ ఎన్నిక జరపడం ప్రజాస్వామ్యానికి శ్రేయస్కరమా కాదా అన్న సందేహాలు కూడా సమాజంలో వ్యక్తమవుతున్నాయి.
విజయశాంతి చైర్పర్సన్, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రచార కమిటీ
దుబ్బాక ఉప ఎన్నికలో జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బిజెపిలకు డిపాజిట్ కూడా రాదని ఆర్థిక మంత్రి హరీష్ రావు గారు చేసిన వ్యాఖ్యలు పలు అనుమానాలకు తావిస్తున్నాయి. దీన్నిబట్టి ఎన్నికలకు ముందే ఫలితాలు ఏ విధంగా ఉండాలో టిఆర్ఎస్ పార్టీ నిర్ణయించే స్థాయికి వెళ్లి పోయిందంటే… అధికార పార్టీ అరాచకాలపై దుబ్బాక ఓటర్లకు స్పష్టత వచ్చి ఉంటుంది. హరీష్ రావు గారి కామెంట్ చూస్తూ ఉంటే… దుబ్బాక లో పోలింగ్ జరిగిన తర్వాత… కెసిఆర్ గారి ఫామ్ హౌస్‌లో ఈవీఎం మిషన్లను పెట్టి, ఓట్లను లెక్కిస్తారో ఏమో? అనే అనుమానం కలుగుతోంది. అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే మరణించడంతో జరిగే ఉప ఎన్నిక విషయంలో టిఆర్ఎస్ పార్టీ… ముఖ్యంగా హరీష్ రావు గారు ఎందుకు ఇంత హైరానా పడుతున్నారో ఎవరికి అంతుబట్టడం లేదు. కాంగ్రెస్, బిజెపిలకు గత ఎన్నికలతో పోలిస్తే ఈ ఉప ఎన్నికలో ఎక్కువ ఓట్లు వస్తే.. దాని ప్రభావం హరీష్ రావు గారి మంత్రి పదవి మీద పడుతుందని సీఎం కెసిఆర్ గారు ఏదన్నా అల్టిమేటం జారీ చేశారా? అన్న చర్చ కూడా జరుగుతోంది. అందుకే తెలంగాణ ఆర్థికశాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావు గారు, కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు మెదక్ జిల్లాకు కేటాయించిన నిధుల కంటే… దుబ్బాకలో ఓటర్లను కొనేందుకు ఖర్చు చేస్తున్న డబ్బు ఎక్కువగా ఉందని స్థానికులు చర్చించుకుంటున్నారు.
విజయశాంతి చైర్పర్సన్, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రచార కమిటీ