రెవెన్యూ శాఖకు చెందిన పలువురు తహశీల్దార్లు, ఇతర అధికారులు ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో అక్రమాలకు పాల్పడినట్లు విజిలెన్స్ విభాగం ప్రభుత్వానికి నివేదించింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల్లో రెవెన్యూ అధికారులు సిబ్బంది పెద్ద ఎత్తున అక్రమంగా డబ్బు వసూళ్లకు పాల్పడినట్లు నివేదించింది. ఈ తరహా వసూళ్లకు పాల్పడినవారి జాబితాలో తహశీల్దార్లు, డిప్యూటీ తహశీల్దార్లు, రెవెన్యూ ఇన్స్ పెక్టర్లు, వీఆర్ ఏలు, వీఆర్వోలు తదితరులు ఉన్నట్లు వివరించింది.
కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల్లో ఒక్కో దరఖాస్తుదారు నుంచి కనిష్టంగా వెయ్యి నుంచి రూ. 10 వేల వరకు అక్రమ వసూళ్లకు పాల్పడినట్లు విజిలెన్స్ విభాగం మెమో. నెం. 7616/విజిలెన్స్. III-20201-1ద్వారా నివేదించింది.ఈ వసూళ్ల కోసం పలువురు ప్రజాప్రతినిధులను, సిబ్బందిని, దళారులను నియమించుకున్నట్లు కూడా నివేదికలో స్పష్టం చేసింది.
వాస్తవానికి ఈ నివేదిక గత జూన్ 19వ తేదీన రాగా, పలువురు జిల్లా కలెక్టరేట్లలో దీన్ని రహస్యంగా ఉంచినట్లు సమాచారం. తహశీల్దార్లు, ఇతర అధికారులు, సిబ్బంది సహా మొత్తం 43 మందిపై చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ విభాగం ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఈమేరకు తగిన చర్యలు తీసుకుని నివేదించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వు కూడా జారీ చేశారు.
కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల్లో అక్రమాలకు పాల్పడిన అధికారుల, సిబ్బంది జాబితాను వరంగల్ అర్బన్ (ప్రస్తుత హన్మకొండ), జనగామ, భూపాలపల్లి, మహబూబాబాద్, నల్లగొండ, సూర్యాపేట, నాగర్ కర్నూల్, నిజామాబాద్ జిల్లాల కలెక్టర్లకు ఉత్తర్వు ప్రతిని కూడా పంపించారు.
విజిలెన్స్ నివేదికలో ఎవరెవరు…? పూర్తి వివరాలు తర్వాత కథనంలో…